ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మూడింటి మధ్య మరింత కో–ఆర్డినేషన్ కోసం సీనియర్ చీఫ్‌ని తీసుకురావాలన్నది దాదాపు 20 ఏళ్ల నాటి ఆలోచన. కార్గిల్ యుద్ధం అయిపోగానే సాయుధ బలగాల మధ్య సమన్వయం ఉండాలన్న సూచన వచ్చింది. ఆ పోస్టుకు ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’(సీడీఎస్) అనే పేరు కూడా పెట్టారు. ఆ తర్వాత పొలిటికల్ ఈక్వేషన్లు మారడంతో ఈ ప్రపోజల్ తెర వెనక్కి పోయింది. ఇండియాతో యుద్ధానికి పాకిస్థాన్ కాలుదువ్వుతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఇండియా లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో డిఫెన్స్ విభాగం మూడు ముక్కలుగా పనిచేస్తుంది. 1971 తర్వాత ఇండియా అడపాదడపా పీస్ కీపింగ్ ఆపరేషన్లలో పాల్గొనడం తప్ప.. యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొనలేదు. 1999 వేసవి కాలం(వాజ్‌పేయి హయాం)లో మే నుంచి జూలై వరకు మూడు నెలలపాటు కార్గిల్‌లో యుద్ధం జరిగింది. మనవాళ్లు 527 మంది చనిపోగా, 1,363 మంది గాయపడ్డారు. పాక్ తరఫున 453 హతమవగా, 665 మందే గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్యలోనూ, క్షతగాత్రుల సంఖ్యలోనూ ఇండియాకే ఎక్కువ నష్టం జరిగింది. వార్ ముగిశాక ఏర్పడిన కార్గిల్ రివ్యూ కమిటీ (కేఆర్సీ) కొన్ని సూచనలు చేసింది. నేషనల్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ను పూర్తిగా మార్చేయాలని సూచించింది. సెక్యూరిటీకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే తీరును, హైలెవల్ సిస్టమ్‌ను చక్కదిద్దాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. డిఫెన్స్ మినిస్ట్రీకి, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్‌కి నడుమ మధ్యవర్తిత్వాన్ని కూడా సరిచేయాలని సలహా ఇచ్చింది. ఈ బాధ్యతలను నెరవేర్చే ఆఫీసర్‌కి ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)’ అనే పేరు పెట్టాలని మాత్రం డైరెక్ట్‌గా చెప్పలేదు.
కేఆర్సీ ఈ రికమండేషన్లు ఇవ్వటానికి బలమైన కారణం ఉంది. కార్గిల్ వార్‌లో పాకిస్థాన్‌పై మన దేశం గెలిచింది. కానీ.. ఆ యుద్ధానికి ముందు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మధ్య కో–ఆర్డినేషన్ చాలా పూర్‌గా ఉండేదని కేఆర్సీ గుర్తు చేసింది. ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని సెంట్రల్ గవర్నమెంట్‌ని కోరింది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఆర్మ్డ్ ఫోర్స్‌లు భాగం కాకపోవటం పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా లేదని, ఇండియా వంటి మేజర్ డెమొక్రసీలో ఈ లోటు స్పష్టంగా కనిపిస్తోందని కేఆర్సీ ప్రత్యేకంగా పేర్కొంది.
ముందుచూపు ముఖ్యం
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లు ఎక్కువ సమయాన్ని ఆపరేషనల్ రోల్స్‌కే కేటాయిస్తారని, సెక్యూరిటీపై తుది నిర్ణయాలు తీసుకునేటప్పుడు సర్కారులో పాలుపంచుకోరని కార్గిల్ రివ్యూ కమిటీ తప్పుపట్టింది. దీనివల్ల చాలా సార్లు నెగెటివ్ రిజల్ట్స్ వచ్చాయని తన రిపోర్ట్‌లో మొహమాటం లేకుండా తెలిపింది. సెక్యూరిటీకి సంబంధించి డే–టు–డే ప్రయారిటీల కారణంగా లాంగ్ టర్మ్ ప్లానింగ్ తీవ్రంగా దెబ్బతింటోందని వివరించింది. హైలెవల్ డిఫెన్స్ మేనేజ్మెంట్ నిర్ణయాలు బ్రాడ్బేస్డ్గా, ఏకాభిప్రాయం కలిగి ఉండాలని తేల్చిచెప్పింది.
కేఆర్సీ తన రిపోర్ట్‌ను కేంద్రానికి ఇచ్చిన తర్వాత అందులోని రికమండేషన్లను మినిస్టర్ల టాస్క్‌ఫోర్స్ లోతుగా స్టడీ చేసింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ఉండాల్సిందేనని, అతనికి ‘ఫైవ్ స్టార్ ఆఫీసర్’ హోదా ఇవ్వాలని ‘కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ’కి ప్రపోజ్ చేసింది. సీడీఎస్ పోస్టును క్రియేట్ చేసే క్రమంలో నాటి ఎన్డీఏ గవర్నమెంట్ 2002లో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్(ఐడీఎస్)కు రూపకల్పన చేసింది. ఇది చేయాల్సిన పనులు కూడా చివరికి సీడీఎస్ సెక్రటేరియట్ మాదిరిగానే ఉండనున్నాయనే టాక్ వినిపించింది.
ఇన్నాళ్లూ ఎందుకు నియమించలేదు?
