- అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందేనని డిమాండ్
- సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం
- అమెరికన్ బిలియనీర్ సోరోస్ ఎజెండానే రాహుల్ అమలు చేస్తున్నరని బీజేపీ ఫైర్
- ఆందోళనల మధ్య ఉభయ సభలు నేటికి వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాల నుంచి కాంట్రాక్టులు పొందేందుకు ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీ కంపెనీ పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చిందన్న ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాల్సిందేనని ప్రతిపక్ష పార్టీల నేతలు మరోసారి డిమాండ్ చేశారు. గురువారం ఉదయం సభల ప్రారంభానికి ముందు పార్లమెంట్ బయట వినూత్న నిరసన తెలిపారు. ‘మోదీ,- అదానీ ఏక్ హై, అదానీ సేఫ్ హై’ అని రాసి ఉన్న స్టిక్కర్లను డ్రెస్ లపై వెనకవైపు అతికించుకుని ఆందోళన చేపట్టారు. ‘మోదీ, -అదానీ భాయ్ భాయ్’ అని నినాదాలు చేస్తూ సంవిధాన్ సదన్(పాత పార్లమెంట్ భవనం) ముందు బైఠాయించారు. తర్వాత సంవిధాన్ సదన్, పార్లమెంట్ కొత్త భవనం మధ్య ర్యాలీ నిర్వహించారు. అనంతరం ‘అదానీ ముడుపులతో ఎవరికి లాభం దక్కింది మోదీ?’అని రాసి ఉన్న ప్లకార్డులతో పార్లమెంట్ ముఖ ద్వారం మకర ద్వార్ వద్ద నిలబడి ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు.
ఈ ధర్నాలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర కాంగ్రెస్ ఎంపీలు, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మల్లు రవి, అనిల్ కుమార్ ఇతర ఎంపీలు పాల్గొని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ.. అదానీపై మోదీ విచారణ జరపలేదని, ఎందుకుంటే అది మోదీ తనపైన తానే వేసుకునే విచారణలా ఉంటుందని ఎద్దేవా చేశారు. కాగా, ప్రతిపక్షాల ఆందోళనపై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. సభకు వెళ్లే ఇతర ఎంపీలకు దారి ఇవ్వాలని హెచ్చరించారు. రూల్ 349 ప్రకారం.. సభలో జాతీయ జెండా తప్ప మరెలాంటి బ్యాడ్జ్ లు ప్రదర్శించరాదని, ధరించరాదని సభ్యులకు స్పష్టం చేశారు.