యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(యూఎన్‌డీపీ) విడుదల చేసిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లో ఇండియా 131వ స్థానంలో నిలిచింది. ఆయా దేశాల ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల ప్రకారం యూఎన్‌డీపీ మానవ అభివృద్ధి సూచికను అంచనా వేస్తోంది. గత ఏడాది ఇండియాకు 129వ ర్యాంకు రాగా.. ఈ సారి రెండు ర్యాంకుల దిగువకు వెళ్లింది. ప్రపంచంలోని 189 దేశాలకు ఇచ్చిన ర్యాంకింగ్స్ లో గత ఏడాదిలాగే నార్వే మళ్లీ తొలి స్థానంలో నిలవడం విశేషం.
పొరుగునే ఉన్న భూటాన్ 2019లో 134వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 129వ స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది 147 వ స్థానంలో నిలిచిన నేపాల్142 వ ర్యాంకుకు చేరుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 170 నుంచి 169 వ స్థానానికి, బంగ్లాదేశ్ 135 నుంచి 133 వ ర్యాంకుకు చేరింది. గత ఏడాది 152వ స్థానంలో ఉన్న పాకిస్థాన్ 154వ ర్యాంకుతో రెండు ర్యాంకుల దిగువకు చేరింది. శ్రీలంక 72వ స్థానంలో ఉంది. ఈ విషయమై యూఎన్‌డీపీ రెసిడెంట్ ప్రతినిధి షోకో నోడా మాట్లాడుతూ “ఇండియా ర్యాంకింగ్‌లో కిందపడిపోవడం అంటే ఆ దేశం బాగా చేయలేదని కాదని, ఇతర దేశాలు మెరుగ్గా చేయడం వల్ల ముందుకు కొచ్చాయని పేర్కొన్నారు. భారతదేశం ఇతర దేశాలకు కూడా సాయం చేయగలదన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ఇండియా ప్రదర్శించిన నిబద్ధతను ఆయన ప్రశంసించారు.
క్లయిమెట్ చేంజ్‌పై యాక్షన్ ప్లాన్
2008 లో క్లయిమెట్ చేంజ్ పై భారతదేశం నేషనల్ యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించింది. 2005 స్థాయి నుంచి 2030 నాటికి 33- నుంచి35 శాతం కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని, 2030 నాటికి శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్ కు ప్రత్యామ్నాయంగా సోలార్ పవర్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని 40 శాతానికి పెంచాలని పారిస్ అగ్రిమెంట్ లో ఇండియా ప్రతిజ్ఞ చేసినట్లు నివేదిక పేర్కొంది. యాక్షన్ ప్లాన్ లో భాగంగా 2014 మార్చి నాటికి 2.6 గిగా వాట్స్ ఉన్న సోలార్ పవర్ సామర్థ్యాన్ని 2019 జూలై వరకు 30 గిగా వాట్స్ కు పెంచింది. ఉత్పత్తి సామర్థ్యంలో ఇండియా 2019 ఏడాదికి ఐదో స్థానంలో నిలిచింది.
ముంచెత్తిన విపత్తులు
2019లో తీవ్ర కరువు దుర్భిక్షం వల్ల ఇండియాలో కోటి మంది తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. నీళ్ల కోసం వీధి పోరాటాలు జరిగాయి. గడిచిన 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆ ఏడాది వరదలు, విపత్తుల కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 1600 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా అత్యధికంగా కేరళలో లక్ష మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఇండియాలో టెక్స్ట్ బుక్స్‌లో చెప్పే పర్యావరణ విద్యకు, ప్రజల వ్యక్తిగత బాధ్యతకు అంతరం చాలా ఉందని, మెక్సికోలోనూ ఇలాగే ఉందని హెచ్ డీఆర్ రిపోర్ట్ వెల్లడించింది.