మన దేశంలో బ్రిటిషర్ల కాలం నుంచీ ‘చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సీఓఎస్సీ)’ చైర్మన్ పోస్టు ఉంది. కానీ అతనికి అధికారాలు పెద్దగా ఇవ్వలేదు. అప్పుడప్పుడు కాస్తో కూస్తో మార్పులు చేర్పులు చేస్తూ కొనసాగిస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో సీనియర్ మోస్ట్‌ని సీఓఎస్సీకి హెడ్‌గా నియమిస్తుంటారు. ప్రస్తుతం ఆ పోస్టులో ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్‌సింగ్ ధనోవా ఉన్నారు. ఈయన పదవీ కాలం ఈ నెలతో ముగుస్తుంది. మూడు సర్వీసుల మధ్య కో–ఆర్డినేషన్ పెంచటంలో సీఓఎస్సీ విఫలమవుతోందని 2015లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి కేటాయిస్తున్న బడ్జెట్‌ను ప్రభుత్వం రాన్రానూ అనవసర భారం అనుకుంటోంది. దేశానికి పవర్ఫుల్ మిలటరీ లీడర్ ఉండాలనే విషయంలో పొలిటికల్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. అందువల్లనే సీఓఎస్సీ పోస్టును అప్‌గ్రేడ్ చేయలేదు. ఆ లోటును భర్తీ చేయటానికి మోడీ సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. మనపై యుద్ధానికి పాకిస్థాన్ కాలుదువ్వుతుండటంతో సీడీఎస్ తప్పనిసరి అనే నిర్ణయానికి వచ్చింది.
మన ప్రధానికి మిలటరీ అడ్వైజర్ ఎవరు?
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరే (ఎన్ఎస్ఏ) ఇప్పుడు మన ప్రధానికి సైనిక సలహాదారు. 2018లో కొత్తగా డిఫెన్స్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటుచేయటంతో ఎన్ఎస్ఏ పోస్టుకి ప్రత్యేకత వచ్చింది. ప్రస్తుతం దీనికి చైర్మన్‌గా అజిత్ ధోవల్ వ్యవహరిస్తున్నారు. ఫారిన్, డిఫెన్స్, ఎక్స్పెండిచర్ సెక్రెటరీలు; ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సర్వీసుల చీఫ్‌లు ఆ కమిటీలో మెంబర్లుగా ఉన్నారు.
ర్యాంకుల్లోనూ తేడాలే!
ఇండియన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ మూడింటిలోనూ పది ర్యాంకులు ఉన్నప్పటికీ.. మూడు విభాగాల్లోనూ ఒకే రకమైన ర్యాంకులు కూడా ఉండవు. ఉదాహరణకు, లెఫ్టినెంట్ అనేది ఇండియన్ ఆర్మీలో పదో ర్యాంక్, ఇండియన్ నేవీలో తొమ్మిదో ర్యాంక్. ఆర్మీలో తొమ్మిదో ర్యాంకయిన కెప్టెన్ హోదా నేవీలో ఆరో ర్యాంక్. అలాగే, రిటైరయ్యాక వచ్చే పెన్షన్ బెనిఫిట్స్ కూడా మూడింటిలోనూ ఒకే తీరుగా ఉండవు. ఈ తేడాని నరేంద్ర మోడీ సర్కారు ఫస్ట్ ఫేజ్‌లోనే సరిదిద్దాలని అనుకుంది. ‘ఒకే ర్యాంక్, ఒకే పింఛన్’ స్కీమ్‌ని ప్రవేశపెట్టాలన్నా సాధ్యపడలేదు. ఎన్డీయే ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం 5,500 కోట్ల రూపాయలు విడుదల చేసింది గానీ, రిటైర్డ్ సిబ్బంది నుంచి అనేక అభ్యంతరాలు రావడంతో అమలు కావడం లేదు. ఇవన్నీ పరిష్కరించి ఒక యూనిఫాం వ్యవస్థను ఏర్పరచాలన్నది మోడీ ప్రభుత్వ ఉద్దేశం.
సీడీఎస్ ఎందుకు?
సీడీఎస్ అనేది హై మిలటరీ ఆఫీస్‌లా వ్యవహరిస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల పనితీరును పర్యవేక్షించటం; ఆ మూడింటి మధ్య సమన్వయం కుదర్చటం; వాటిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయటం; లాంగ్ టర్మ్ డిఫెన్స్ ప్లానింగ్, మేనేజ్మెంట్కి సంబంధించి ప్రధానికి నేరుగా సింగిల్ పాయింట్ అడ్వైజ్ ఇవ్వటం దీని ముఖ్యమైన పనులు. సెక్యూరిటీ మ్యాన్ పవర్, ఎక్విప్మెంట్, స్ట్రాటజీలతోపాటు బలగాల ఆపరేషన్స్ విషయంలో ఉమ్మడి బాధ్యత తీసుకుంటుంది. సీడీఎస్ ఆఫీసర్ ఎంత అవసరమో యుద్ధ సమయాల్లో తెలుస్తుంది. మిలటరీకి సంబంధించి అడ్వాన్స్‌గా ఉండే చాలా ప్రజాస్వామ్య దేశాల్లో ఈ వ్యవస్థ ఇప్పటికే ఉంది. కాకపోతే ఆయా చోట్ల అధికారాల్లో కొద్దో గొప్పో మార్పులుంటాయి. అమెరికాలోని ‘జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (జేసీఎస్సీ)’ చైర్మన్ చాలా పవర్ఫుల్. ఈ మోస్ట్ సీనియర్ మిలటరీ ఆఫీసరే ప్రెసిడెంట్‌కి మిలటరీ అడ్వైజర్. అతను నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కౌన్సిల్, డిఫెన్స్ సెక్రెటరీల నిర్ణయాల్లోనూ నేరుగా జోక్యం చేసుకోగలడు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, మెరైన్ కార్ప్స్, నేషనల్ గార్డ్ల చీఫ్‌లూ ఈ జీసీఎస్సీలో మెంబర్లుగా ఉంటారు.