న్యూఢిల్లీ: పెండ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు రాకెట్ పట్టుకొని తిరిగి కోర్టులోకి వస్తోంది. సీజన్ ఓపెనింగ్ టోర్నీ మలేసియా ఓపెన్‌కు దూరంగా ఉన్న సింధు.. మంగళవారం మొదలయ్యే ఇండియా ఓపెన్ 750 టోర్నమెంట్‌లో ఈ ఏడాది తన పోరు ఆరంభించనుంది. గతేడాది చివర్లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో టైటిల్ గెలిచి ఫామ్‌లోకి వచ్చిన ఆమె ఈ ఏడాది ఆరంభం నుంచే సత్తా చాటాలని ఆశిస్తోంది. విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు.. ఇండియాకే చెందిన అనుపమ ఉపాధ్యాయతో పోరు ప్రారంభిస్తుంది. గెలిస్తే రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన రైజింగ్ స్టార్ టోమోకా మియాజాకితో తలపడనుంది.
మెన్స్ సింగిల్స్‌లో లక్ష్య సేన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. 2022లో టైటిల్ గెలిచిన అతను చైనా షట్లర్ హాంగ్ యాంగ్ వెంగ్‌తో తొలి రౌండ్‌లోనే కఠిన సవాల్ ఎదుర్కోనున్నాడు. ఐదు నెలల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చి గత వారం మలేసియా ఓపెన్ రెండో రౌండ్‌లోనే ఓడిన హెచ్‌ఎస్ ప్రణయ్ ఈ టోర్నీలో మెరుగైన పెర్ఫామెన్స్ చేయాలని చూస్తున్నాడు. 32 ఏండ్ల ప్రణయ్ తొలి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన లి యాంగ్ సుతో తలపడనున్నాడు. ఇందులో గెలిస్తే రెండో రౌండ్‌లో అతను ఇండోనేసియా స్టార్, రెండో సీడ్ జోనాథన్ క్రిస్టీతో పోటీ పడనున్నాడు. ఒలింపిక్ చాంపియన్స్ విక్టర్ అక్సెల్సెన్ (మెన్స్), అన్ సే యంగ్ (విమెన్స్), వరల్డ్ నంబర్ వన్ షి యుకీ వంటి టాప్ ప్లేయర్లు బరిలో ఉండటంతో ఇండియా ప్లేయర్లు టైటిల్ నెగ్గడం సవాల్‌తో కూడుకున్న పనే కానుంది.
మెన్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. గతవారం మలేసియా ఓపెన్‌లో సెమీస్ చేరిన సాత్విక్– చిరాగ్ తమ తొలి రౌండ్‌లో మలేసియాకు చెందిన వీ చోంగ్ మాన్– కై వున్ టీతో తలపడతారు. మెగా టోర్నీలో ఇండియా నుంచి 21 మంది షట్లర్లు బరిలో ఉన్నారు. ప్రియాన్షు రజావత్, మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్‌తో పాటు విమెన్స్ డబుల్స్‌లో ఐదో సీడ్ పుల్లెల గాయత్రి– ట్రీసా జాలీ, తనీషా క్రాస్టో– అశ్విని పొన్నప్ప తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.