Asian Games 2023: చెక్ దే ఇండియా : హాకీలో మనకు బంగారు పతకం

Asian Games 2023: చెక్ దే ఇండియా : హాకీలో మనకు బంగారు పతకం

భారత పురుషుల హాకీ టీం ఆసియా క్రీడల్లో సత్తా చాటింది. మరోసారి ఛాంపియన్ ఆటతీరుతో గోల్డ్ మెడల్ ని కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన మన హాకీ టీం ఆసియా క్రీడల్లో మాత్రం స్వర్ణాన్ని అందుకొని చైనా గడ్డపై భారత జెండాను రెపరెపలాడించింది. అక్టోబర్ 6, శుక్రవారం జరిగిన పురుషుల హాకీ ఫైనల్‌లో 5-1 తేడాతో 2018 ఛాంపియన్ జపాన్‌ను చిత్తు చేసింది.

మ్యాచ్ ఆధ్యంతం ఆధిపత్యం చూపించిన భారత్.. జపాన్ కి ఏ దశలోనూ గెలిచే అవకాశం ఇవ్వలేదు. ఈ విజయంతో భారత్ వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ జట్టు చోటు సంపాదించింది. మొత్తంగా ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ టీంకి ఇది నాలుగో బంగారు పతకం. గతంలో 1966, 1998, 2014 సంవత్సరాలలో పసిడిని ముద్దాడింది. 4 సంవత్సరాల క్రితం జకార్తాలో జరిగిన ఆసియా క్రీడలలో మాత్రం మన జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇక ఈ లిస్టులో 9 స్వర్ణాలతో పాకిస్థాన్ టాప్ లో కొనసాగుతుంది.