పూణే టెస్టులో భారత్ ఆత్మ విశ్వాసంతో కనిపిస్తుంది. కళ్ళ ముందు భారీ లక్ష్యం కనబడుతున్నా బెదరలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ ఔటైనా భవిష్యత్ స్టార్ ఆటగాడు జైశ్వాల్ మెరుపులు మెరిపించి భారత్ ను ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. అతనికి మరో యువ ఆటగాడు గిల్ చక్కని సహకారం అందిస్తున్నాడు. వీరిద్దరి ఆటతో భారత్ మూడో రోజు తొలి సెషన్ లో వికెట్ నష్టానికి 12 ఓవర్లలోనే 81 పరుగులు చేసింది. క్రీజ్ లో జైశ్వాల్ (46), గిల్ (22) ఉన్నారు. భారత్ విజయానికి మరో 278 పరుగులు కావాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.
359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. జైశ్వాల్ రెండో బంతికే సిక్సర్ బాది భారత్ ఖాతా తెరిచాడు. మరో ఎండ్ లో కెప్టెన్ రోహిత్ కూడా తొలి బంతికి ఫోర్ కొట్టి దూకుడు చూపించాడు. వేగంగా వెళ్తున్న భారత్ ను తొలి ఇనింగ్స్ హీరో సాంట్నర్ మరోసారి దెబ్బ కొట్టాడు. అద్భుత బంతితో రోహిత్ (8) ను పెవిలియన్ కు చేర్చాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడుతుందని భావించినా.. జైశ్వాల్, గిల్ కివీస్ కు ఆ అవకాశం ఇవ్వలేదు.
ఇద్దరూ బౌండరీల వర్షం కురిపించారు. ఇద్దరూ 38 బంతుల్లోనే అజేయంగా 47 పరుగులు జోడించారు. గిల్ నాలుగు బౌండరీలు బాదగా.. జైస్వాల్ 3 ఫోర్లు.. 3 సిక్సులతో సత్తా చాటాడు. 5 వికెట్ల నష్టానికి 198 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగించిన న్యూజిలాండ్ 255 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసింది.
India race to 81 for 1 in 12 overs before lunch on day 3 🏎️ https://t.co/3D1D83IgS1 #INDvNZ pic.twitter.com/wGBT8hC0iz
— ESPNcricinfo (@ESPNcricinfo) October 26, 2024