సారీ.. మాదే తప్పు: భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ

న్యూఢిల్లీ: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి పాలైందని మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో మెటా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ మేరకు మెటా ఇండియా విభాగం మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పింది. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు అని తప్పును అంగీకరించింది. ‘‘కొవిడ్, ద్రవోల్బణం వంటి అనేక సవాళ్లతో 2024లో వివిధ దేశాల్లో జరిగిన ఎన్నికలలో అధికార పార్టీలు తిరిగి ఎన్నిక కాలేదని మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు ఇతర దేశాలకు వర్తిస్తాయి. 

కానీ భారత్ విషయంలో ఈ వ్యాఖ్యలు సరికాదు. ఇది అనుకోకుండా జరిగిన తప్పిదం. దీనికి మేము క్షమాపణలు చెపుతున్నాం’’ అని మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తుక్రాల్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శివనాథ్ తుక్రాల్ క్షమాపణలు చెప్పడంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందించారు. ఈ మేరకు తుక్రాల్ పోస్ట్‌ను రీ-ట్వీట్ చేస్తూ.. మెటా అధికారి క్షమాపణ చెప్పడం దేశ పౌరుల విజయం అని పేర్కొన్నారు. భారత పార్లమెంటు, ఎన్డీఏ ప్రభుత్వానికి 1.4 బిలియన్ల ప్రజల ఆశీస్సులు, విశ్వాసం ఉందని అన్నారు. 


మార్గ్ జుకర్ బర్గ్ ఏమన్నారంటే..? 

ఇటీవల జో రోగన్ పోడ్‌కాస్ట్‎ షోలో మెటా సంస్థ అధినేత మార్క్ జుకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరిగిన ఎన్నికల గురించి మాట్లాడారు. 2024ను ఎన్నికల సంవత్సరంగా అభివర్ణించిన జుకర్ బర్గ్.. 2024లో భారత్‎తో సహా వివిధ దేశాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యాయని అన్నారు. కొవిడ్ వైరస్, ద్రవ్యోల్బణం ఆయా ప్రభుత్వాల పట్ల ప్రజల్లో విశ్వాసం క్షీణించడానికి దోహదం చేసిందని జుకర్ బర్గ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ALSO READ | Maha Kumbamela: చనిపోయిన తల్లి ఫొటోతో.. కుంభమేళాలో పుణ్యస్నానం

 భారత్ ఎన్నికలపై మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. దీంతో మెటా చీఫ్ మార్క్ జుకర్ బర్గ్‎ చేసిన వ్యాఖ్యలపై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశించింది. పార్లమెంటరీ కమిటీ నోటీసులు ఇవ్వడం.. వివాదం ముదురుతుండటంతో మెటా దిగిచ్చొంది. సంస్థ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు మెటా ఇండియా విభాగం క్షమాపణలు చెప్పింది.