- ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి లెటర్ రాసిన ఇండియా
- అక్టోబర్ 1నే ఐఓసీకి అధికారికలెటర్ పంపించిన ఐఓఏ
- ఇకపై నిరంతర చర్చలు
న్యూఢిల్లీ: నాలుగేండ్లకోసారి జరిగే విశ్వ క్రీడా సంబురం ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తామని చెబుతున్న ఇండియా అందుకు కీలక ముందడుగు వేసింది. 2036 ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహణ కోసం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో ఇన్నాళ్లూ అనధికారిక చర్చలు జరిపిన ఇండియా ఇప్పడు ఆతిథ్య హక్కులు కోరుతూ ఐఓసీకి చెందిన ఫ్యూచర్ హోస్ట్ కమిషన్‌కు లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఆసక్తి వ్యక్తీకరణ లేఖ) పంపించింది. అక్టోబర్ 1వ తేదీనే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధికారిక లేఖ ఇచ్చిందని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం లభిస్తే అది దేశంలో ఆర్థిక, సామాజిక వృద్ధితో పాటు ఎన్నో ప్రయోజనాలు తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి గతేడాది మాట్లాడారు. కాగా, ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులపై వచ్చే ఏడాది జరిగే ఐఓసీ ఎన్నికలు ముగిసే వరకూ ఎలాంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉండదు. అదే సమయంలో సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ వంటి దేశాలు కూడా ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ దేశాల నుంచి ఇండియాకు గట్టి పోటీ ఎదురవనుంది.
రెండేండ్ల ప్రక్రియ
లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడంతో ఆతిథ్య హక్కుల కోసం మన దేశం కీలక ముందడుగు వేసిందని చెప్పొచ్చు. ఇప్పటిదాకా అనధికారికంగా జరిగిన చర్చలు ఇకపై ఆతిథ్య దేశ ఎంపిక ప్రక్రియలో నిరంతర సంప్రదింపుల దశకు చేరుకున్నాయి. ఈ దశలో ఐఓఏ సదరు ఒలింపిక్ గేమ్స్ (2036) ఆతిథ్యానికి పోటీలో ఉన్న దేశంలో గేమ్స్‌కు సంబంధించిన ప్రాజెక్టుల పురోగతి గురించి అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయనంలో ఆతిథ్య దేశం ఆర్థిక పరిస్థితి, మానవ హక్కులు వంటి అనేక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. అనంతరం ఈ ప్రక్రియ తదుపరి దశ అయిన ‘టార్గెటెడ్ డైలాగ్’కు చేరుకుంటుంది. ఈ దశలో ఆతిథ్య హక్కులు కోరుతున్న దేశం ఆ ఎడిషన్ కోసం -నిర్దిష్ట అధికారిక బిడ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ అంచనా వేస్తుంది. చివరకు ఐఓసీ సభ్యుల రహస్య ఓటింగ్ ప్రక్రియతో ఆతిథ్య దేశాన్ని ఎన్నుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు రెండేండ్లు పడుతుంది.
ఇండియాకు ఐఓసీ చీఫ్ సపోర్ట్!
ఇండియా చివరగా 2010లో కామన్వెల్త్ గేమ్స్ రూపంలో మల్టీ స్పోర్టింగ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇప్పుడు ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలన్న ఆశిస్తున్న మనదేశానికి ఐఓసీ ప్రస్తుత ప్రెసిడెంట్ థామస్ బాచ్ సపోర్ట్ ఇచ్చారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ ముందు వరుసలో ఉంది. పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష సహా ఇండియాకు చెందిన టాప్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్లు ఐఓసీకి చెందిన నేతలు, అధికారులతో మాట్లాడారు. ఆతిథ్య హక్కుల కోసం లాబీయింగ్ చేశారు. ఒకవేళ 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు లభిస్తే యోగా, ఖో ఖో , కబడ్డీ వంటి దేశీయ ఆటలను మెగా గేమ్స్‌లో చేర్చడానికి ఇండియా ఒత్తిడి తెస్తుందని తెలుస్తోంది. విజయవంతమైన బిడ్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి నివేదికను ఇప్పటికే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలోని మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయాకు సమర్పించింది. ఆతిథ్య హక్కులు దక్కితే యోగా, ఖో ఖో, కబడ్డీ, చెస్, టీ20 క్రికెట్, స్క్వాష్ వంటి ఆరు ఆటలను గేమ్స్‌లో చేర్చాలని ఈ నివేదికలో ఎంఓసీ సూచించింది. ఇదిలా ఉండగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌లో పీటీ ఉష, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఐఓఏ సీఈవోగా రఘురామ్ అయ్యర్ నియామకాన్ని కౌన్సిల్ సభ్యులు నిరాకరిస్తున్నారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం ప్రయత్నిస్తున్న ఈ సమయంలోనైనా ఐఓఏ సభ్యులు ఒక్కతాటిపైకి వస్తారేమో చూడాలి.