టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్ తొలి ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభించింది. జింబాబ్వే టూర్ లో భాగంగా 5 టీ20 ల సిరీస్ శనివారం (జూలై 6) నేడు ప్రారంభమైంది. సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంతో ఈ సిరీస్ కు యువ జట్టును ఎంపిక చేశారు. గిల్ ఈ జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు. ఐపీఎల్ 2024 లో అదరగొట్టిన కుర్రాళ్ళు స్క్వాడ్ లో చోటు సంపాదించారు. తుది జట్టులో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ భారత జట్టు తరపున తొలి టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ జట్టులో దక్కించుకోలేని నలుగురు ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
జితేష్ శర్మ:
టీమిండియా తరపున 9 టీ20 మ్యాచ్ లు ఆడిన అనుభవం జితేష్ శర్మకు ఉంది. అయితే ఐపీఎల్ లో ఫామ్ లేమి కారణంగా జితేష్ వరల్డ్ కప్ కు ఎంపిక కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న జింబాబ్వే టూర్ లో 15 మంది ప్రాబబుల్స్ లో ఎంపికైనా ప్లేయింగ్ 11 లో చోటు లభించలేదు. వికెట్ కీపర్ గా జట్టు యాజమాన్యం ధృవ్ జురెల్ పై నమ్మకం ఉంచింది. రాజస్థాన్ రాయల్స్ తరపున జురెల్ గత రెండు సీజన్ లుగా నిలకడగా ఆడుతున్నాడు. ఈ కారణంగానే జితేష్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
సాయి సుదర్శన్:
తమిళనాడు కు చెందిన ఈ యువ ప్లేయర్ భారత్ తరపున వన్డే అరంగేట్రం చేశాడు. టీ20ల్లో తొలిసారి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ సీజన్ లో ఈ తమిళ నాడు కుర్రాడు అసాధారణ ఆటతీరును ప్రదర్శించాడు. టోర్నీ మొత్తం నిలకడైన ఆటతీరుతో గుజరాతు టైటాన్స్ తరపున 527 పరుగులు చేసి ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. జైస్వాల్ స్థానంలో చోటు దక్కించుకున్న సుదర్శన్ తుది జట్టులో మాత్రం నిరాశ తప్పలేదు. గిల్, అభిషేక్ శర్మ, గైక్వాడ్ లతో టీమిండియా పటిష్టంగా ఉండడంతో సాయి సుదర్శన్ కు అవకాశం దక్కలేదు.
తుషార్ దేశ్ పాండే:
డొమెస్టిక్ సీజన్ నుంచి ఐపీఎల్ వరకు తుషార్ దేశ్ పాండే సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో సూపర్ కింగ్స్ తరపున 2023, 2024 సీజన్ లలో అత్యధిక వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. స్లో బాల్స్ తో ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయగలడు. తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ముఖేష్, ఖలీల్, ఆవేశ్ ఖాన్ లాంటి సీనియాలు ఉండడంతో తుది జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయాడు.
హర్షిత్ రానా:
ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున నితీష్ రానా అదరగొట్టాడు. 13 మ్యాచ్ ల్లో 19 వికెట్లు తీసి కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ కప్ ఆడి బిజీగా ఉన్న శివందూబే, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ రెస్ట్ తీసుకోవడంతో భారత జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్నాడు. అయితే తుది జట్టులో స్థానం దక్కాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.