న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నీలో స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శనివారం (జనవరి 17) దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఉమెన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమి పాలైంది. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మారిస్కా 9-21, 21-19, 17-21 తేడాతో పీవీ సింధును చిత్తు చేసింది. తొలి రౌండ్లో పూర్తిగా తేలిపోయిన భారత షట్లర్.. తర్వాతి రౌండ్లలో పుంజుకున్నప్పటికీ ప్రత్యర్థి ముందు తలవంచక తప్పలేదు. 9-21 తేడాతో తొలి సెట్ కోల్పోయిన సింధు.. 21-19, 17-21తో చివరి రెండు రౌండ్లలో తీవ్రంగా పోరాడిన ఫలితం లేకుండా పోయింది. పెళ్లి తర్వాత తొలి టోర్నీ ఆడిన సింధు క్వార్టర్ ఫైనల్లో ఓటమితో తీవ్ర నిరాశతో ఇంటిదారి పట్టింది.
Also Read : ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి స్టార్ బౌలర్..!
ఇక.. ఇండియా ఓపెన్ సూపర్ 750 పురుషుల డబుల్స్‌లో భారత అగ్రశ్రేణి జంట సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సెమీ-ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో 21-10, 21-17తో దక్షిణ కొరియాకు చెందిన జిన్ యోంగ్, కాంగ్ మిన్ హ్యూక్‌ల జోడిని భారత ద్వయం చిత్తు చేసింది. క్వార్టర్స్ ఫైనల్ మ్యాచులో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రత్యర్థిపై స్పష్టమైన అధిక్యాన్ని కనబర్చి విజయం సాధించింది. వరుసగా రెండు సెట్లు గెల్చి మరో రౌండ్ ఉండగానే మ్యాచును ముగించగా పూర్తి ఆత్మ విశ్వాసంతో సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ. జనవరి 18న జరిగే సెమీ-ఫైనల్‌లో మలేషియాకు చెందిన స్జె ఫీ గోహ్, నూర్ ఇజ్జుద్దీన్‌లతో భారత జంట తలపడనుంది.