- ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ప్రధాని మోడీ
- పీపీఈ కిట్లు తెచ్చుకునే స్థితి నుంచి వ్యాక్సిన్లు ఇచ్చే స్థాయికి ఎదిగినం
- ఐఎస్‌బీ గ్రాడ్యుయేట్లు దేశానికే గర్వకారణం
- విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేత
- ఐఎస్‌బీ పోస్టల్ స్టాంప్ విడుదల
‘ఆసియాలో టాప్ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా ఐఎస్‌బీ నిలిచింది. ఈ సంస్థ నుంచి ఇప్పటి వరకు 50 వేల మందికి పైగా బయటికి వచ్చి దేశ నిర్మాణంలో భాగమయ్యారు. దేశ, విదేశాల్లో బడా కంపెనీలు నిర్వహిస్తున్నారు. స్టార్టప్‌లు, యూనికార్న్‌ల నిర్మాణంలోనూ వారి భాగస్వామ్యం ఉంది. ఐఎస్‌బీ తన ప్రయాణంలో ఈరోజు కీలక మైలురాయిని చేరుకుంది. ఈ సంస్థ గ్రాడ్యుయేట్లు దేశానికే గర్వకారణ’ అని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
హైదరాబాద్ : కరోనా కష్టకాలంలో ఇండియా సామర్థ్యమేంటో ప్రపంచానికి తెలిసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వైరస్ వ్యాప్తి మొదలైన టైంలో పీపీఈ కిట్లు బయటి నుంచి తెచ్చుకునే పరిస్థితి నుంచి వందకుపైగా దేశాలకు వ్యాక్సిన్లు అందించే స్థాయికి దేశం ఎదిగిందని చెప్పారు. గురువారం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విపత్తు తర్వాత మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించడంపై దృష్టి సారించామని తెలిపారు. హెల్త్ సెక్టార్‌లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని, మెడికల్ కాలేజీల సంఖ్య భారీగా పెంచామని వివరించారు. ‘‘కరోనా వ్యాక్సిన్లు ఇతర దేశాలు నుంచి వస్తాయో రావో అనే ఆందోళనకర పరిస్థితుల్లో దేశీ వ్యాక్సిన్లు రూపొందించాం. దేశంలో 190 కోట్లకుపైగా డోసులు వేశాం. మనదగ్గర పీపీఈ కిట్లు తయారు చేసే సంస్థలు 1,100లకు చేరాయి. ఇతర సదుపాయాలను పెద్ద సంఖ్యలో పెంచాం” అని చెప్పారు. 2014కు ముందు మూడు దశాబ్దాల పాటు దేశంలో రాజకీయ సుస్థిరత లేకపోవడంతో సంస్కరణలు అమలు చేయడం సాధ్యం కాలేదని మోడీ అన్నారు. ‘‘2014 తర్వాతే దేశంలో సంస్కరణలు వేగవంతమయ్యాయి. ఇందుకు రాజకీయ సుస్థిరతే కారణం. మేం తీసుకువస్తున్న సంస్కరణలకు దేశ ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. రానున్న రోజుల్లో సంస్కరణల్లో వేగం పెంచుతాం” అని తెలిపారు. ‘రిఫార్మ్.. పర్‌ఫార్మ్.. ట్రాన్స్‌ఫార్మ్’ అనే కోణంలో పరిపాలన వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని, ఇండియా అంటేనే బిజినెస్ అనే స్థాయికి ఎదిగామని అన్నారు.
మన యువత.. ప్రపంచాన్ని లీడ్ చేస్తరు
దేశాభివృద్ధిలో యువతను భాగస్వాములను చేస్తున్నామని ప్రధాని తెలిపారు. తనకు యువతపై నమ్మకం ఉందని, వారి వ్యక్తిగత లక్ష్యాలను దేశ ప్రగతికి జోడించాలని పిలుపునిచ్చారు. ఐఎస్‌బీల్లో చదివి బయటకు వస్తున్న యువ బిజినెస్ లీడర్లు.. చిన్న వ్యాపారులు, స్మాల్, మీడియం ఇండస్ట్రీలకు ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు, వారిలో స్కిల్ డెవలప్ చేసేందుకు తోడ్పాటు అందించాలన్నారు. మన దేశ యువత ప్రపంచాన్ని లీడ్ చేయడం ఖాయమని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. వారి వెంట తాను ఉంటానని భరోసానిచ్చారు. రానున్న 25 ఏళ్ల దేశ ప్రగతికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని, యువతకు ఎక్కువగా అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. జీ20 దేశాల్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇండియా ఎదిగిందన్నారు. స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగంలో నంబర్ వన్‌గా ఉన్నామని, ఇంటర్నెట్ యూజర్లలో, గ్లోబల్ రిటైల్ ఇండెక్స్‌లో రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. కన్జూమర్ మార్కెట్‌లో మూడో స్థానంలో ఉన్నామన్నారు. స్టార్టప్ పాలసీ, డ్రోన్ పాలసీలు తీసుకువచ్చామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్‌లో ఉన్నామని తెలిపారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీతో దేశంలో గణనీయమైన మార్పులు వస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో 40 శాతం మన దేశం నుంచే ఉన్నాయని తెలిపారు.
