Champions Trophy 2025: హైబ్రిడ్ మోడల్‌లోనే మ్యాచ్‌లు: పాకిస్థాన్, భారత్‌కు ఐసీసీ సమన్యాయం

Champions Trophy 2025: హైబ్రిడ్ మోడల్‌లోనే మ్యాచ్‌లు: పాకిస్థాన్, భారత్‌కు ఐసీసీ సమన్యాయం

భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లకు ఐసీసీ సమన్యాయం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌ విధానంలో నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆమోదం తెలిపింది. దీంతో భారత్ పాకిస్థాన్ లో పర్యటించకుండా తటస్థ వేదికపై మ్యాచ్ లు ఆడుతుంది. అదే సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సైతం భారత్ లో ఐసీసీ టోర్నీ నిర్వహిస్తే రానని ఐసీసీకి చెప్పింది. పాకిస్థాన్ డిమాండ్ కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

2024 నుంచి 2027 మధ్యలో జరగబోయే ఐసీసీ ఈవెంట్‌లలో భారత్, పాకిస్తాన్ తమ అన్ని మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో ఆడతాయని ఐసీసీ అధికారికరంగా ధృవీకరించింది. దీని ప్రకారం భారత్ లో జరగబోయే ఐసీసీ టోర్నీ కోసం పాకిస్థాన్ రాదు. అదేవిధంగా పాకిస్థాన్ భారత్ లో పర్యటించదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ టీమిండియాకు వెళ్ళదు. 2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ మెగా టోర్నీకి పాకిస్థాన్ భారత్ లో పర్యటించకుండా హైబ్రిడ్ మోడల్ (తటస్థ వేదికల్లో) మ్యాచ్ లు  ఆడుతుంది. 

మహిళలకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. 2025 మహిళల వన్డే ప్రపంచ కప్ భారత్ లో జరగనుంది. 2028లో పాకిస్థాన్ వేదికగా మహిళల టీ 20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ రెండు టోర్నీలు కూడా హైబ్రిడ్ మోడల్ లోనే జరుగుతాయి. ఇటీవలే పీసీబీ, బీసీసీఐల మధ్య ఒప్పందం ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు పాకిస్థాన్, దుబాయ్‌లో జరగనున్నాయి. భారత జట్టు ఆడే మ్యాచ్‌లు దుబాయ్ లో జరగనుండగా.. మిగిలిన మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. భారత జట్టు నాకౌట్ పోరుకు అర్హత సాధిస్తే.. దుబాయ్‌లోనే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు. ఒకవేళ టీమిండియా లీగ్ దశలోనే నిష్క్రమిస్తే, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు లాహోర్, రావల్పిండిలో జరుగుతాయి.