లింగ సమానత్వ సూచీలో భారతదేశం తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఎనిమిది స్థానాలను ఎగబాకి 127వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఈ సూచీలను తయారు చేసింది. 2023, జూన్ 21న విడుదల చేసిన తన వార్షిక నివేదిక గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్–2023లో ఈ వివరాలు పొందుపరిచింది. ఐస్లాండ్ వరుసగా 14వ సారి మొదటిస్థానాన్ని సాధించింది. పాకిస్తాన్ సూచీల పట్టికలో చివరి నుంచి నాలుగో స్థానంలో అంటే 142వ స్థానంలో ఉంది. ఏ దేశం పూర్తిగా లింగ సమానత్వాన్ని సాధించలేకపోయిందని నివేదిక పేర్కొంది.
అయితే, ముందున్న మొదటి తొమ్మిది దేశాలు(ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్, న్యూజిలాండ్, స్వీడన్, జర్మనీ, నికరాగువా, నమీబియా,లిథుమేనియా) చాలా దగ్గరగా 80 శాతం వ్యత్యాసాన్ని పూరించగలిగాయి అని తెలిపింది. ప్రస్తుతం సాధిస్తున్న ప్రగతిని బట్టి పూర్తి సమానత్వం రావాలంటే 131 సంవత్సరాలు పడుతుందని నివేదిక అభిప్రాయపడింది.
ప్రపంచ లింగ వ్యత్యాస సూచీ
ఈ సూచీని ప్రపంచ ఆర్థిక ఫోరం(డబ్ల్యూఈఎఫ్) 2006లో మొదటిసారి తీసుకొచ్చింది. ఇది లింగ సమానత్వంలో వివిధ దేశాల ప్రగతిని పోల్చి సూచీని విడుదల చేస్తుంది. విద్య, ఆర్థికపరమైన భాగస్వామ్యం, ఉపాధి, రాజకీయ అవకాశాలు, ఆడ శిశు జననాలు, స్త్రీల ఆరోగ్యం తదితర అంశాల ఆధారంగా డబ్ల్యూఈఎఫ్ ఏటా సూచీలను ప్రకటిస్తున్నది.
భారత్ పనితీరు
ఈసారి భారత్ 1.4 శాతం మేరకు తన పాయింట్లను పెంచుకుని తన స్థానం కాస్త మెరుగుపరుచుకుందని ఈ నివేదిక తెలిపింది. దీంతో భారత్ స్థానం 146 దేశాల్లో 127వ స్థానంలో నిలిచింది. భారత్ లింగ సమానత్వంలో 64.3 శాతంతో నిలిచింది. 2022 నివేదికలో భారత్ 135వ స్థానంలో ఉంది.
లింగ సమానత్వంలో ముందున్న ఐదు దేశాలు
ర్యాంక్ దేశం స్కోర్
1 ఐస్లాండ్ 0.912
2 నార్వే 0.879
3 ఫిన్లాండ్ 0.863
4 న్యూజిలాండ్ 0.856
5 స్వీడన్ 0.815
127 భారత్ 0.643