అహ్మదాబాద్: వరల్డ్ కప్‌లో భాగంగా ఈ నెల 14న జరిగే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు భారీ భద్రతను కల్పించనున్నారు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం గుజరాత్ పోలీస్, ఎన్‌ఎస్‌జీ, ఆర్‌ఏఎఫ్, హోమ్ గార్డ్స్‌తో కలిపి దాదాపు 11 వేల మందిని కేటాయించారు. ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉండే అవకాశం ఉండటంతో అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
‘గత 20 ఏళ్లలో అహ్మదాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయినప్పటికీ ఈ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ముందస్తు చర్యల్లో భాగంగా కమ్యూనిటీ, ఇతర సున్నిత ప్రాంతాల్లో సెక్యూరిటీ ఫోర్స్‌ను మోహరిస్తాం’ అని సదరు అధికారి పేర్కొన్నారు. సెక్యూరిటీ విషయంపై సోమవారం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోమ్ మినిస్టర్, డీజీపీ, ఇతర సీనియర్ పోలీస్ అధికారులతో చర్చించారు.