
- 2029 నాటికి సెక్టార్ సైజ్ రూ.79 వేల కోట్లకు
- కిందటేడాది జరిగిన సేల్స్ రూ.32 వేల కోట్లు
- 2034 నాటికి 20 లక్షల కొత్త ఉద్యోగాలు: వింజో రిపోర్ట్
న్యూఢిల్లీ: ఇండియాలో ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది. 2029 నాటికి ఈ సెక్టార్ సైజ్ (మొత్తం సేల్స్ విలువ) 9.1 బిలియన్ డాలర్ల (రూ.79 వేల కోట్ల) కు చేరుకుంటుందని గేమింగ్ ప్లాట్‌ఫామ్ వింజో గేమ్స్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. కిందటేడాది ఇండియా ఆన్‌లైన్ గేమింగ్ సెక్టార్‌లో రూ. 32 వేల కోట్ల ( 3.7 బిలియన్ డాలర్ల) రెవెన్యూ జనరేట్ అయ్యింది. ఇందులో కూడా రియల్ మనీ గేమింగ్ (ఆర్‌ఎంజీ) సెగ్మెంట్‌లోనే ఎక్కువ సేల్స్ జరిగాయి. ఈ సెగ్మెంట్ వాటా 86 శాతంగా ఉంది. ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్నొవేషన్ కౌన్సిల్ (ఐఈఐసీ) తో కలిసి ఈ రిపోర్ట్‌ను వింజో తయారు చేసింది.
శాన్‌ఫ్రాన్సిస్కో (యూఎస్) లో జరుగుతున్న గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (జీడీసీ) లో తాజాగా విడుదల చేసింది. ‘ ఇండియాలో ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ సైజ్ 2029 నాటికి 9.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇన్వెస్టర్ల వాల్యూ (పెట్టుబడుల విలువ) ఇదే టైమ్‌లో 63 బిలియన్ డాలర్ల (రూ.5.48 లక్షల కోట్ల) వరకు పెరిగే అవకాశం ఉంది. టెక్నాలజీ ఇన్నోవేషన్, ఐపీ క్రియేషన్, ఎంగేజ్‌మెంట్ వంటి సెగ్మెంట్లపై ఫోకస్ పెంచాం. గేమింగ్ ఇండస్ట్రీలో ఇండియాను గ్లోబల్ పవర్‌గా నిలపాలని టార్గెట్ పెట్టుకున్నాం’ అని వింజో ఫౌండర్ పవన్ నంద పేర్కొన్నారు.
59 కోట్ల మంది గేమర్లు..
ఈ రిపోర్ట్ ప్రకారం, ఇండియాలో 59.10 కోట్ల మంది గేమర్లు ఉన్నారు. గ్లోబల్‌గా ఉన్న మొత్తం గేమర్లలో వీరి వాటా 20 శాతంగా ఉంటుంది. ఇప్పటివరకు సుమారు 1,120 కోట్ల మొబైల్ గేమ్ యాప్ డౌన్‌లోడ్స్ రికార్డయ్యాయి. గూగుల్ ప్లేస్టోర్‌కు ఆల్టర్నేటివ్ ప్లాట్‌ఫామ్స్ వస్తున్నాయి. ఇండియాలో సుమారు 1,900 గేమింగ్ కంపెనీలు కార్యకలాపాలు జరుపుతున్నాయి. 1.3 లక్షల మంది ప్రొఫెషనల్స్ వీటిలో పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఇండియన్ ఆన్‌లైన్ గేమింగ్ సెక్టార్‌లోకి 3 బిలియన్ డాలర్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్(ఎఫ్‌డీఐలు) వచ్చాయి.
ఇందులో 85 శాతం పే టూ ప్లే (డబ్బులు చెల్లించి ఆడటం) సెగ్మెంట్‌లోకి వచ్చాయి. ఇండియాలో రియల్ మనీ గేమింగ్ (ఆర్‌ఎంజీ) బాగా పాపులర్ అయ్యింది. ఇటువంటి గేమ్స్‌లో డబ్బులు బెట్‌గా పెట్టి ఆడతారు. మొత్తం ఆన్‌లైన్ గేమింగ్ సెక్టార్‌లో 2024 లో 3.7 బిలియన్ డాలర్ల రెవెన్యూ జనరేట్ కాగా, ఇందులో ఆర్‌ఎంజీ సెగ్మెంట్ నుంచి 3.2 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఆన్‌లైన్ గేమింగ్ సెక్టార్ రెవెన్యూలో ఆర్‌ఎంజీ వాటా ప్రస్తుతం 85.7 శాతంగా ఉండగా, 2029 నాటికి 80 శాతానికి తగ్గుతుందని వింజో–ఐఈఐసీ రిపోర్ట్ అంచనా వేస్తోంది. నాన్– ఆర్‌ఎంజీ సెగ్మెంట్ వాటా 14.3 శాతం నుంచి 20 శాతానికి పెరుగుతుందని తెలిపింది.
మరిన్ని గేమింగ్ కంపెనీల ఐపీఓలు..
గేమింగ్ సెక్టార్ నుంచి నజారా టెక్నాలజీస్ మాత్రమే ఇప్పటివరకు ఇండియన్ మార్కెట్‌లో లిస్టింగ్ అయ్యింది. ఈ కంపెనీ షేర్లు భారీ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. గ్లోబల్‌గా లిస్టింగ్ అయిన ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలతో పోటీగా కంపెనీ వాల్యుయేషన్ ఉంది. ప్రస్తుతం ఇన్వెస్టర్ల పెట్టుబడులు 26 బిలియన్ డాలర్ల మేర పెరిగాయని వింజో రిపోర్ట్ అంచనా వేసింది. ఐపీఓ ద్వారా మరిన్ని కంపెనీలు ఇన్వెస్టర్ల ముందుకు వస్తాయని, ఆన్‌లైన్ గేమింగ్ సెక్టార్ సైజ్ 2029 నాటికి 9.1 బిలియన్ డాలర్లకు చేరినప్పుడు ఇన్వెస్టర్ల వాల్యూ 63 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని లెక్కించింది.
ఇండియాలో డిజిటల్ ఎకానమీ సైజ్ పెరుగుతుండడం, గేమ్ డెవలపర్ల వ్యవస్థ డెవలప్ అవుతుండడం, రెగ్యులేషన్స్ సింపుల్‌గా మారడంతో 2034 నాటికి ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ సైజ్ 60 బిలియన్ డాలర్లను టచ్ చేస్తుందని ఈ రిపోర్ట్ అంచనా వేసింది. మరిన్ని ఎఫ్‌డీఐలను ఆకర్షిస్తుందని, 20 లక్షల ఉద్యోగాలను ఇస్తుందని, ఇండియన్ ఐపీ ఎగుమతులు కూడా ఊపందుకుంటాయని వివరించింది.