న్యూజిలాండ్‌ ఓటమి...టాప్ లోకి భారత్

న్యూజిలాండ్‌  ఓటమి...టాప్ లోకి భారత్


ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టెబుల్ లో భారత్ తిరిగి టాప్ ప్లేసులోకి చేరుకుంది.  వెల్లింగ్‌టన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్‌ చిత్తుగా ఓడిపోవడం భారత్ కు బాగా కలసివచ్చింది.  దీంతో  3వ స్థానంలో ఉన్న భారత్ విన్నింగ్ రేటు 64.58  శాతంతో టాప్ లోకి దూసుకువచ్చింది.  

ప్రస్తుతం టీమ్‌ఇండియా 64.58 విజయాల శాతంతో టాప్‌లో నిలవగా.. న్యూజిలాండ్‌ 60 శాతం, ఆస్ట్రేలియా 59.09 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.   ఇక ధర్మశాలలో ఇంగ్లండ్ తో జరగబోయే చివరి టెస్టులో టీమిండియా గెలిస్తే అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవచ్చు.   క్రైస్ట్‌చర్చ్‌లో మార్చి 8 నుంచి ఆస్ట్రేలియాతో  జరిగే రెండో టెస్టులో న్యూజిలాండ్ గెలిచినా భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది.

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 172 పరుగుల తేడాతో విజయం సాధించింది.  దీంతో  సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 369 పరుగుల లక్ష్యంతో  సెంకడ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కివీస్ జట్టు  41 ఓవర్లలో 111/3 స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించి 196 పరుగులకు ఆలౌట్ అయింది.  

ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ రెండో ఇన్నింగ్స్ లో   65 పరుగులకు ఆరు వికెట్లు.. మొత్తంగా మ్యాచ్ లో పది వికెట్లు తీసి జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు.  తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్ని్ంగ్స్ లో ఒక వికెట్ తీసిన  ఆల్-రౌండర్ కామెరాన్ గ్రీన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.