
న్యూఢిల్లీ: దేశ విమానయాన రంగం (ఏవియేషన్ సెక్టార్) వేగంగా వృద్ధి చెందుతోందని, మరికొన్నేళ్లలో కనీసం 20 వేల మంది పైలెట్లు అవసరమవుతారని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పైలెట్ల కోసం ఢిల్లీలోని ఉడాన్ భవన్‌లో ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ (ఈపీఎల్) ను ఆయన లాంచ్ చేశారు. కనెక్టివిటీకి, ఆర్థిక వృద్ధికి విమానయాన రంగం వెన్నెముక అని అన్నారు. ‘రానున్న ఐదేళ్లలో మరో 50 ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తాయి. గత పదేళ్లలో ఎయిర్‌పోర్టుల సంఖ్య రెండింతలు పెరిగి 157 కి చేరుకుంది.
ఎయిర్‌లైన్ కంపెనీలు ఇప్పటికే 1,700 విమానాల కోసం ఆర్డర్లు పెట్టాయి. ఏవియేషన్ సెక్టార్ వేగంగా విస్తరిస్తోంది. సమీప భవిష్యత్‌లో కనీసం 20 వేల మంది పైలెట్లు అవసరమవుతారు. ఇక నుంచి పైలెట్లు తమ లైసెన్స్‌ను ఈపీఎల్ ద్వారా ఈజీగా పొందొచ్చు’ అని నాయుడు వివరించారు. చైనా తర్వాత ఈపీఎల్‌ను అమలు చేస్తున్న రెండో దేశంగా ఇండియా నిలిచింది.