11.8 ఏళ్లు పెరిగిన ఆయుర్దాయం
రెండున్నర దశాబ్దాల కింద అంటే 1990లో భారత్‌లో పుట్టుక సమయంలో ఆయుర్దాయం (Life Expectancy at birth) 57.9 సంవత్సరాలు ఉండగా 2020లో అది 11.8 సంవత్సరాలు పెరిగి 69.7 కు చేరింది. ఈ విషయంలో మనకంటే వందకుపైగా దేశాలు ముందున్నాయి. 84.9 ఏళ్లతో హాంగ్ కాంగ్ ప్రజలు ప్రపంచంలో అత్యధిక ఆయురార్ధం కలిగి ఉన్నారు. జపాన్ ప్రజలు 84.6 ఏళ్లతో రెండో స్థానంలో ఉన్నాయి. ఇది ఆరోగ్యం విషయంలో మన వెనుకబాటుతనాన్ని గుర్తు చేస్తుంది. భారత్‌లో పురుషుల (68.5) కంటే మహిళల ఆయుర్దాయం(71) రెండున్నరేళ్లు ఎక్కువగా ఉండటం సంతోషకరమైన విషయమే అయినా మహిళలపై పత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నార్వేలో ఆయుర్దాయం 82.4 సంవత్సరాలు కాగా సగటు పాఠశాలలో గడిపే వయసు 18.1 సంవత్సరాలుగా ఉంటుంది. చివరిస్థానంలో ఉన్న దేశం నైగర్‌లో పుట్టిన పిల్లవాడు 62.4 సంవత్సరాలు బతికే అవకాశం ఉంది. ఇలాంటి తేడాలు ఆ దేశాలు మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన విషయాన్ని నొక్కి చెబుతున్నాయి.
భూ హక్కుతోనే మహిళలకు భద్రత
మహిళలు భూమిని కలిగి ఉండటం వల్ల వారి సామాజిక, ఆర్థిక భద్రత మరింత మెరుగవుతుందని, జెండర్ ఆధారిత హింస తగ్గుతుందని యూఎన్‌డీపీ నివేదిక పేర్కొంది. కరోనా మానవ అభివృద్ధికి పెద్ద షాక్ గా పరిణమించిందని, 2030 నాటికి సుమారు 90 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.
హెచ్‌డీఐ స్కోర్ పెరుగుదల
1990 -నుంచి 2019 మధ్య భారత్ హెచ్‌డీఐ స్కోర్ 50 శాతం పెరుగుదలను నమోదు చేస్తూ 0.427 నుంచి 0.645 కు పెరగటం పేదరిక నిర్మూలనలో ఇండియా సాధించిన ప్రగతిని ప్రతిబింబిస్తుందని యూఎన్ఓ తెలిపింది. అయితే ఇప్పటికీ మధ్యమ మానవాభివృద్ధి దేశాల జాబితాలోనే ఉండటమనేది దారిద్య్ర నిర్మూలనను వేగవంతం చేయాల్సిన విషయాన్ని స్పష్టం చేసింది. అల్పాభివృద్ధి దేశాల జాబితా నుంచి మధ్యమ మానవాభివృద్ధి దేశాల జాబితాలోకి రావడానికి భారత్‌కు దాదాపు 25 ఏళ్ల సమయం పట్టగా అత్యధిక మానవాభివృద్ది దేశాల జాబితాలోకి రావడానికి మరో 20 ఏళ్లు పడుతుందనేది అక్షర సత్యం.
బాలికల్లో పోషకాహార లోపం..
ఇండియాలో బాలికల ఆరోగ్యం, విద్యపై ఖర్చు విషయంలో తల్లిదండ్రుల ప్రవర్తనలో భిన్నమైన ప్రతిస్పందనలు వ్యక్తమయ్యాయని, వీరిపై తక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల అబ్బాయిల కంటే బాలికల్లో పోషకాహార లోపం ఎక్కువ ఉందని యూఎన్ నివేదిక పేర్కొంది. ఇండియా, పాకిస్థాన్ లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.
For More News..