అభివృద్ధికే దిక్సూచీగా తీర్చిదిద్దుతం
డ్రాయింగ్ రూముల్లో, కాగితాలపై పాలసీలు అద్భుతంగా ఉంటాయని, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేసినప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయని మోడీ అన్నారు. ‘‘దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాలను గుర్తించి, అక్కడ సమర్థులైన అధికారులను నియమించి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. వాటిని స్ఫూర్తివంతమైన జిల్లాలుగా దేశ అభివృద్ధికే దిక్సూచీగా తీర్చిదిద్దుతాం’’ అని తెలిపారు. కొత్త స్పోర్ట్స్ పాలసీతో అథ్లెట్లు, క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఖేలో ఇండియాలో భాగంగా స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌పై దృష్టి సారించామని, క్రీడారంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నామని తెలిపారు.
దేశ నిర్మాణంలో ఐఎస్‌బీ స్టూడెంట్లు
ఆసియాలో టాప్ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా ఐఎస్‌బీ నిలిచిందని ప్రధాని ప్రశంసించారు. 2001లో అటల్ బిహారీ వాజ్‌పేయీ.. ఐఎస్‌బీని జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు. ఐఎస్‌బీ తన ప్రయాణంలో ఈరోజు కీలక మైలురాయిని చేరుకుందని, ఈ సంస్థ గ్రాడ్యుయేట్లు దేశానికే గర్వకారణమని కొనియాడారు. ఐఎస్‌బీల్లో ప్రపంచ స్థాయి బిజినెస్ లీడర్లను తయారు చేస్తున్నామని, ఇక్కడి స్కాలర్లు ప్రపంచవ్యాప్తంగా కీలక స్థానాల్లో పనిచేస్తున్నారని ఐఎస్‌బీ బోర్డు చైర్‌పర్సన్ హరీశ్ మంథానీ తెలిపారు. ఐఎస్‌బీ మొహాలీ క్యాంపస్ చైర్మన్ రాకేశ్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ, దేశ ప్రగతిలో తాము పాలు పంచుకుంటున్నామని తెలిపారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐఎస్‌బీ హైదరాబాద్ డీన్ మదన్ పిల్లుట్ల
పాల్గొన్నారు.
మొక్క నాటిన ప్రధాని
ఐఎస్‌బీ ప్రాంగణంలో మోడీ మొక్క నాటారు. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ లోగోను, పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించారు. అకడమిక్ డ్రెస్‌లో ప్రధాని సహా ఆహ్వానితులు వేదికపై కూర్చున్నారు. స్కాలర్లు అభిజిత్ రాంసేవన్, చారు భరద్వాజ్, వైదేహి, విక్రమ్‌సింగ్ బిస్త్, అత్కర్ష్ అరోరా, ప్రదీప్ కుమార్ బొడిగె, ఫ్రాజెల్ జాంబ్రే, సిద్ధేశ్ రాయ్‌కర్, రాఘవ్ చోప్రాకు గోల్డ్ మెడల్స్, ఐశ్వర్య మిశ్రాకు హైదరాబాద్ క్యాంపస్ చైర్ పర్సన్ అవార్డును ప్రధాని అందజేశారు. గోల్డ్ మెడల్స్ అందుకున్న వారిలో తెలంగాణకు చెందిన ప్రదీప్ కుమార్, వైదేహీ ఉన్నారు.
లారీ డ్రైవర్ కొడుకును..
ఐఎస్‌బీ మొహాలీ క్యాంపస్‌లో టాప్ -3లో నిలిచినందుకు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. తెలంగాణ బిడ్డగా హైదరాబాద్‌లో ప్రధాని చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం హ్యాపీగా ఉంది. మా నాన్న లారీ డ్రైవర్. కష్టపడి చదివించారు. ఎన్‌ఐటీ నాగ్‌పూర్‌లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివా. ఏడేళ్లు ఎల్ అండ్ టీలో జాబ్ చేశా. గతేడాది ఐఎస్‌బీ హైదరాబాద్‌లో సీటు వచ్చినా కరోనా వల్ల జాయిన్ కాలేదు. ఈ ఇయర్ మొహాలీ క్యాంపస్‌లో జాయిన్ అయ్యా. - ప్రదీప్ కుమార్ బొడిగె, లింగరాజుపల్లి, వలిగొండ మండలం, యాదాద్రి జిల్లా
స్కాలర్ ఆఫ్ ఎక్సలెన్సీ అందుకున్న..
ఐఎస్‌బీ హైదరాబాద్ క్యాంపస్‌లో టాప్ -3లో నిలిచినందుకు స్కాలర్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్న. వరంగల్‌లో ఇంటర్ చదివాను. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేసి మెకెన్సీ కంపెనీలో జాబ్‌లో జాయిన్ అయ్యా. ఈ ఇయర్ ఐఎస్‌బీలో చేరాను. ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకోవడం హ్యాపీగా ఉంది.- వైదేహీ, వరంగల్