
న్యూఢిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ బంగ్లాదేశ్ హై కమిషనర్ నురల్ ఇస్లామ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. బంగ్లా-భారత్ బార్డర్‌లోని తాజా పరిణామాలపై చర్చించేందుకు రావాలని భారత్ నోటీసుల్లో పేర్కొంది. కాగా, 4,156 కిలోమీటర్ల ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించి ఐదు నిర్దిష్ట ప్రదేశాలలో కంచెలు నిర్మించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆరోపించిన బంగ్లాదేశ్.. ఈ మేరకు భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు 2025, జనవరి 12న నోటీసులు ఇచ్చింది. బంగ్లా నోటీసుల మేరకు భారత డిప్యూటీ కమిషనర్ బంగ్లా ప్రతినిధులతో ఆదివారం భేటీ అయ్యారు.
ఢాకా, న్యూఢిల్లీ భద్రత విషయంలో రెండు దేశాలు అవగాహనతో ఉన్నాయని ప్రణయ్ వర్మ భేటీ అనంతరం పేర్కొన్నారు. "సరిహద్దు భద్రతా విషయంలో మా రెండు బోర్డర్ గార్డ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లు -బీఎస్ఎఫ్, బీజీబీ (బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్) -కమ్యూనికేషన్‌లో ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందం మేరకు సరిహద్దు వెంబడి నేరాలను ఎదుర్కోవడానికి పరస్పర సహకార విధానం ఉంటుందని మేము ఆశిస్తున్నాం’ అని అన్నారు.
ALSO READ | జమ్మూ కశ్మీర్ వరప్రదాయని.. సోనామార్గ్ టన్నెల్ ప్రారంభించిన మోదీ..
సరిహద్దు వివాదంపై భారత హైకమిషనర్‌కు బంగ్లా నోటీసులు జారీ చేసిన మరుసటి రోజే బంగ్లాకు హైకమిషనర్‌కు భారత్ సమన్లు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు సరిహద్దులో ఇండియా వ్యవహరిస్తోన్న తీరుతో భారత్‌పై బంగ్లాదేశ్ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ హైకమిషనర్‌కు బ్లంగా నోటీసులు ఇవ్వగా.. 24 గంటలు గడవకముందే తిరిగి భారత్ బంగ్లాదేశ్ ప్రతినిధికి సమన్లు జారీ చేయడం గమనార్హం.