స్త్రీ, పురుష సమానత్వంలో 135వ స్థానంలో భారత్

స్త్రీ, పురుష సమానత్వంలో 135వ స్థానంలో భారత్

స్త్రీ, పురుష సమానత్వం విషయంలో భారత్​ అట్టడుగున 135వ స్థానంలో నిలిచింది. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలకు సంబంధించి గతంతో పోలిస్తే 5 ర్యాంకులు ఎగబాకినా ప్రపంచంలో ఇంకా చివరి స్థానాల్లోనే భారత్​ ఉన్నట్లు ప్రపంచ ఆర్థిక ఫోరానికి(డబ్ల్యూఈఎఫ్​) చెందిన జండర్​ గ్యాప్​ రిపోర్ట్​–2022లో పేర్కొన్నారు. మొత్తం 146 దేశాల సూచీలో భారత్​ తర్వాతి స్థానాల్లో 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఆఫ్గనిస్తాన్​, పాకిస్తాన్​, కాంగో, ఇరాన్​, చద్​లు చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయి. స్త్రీ, పురుష సమానత్వం ఎక్కువగా ఉండే దేశంగా ఐస్​లాండ్​ తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటూ ప్రపంచంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.

ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్​లాండ్​, నార్వే, న్యూజిలాండ్​, స్వీడన్​లు ఉన్నాయి. 2021తో పోలిస్తే ఆర్థిక రంగంలో భాగస్వామ్యం, అవకాశాల విషయంలో చాలా సానుకూల మార్పులు ఉన్నాయని స్త్రీ, పురుష కార్మికుల భాగస్వామ్యం మాత్రం తగ్గిందని నివేదిక పేర్కొంది. మహిళా ప్రజా ప్రతినిధులు, సీనియర్​ అధికారులు, మేనేజర్ల శాతం 14.6శాతం నుంచి 17.6శాతానికి పెరిగిందని, మహిళా సాంకేతిక పని వారి శాతం 29.2 నుంచి 32.9 శాతానికి పెరిగిందని వివరించింది. రాజకీయ సాధికరత విషయంలో భారత్​ 48వ స్థానంలో ఉంది. హెల్త్​, సర్వైవల్​ సూచీలో భారత్​ చివరి స్థానం(146)లో ఉండటం గమనార్హం.