ఎన్డీయే ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చూద్దాం: మమతా బెనర్జీ

ఎన్డీయే ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చూద్దాం: మమతా బెనర్జీ

కోల్‌‌కతా:  కేంద్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఎన్డీయే ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చూద్దామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. త్వరలో  ఇండియా కూటమితోనే ప్రభుత్వం ఏర్పాటయ్యే చాన్స్ ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎంపీలతో శనివారం ఆమె సమావేశమయ్యారు. అనంతరం మమత మాట్లాడుతూ.. ‘‘దేశానికి మార్పు అవసరం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దేశం మార్పు కోసమే మేం వెయిట్ చేస్తున్నం. పరిస్థితిని 

క్షుణ్ణంగా గమనిస్తున్నాం. ప్రజా తీర్పు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చింది. కాబట్టి ఈసారి ఆయన ప్రధాని కాకూడదు. వేరొకరిని టేకోవర్ చేయడానికి అనుమతించడం బెటర్. 400 స్థానాలు గెలుస్తామని మాట్లాడిన వారు మాపై సాధారణ మెజారిటీని కూడా పొందలేకపోయారు. పెద్దపెద్ద ప్రభుత్వాలే ఒక్కరోజులో కూలిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎన్డీయే ప్రభుత్వం కూడా కూలిపోయి..ఇండియా కూటమి అధికారం చేపట్టవచ్చు. ఎన్డీయే ప్రభుత్వం 15 రోజులైనా ఉంటుందో లేదో ఎవరికి తెలుసు? దేశాన్ని బీజేపీ పాలించకూడదనే ప్రజల కోరికను నెరవేర్చడానికి ఇండియా  కూటమి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుంది’’ అని మమత పేర్కొన్నారు.

ప్రమాణ స్వీకారానికి వెళ్లను..

కేంద్రంలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో టీఎంసీ పాల్గొనబోదని మమత తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవానికి తమకు ఆహ్వానం అందలేదని.. అందినా వెళ్లబోమని చెప్పారు. బీజేపీ అప్రజాస్వామికంగా, అక్రమంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని విమర్శించారు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో దేశానికి ముప్పు తప్పిందని చెప్పారు. కేంద్రంలోని బలహీనమైన, అస్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజలు అధికారం నుంచి తప్పించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో  చర్చలు లేకుండానే బిల్లులను ఆమోదించారని.. కానీ ఈసారి ప్రతి అంశంపై చర్చలు జరుగుతాయని చెప్పారు. మిత్రపక్షాల ఆమోదం లేనిదే మోదీ ఏ నిర్ణయం తీసుకోలేరన్నారు.  పౌరసత్వ (సవరణ) చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌‌ను తమ పార్టీ పార్లమెంటులో లేవనెత్తుతుందని మమత స్పష్టం చేశారు.