అతివలకు అండగా.. ఇందిరా మహిళా శక్తి

అతివలకు అండగా.. ఇందిరా మహిళా శక్తి
  •  మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు

  • చిన్న చిన్న వ్యాపారాలకు లోన్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం

  • స్వయం ఉపాధి యూనిట్ల మంజూరుకు రూ.18 వేల కోట్లు కేటాయింపు

  • ఇప్పటికే 50 శాతం యూనిట్లకు రుణాలు

హైదరాబాద్, వెలుగు : నైపుణ్యం ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇంటికే పరిమితమైన గ్రామీణ ప్రాంత మహిళలకు అవకాశాలు అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళల స్వయం ఉపాధికి బాటలు వేయడంతో పాటు  వారి ఆర్థిక అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా యూనిట్లు మంజూరు చేస్తోంది. 

ఇందులో భాగంగా 63 లక్షల మంది మహిళలను వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి పథకానికి’ శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా స్త్రీ నిధి, బ్యాంకులతో లింక్‌‌‌‌‌‌‌‌ చేసి లోన్లు మంజూరు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక మహిళలు వివిధ రంగాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు రూ.18.50 వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా 99,685 స్వయం సహాయక సంఘాలకు రూ.8,569.16 కోట్లు మంజూరు చేసింది. 

12 రకాల యూనిట్లు

మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ సెంటర్లతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్క్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామైక్య సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కోసం 12 రకాల యూనిట్లు మంజూరు చేస్తోంది. 

ఇందులో పాడి పశువులు, మీ – సేవా కేంద్రాలు, సోషల్‌‌‌‌‌‌‌‌ మొబిలైజేషన్, కుటీర పరిశ్రమలు, ఆహార శుద్ధి కేంద్రాలు, పౌల్ట్రీ యూనిట్లు, పౌల్ట్రీ మదర్‌‌‌‌‌‌‌‌ యూనిట్లు, మిల్క్​పార్లర్లు, అమ్మ క్యాంటీన్లు, క్యాటరింగ్, బ్యూటీషియన్, ప్రింటింగ్, సౌండ్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌, డెకరేషన్, టెంట్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌ల నిర్వహణ వంటి యూనిట్లు ఉన్నాయి. వీటితో పాటు ఈవెంట్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో సైతం మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. 

మైక్రో, స్మాల్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటుకు చేయూతనందించనున్నారు. ఈ పథకంలో మహిళల బృందానికి రూ.20 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా 5 వేల గ్రామీణ సంఘాలకు, ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ధి చేకూరేలా కార్యాచరణ రూపొందించింది. రాబోయే ఐదేండ్లలో 25 వేల సంస్థలకు విస్తరింపచేసే దిశగా ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా స్కూల్‌‌‌‌‌‌‌‌ యూనిఫాంలు కుట్టే పనిని మహిళా సంఘాల సభ్యులకు అప్పగిస్తున్నారు. ఇందుకోసం జతకు రూ.50 నుంచి రూ.75 ఇవ్వనున్నారు.

 రాష్ట్రవ్యాప్తంగా 29,680 మహిళా సభ్యులకు సుమారు రూ.50 కోట్ల లబ్ధి చేకూరుతుంది. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో సాశానిటేషన్‌‌‌‌‌‌‌‌, రిపేర్లు, నిర్వహణ మహిళా సంఘాల ద్వారానే చేపట్టనున్నారు. పాఠశాల నిర్వహణ కమిటీని సైతం మహిళా సంఘాల ప్రతినిధుల నేతృత్వంలో నిర్వహించనున్నారు. దిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని సైతం అమలు చేస్తున్నారు. సభ్యురాలు మరణించినపుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రూ. 2 లక్షల వరకు మాఫీ చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.50.41 కోట్లను కేటాయించింది. ఈ పథకం కింద స్వయం సహాయక సంఘాల్లోని 18 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు రూ. 10 లక్షల చొప్పున లైఫ్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ సౌకర్యాన్ని సైతం కల్పిస్తున్నామన్నారు. 

మహిళలకు నైపుణ్య శిక్షణ

మహిళలకు ఆసక్తి ఉన్న రంగాన్ని గుర్తించి వారికి ఆ రంగంలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులను అమెజాన్, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌, ఓఎన్డీసీ, బిగ్‌‌‌‌‌‌‌‌ బాస్కెట్‌‌‌‌‌‌‌‌ వంటి ఈ -కామర్స్‌‌‌‌‌‌‌‌ సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. అంతేకాకుండా సంఘాలు ఉత్పత్తి చేసే ఒకే రకమైన వస్తువులను జిల్లా కేంద్రంలో ఒక పాయింట్‌‌‌‌‌‌‌‌కు చేర్చి అక్కడే ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ సదుపాయంకల్పించనున్నారు. 

ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి మహిళలకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తారు. ఆయా సంఘాల ఉత్పత్తులకు అవసరమైన మార్కెట్‌‌‌‌‌‌‌‌ లింకేజీ ఏర్పాటు చేస్తారు.  స్వయం సహాయక సంఘాలను ఐఐటీలు, ఐఐఎం, ఐఎస్‌‌‌‌‌‌‌‌బీ, ఐఆర్‌‌‌‌‌‌‌‌ఎంఏ వంటి సంస్థలతో అనుసంధానించనున్నారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక మినీ పారిశ్రామిక పార్క్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.   

మిల్క్‌‌‌‌‌‌‌‌ పార్లర్‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్న

జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉండేది. గతంలో అవకాశాలు లేక ఇంటికే పరిమితమయ్యాను. ఉపాధికి ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుందని తెలిపి అప్లై చేసుకున్నా. నాకు రూ. 1.90 లక్షలు మంజూరు అయ్యాయి. ఆ డబ్బులతో మిల్క్‌‌‌‌‌‌‌‌ పార్లర్‌‌‌‌‌‌‌‌ పెట్టాను. ఇందులో పాలు, పెరుగు, నెయ్యి, వెన్నతో పాటు పాల ఉత్పత్తులను అమ్ముతున్నాం. దీంతో కుటుంబ పోషణకు భరోసా దొరికింది.

- చీదెర మణెమ్మ, మల్లంపల్లి, ములుగు జిల్లా–

రూ. 3 లక్షలతో శారీ సెంటర్‌‌‌‌‌‌‌‌ పెట్టా 

నా భర్త వ్యవసాయం చేస్తుండగా, నేను మిషన్‌‌‌‌‌‌‌‌ కుట్టేది. వాతావరణం అనుకూలించని టైంలో పంటలు పండక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం. ఇందిరా మహిళా శక్తి పథకం కోసం అప్లై చేసుకుంటే రూ. 3 లక్షలు మంజూరు అయ్యాయి. ఆ డబ్బులతో ఎంబ్రాయిడరీ వర్క్స్, శారీ సెంటర్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసుకున్న. దీంతో ఆర్థికంగా కొంత ఊరట లభించింది.  

-గూడెపు సునీత, మల్లంపల్లి, ములుగు జిల్లా-