పోటాపోటీగా మిసైల్ టెస్టులు .. అరేబియా సముద్రంలో ఇండియా సీస్కిమ్మింగ్ టెస్ట్

పోటాపోటీగా మిసైల్ టెస్టులు .. అరేబియా సముద్రంలో ఇండియా సీస్కిమ్మింగ్ టెస్ట్
  • కరాచీ తీరంలో బాబర్ మిసైల్​ను టెస్ట్ చేసిన పాక్ 

ముంబై: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో  కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత్, పాకిస్తాన్  గురువారం పోటాపోటీగా మిసైళ్లను పరీక్షించాయి. ఇరు దేశాల వాయుసేనలు తమ అమ్ములపొదిలోని అస్త్రాలను బయటకు తీశాయి. అరేబియా సముద్రంలో భారత నేవీ సీ స్కిమ్మింగ్ టెస్ట్ (సముద్రంలో శత్రు దేశ రాడార్లకు దొరకకుండా, దాడికి గురవకుండా ఉపరితలం నుంచి తక్కువ ఎత్తులో ప్రయాణించే మిసైళ్లు, విమానాలపరీక్ష) నిర్వహించింది. ఐఎన్ఎస్  సూరత్ నుంచి మీడియం రేంజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. గగనతలంలోని టార్గెట్ ను ఈ క్షిపణి ఛేదించింది. ఈ విషయాన్ని నేవీ ‘ఎక్స్’ లో తెలిపింది. భారత నేవీ చరిత్రలో ఇదొక మైలురాయి అని పేర్కొంది.

 ‘‘దేశ సముద్రతీర ప్రాంతాల ప్రయోజనాలను కాపాడడంలో, ఆత్మనిర్భర భారత్ కు అంకితమై పనిచేయడంలో నేవీకి ఉన్న నిబద్ధతను తాజా పరీక్ష ద్వారా చాటిచెప్పాం” అని నేవీ ట్వీట్  చేసింది. కాగా, ఇజ్రాయెల్ తో కలిసి ఈ మిసైల్ ను అభివృద్ధి చేశారు. ఉపరితలం నుంచి గగనతలంలోకి ఈ మిసైల్ ను ప్రయోగిస్తారు. 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదిస్తుంది. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత వాయుసేన కూడా అప్రమత్తమైంది. రఫేల్, ఎస్ యూ30 యుద్ధ విమానాలతో ఎక్సర్ సైజ్ ‘ఆక్రమణ్’ ను ప్రారంభించింది. మరోవైపు పాకిస్తాన్  కూడా తన  యుద్ధ విమానాలను భారత సరిహద్దులకు తరలించింది. మరోవైపు అరేబియా సముద్రాన్ని నోఫ్లై జోన్ గా పాకిస్తాన్  ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బాబర్  క్రూయిన్  క్షిపణి (షహీన్ 3) ని పరీక్షించింది.