ప్రపంచ ఆకలి సూచీలో 111వ స్థానంలో భారత్

ప్రపంచ ఆకలి సూచీలో 111వ స్థానంలో భారత్

ప్రపంచ ఆకలి సూచీ – 2023లో భారత్​ 111వ స్థానంలో నిలిచింది. 125 దేశాలకు సంబంధించి ఈ సూచీని 2023, అక్టోబర్ 12న విడుదల చేశారు. 27 స్కోర్​తో దక్షిణాసియా, సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా ప్రాంతాలు ఆకలి సూచీలో టాప్​లో ఉన్నట్లు చెప్పింది. సెంట్రల్​ ఆఫ్రికా రిపబ్లిక్​, మడగాస్కర్​, యెమన్​ తదితర దేశాల ఆకలి సూచీలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి.

5 కంటే తక్కువ స్కోర్​తో బెలారస్​, బోస్నియా హెర్జిగోవినా, చిలీ, చైనా, క్రొయేషియా, ఈస్టోనియా తదితర దేశాలు 1 – 20వ స్థానంలో దాదాపు సమానమైన స్థితిలో ఉన్నాయి. వాతావరణ మార్పులు, కల్లోలాలు, మహమ్మారులు, రష్యా – ఉక్రెయిన్​ యుద్ధం వంటివి ఆకలి సమస్యను ఎదుర్కోవడంలో అవరోధాలుగా నిలిచాయని సర్వే పేర్కొంది. 

భారత్​ స్థితిపై ఆందోళన

ఈ సూచీలో మొత్తం 125 దేశాల్లో 28.7 స్కోర్​తో ఆకలి విషయంలో భారత్​లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదిక చెప్పుకొచ్చింది. భారత బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా 18.7గా ఉంది. ఐదేండ్ల లోపు పిల్లల్లో మరణాల రేటు 3.1 శాతం, 15 – 24 ఏళ్ల లోపు మహిళల్లో రక్తహీనత ఉన్నవారి సంఖ్య ఏకంగా 58.1 శాతం ఉన్నాయని పేర్కొంది. అన్ని రకాలుగా పీకల్లోతు సంక్షోభంలో మునిగిన పాకిస్తాన్(102), శ్రీలంక(60)తోపాటు బంగ్లాదేశ్​ (81), నేపాల్​ (61) భారత్​ కంటే చాలా మెరుగైన ర్యాంకుల్లో ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 

ఈ సూచీని తిరస్కరించిన భారత్​ 

ఈ సూచీని లోపభూయిష్టమైనదిగా భారత్​ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇది తప్పుడు ర్యాంకింగ్, దురుద్దేశపూర్వకంగా ఇచ్చినదని అంటూ మండిపడింది. ఇది తప్పుడు పద్ధతులు వినియోగించి రూపొందించిన సూచీ. కేవలం 3000 మందిపై నిర్వహించిన ఒపీనియన్​ పోల్​ ఆధారంగా పౌష్టికాహార లోపం శాతాన్ని నిర్ధారించడం క్షమార్హం కాని విషయం. బాలల్లో వాస్తవంగా కేవలం 7.2శాతంగా ఉన్న పౌష్టికాహార లోపాన్ని ఏకంగా 18.7గా చిత్రించింది. దీని వెనుక దురుద్దేశాలు ఉన్నాయన్నది సుస్పష్టం అంటూ విమర్శించింది. 

ప్రపంచ ఆకలి సూచీ

ప్రపంచం, ప్రాంతీయం, జాతీయ స్థాయిల్లో ఆకలిని ప్రపంచ ఆకలి సూచీ మదింపు చేస్తుంది. ప్రధానంగా నాలుగు కొలమానాల ఆధారంగా ప్రపంచ ఆకలి సూచీని రూపొందిస్తారు. 

పౌష్టికాహార లోపం : జనాభాలో పౌష్టికాహార లోపం ఉన్న వారి శాతం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ లోపం ఉన్నవారు తీసుకునే క్యాలరీలు చాలినంతగా ఉండవు.
 

పిల్లల్లో నిస్సత్తువ : ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం వల్ల వారిలో ఉన్న తీవ్ర పోషకాహార లోపాన్ని చూపిస్తుంది. 

పిల్లల్లో ఎదుగుదల లోపం : ఐదేళ్ల లోపు పిల్లలు తమ వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం. ఇది కూడా పోషకాహార లోపం వల్లే చోటుచేసుకుటుంది. 

శిశు మరణాలు : ఐదేళ్ల లోపు పిల్లల్లో మరణాల రేటు. ఇది చాలినంత పోషకాహారం లేకపోవడంఅనారోగ్యకర పరిస్థితులను సూచిస్తుంది. ఈ నాలుగు సూచికల ఆధారంగా జీహెచ్​ఐ ఆకలిని లెక్కగడుతుంది. ఇందుకు 100 పాయింట్​ స్కేల్​ను తీసుకుంటుంది. 0 స్థాయిలో ఉంటే ఉత్తమ స్కోరు సాధించినట్లు. అక్కడ ఆకలి అనేది ఉండదు. 100 స్కోర్​ ఉంటే అది అత్యంత అధమ స్థాయి. వాస్తవంగా ఈ రెండు స్థాయిలో ఉండటం జరగదు. ప్రతి దేశం జీహెచ్​ఐ స్కోర్​ను తీవ్రత, తక్కువ నుంచి ఆందోళనకరంగా వర్గీకరించారు. 

జీహెచ్ఐ తీవ్రత స్కేల్​ (0 నుంచి 100)

తక్కువ                     9.9
మధ్యస్థ                     10-19.9
ఆందోళనకరం          20-34.9
ప్రమాదకరం              35 -49.9
అధిక ప్రమాదకరం   50

ప్రచురణ సంస్థలు

జర్మనీకి చెందిన వెల్త్​ హంగర్​ హిల్ఫ్​, ఐర్లాండ్​కు చెందిన కన్సర్న్​ వరల్డ్​ వైడ్​ అనే సంస్థలు ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబర్​ హంగర్​ ఇండెక్స్​–జీహెచ్​ఐ) రూపొందించి విడుదల చేస్తాయి. ఈ సంస్థలు 2006 నుంచి ఈ సూచీని విడుదల చేస్తాయి. పౌష్టికాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల, అయిదేళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు, మాతా శిశు మరణాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సూచీని రూపొందిస్తారు.  

జీహెచ్​ఐ లక్ష్యాలు

  •     ఆకలి పోరాటంపై అవగాహన, ప్రాచుర్యం కల్పించడం.
  •     వివిధ దేశాలు, ప్రాంతాల మధ్య ఆకలిని పోల్చి అందించడం.
  •     ప్రపంచంలో ఎక్కడైతే ఆకలి ఎక్కువగా ఉందో, ఆకలి నిర్మూలనకు అదనపు చర్యలు అవసరమో గుర్తింపు పిలుపునివ్వడం.