- ఆఖరి లీగ్‌లో నేపాల్‌పై గ్రాండ్ విక్టరీ
దుబాయ్: అండర్–19 ఆసియా కప్‌లో ఇండియా కుర్రాళ్లు అదరగొట్టారు. సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పేసర్ రాజ్ లింబాని (7/13) ఏడు వికెట్లతో దుమ్మురేపాడు. దీంతో మంగళవారం జరిగిన గ్రూప్–ఎ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో నేపాల్‌పై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఫలితంగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించిన ఇండియా సెమీస్‌లోకి దూసుకెళ్లింది.
తొలుత నేపాల్ 22.1 ఓవర్లలో 52 రన్స్‌కే కుప్పకూలింది. బరోడాకు చెందిన 18 ఏండ్ల లింబాని ఇన్ స్వింగర్ల ముందు నేపాల్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. హేమంత్ దామి (8) టాప్ స్కోరర్. అండర్–19 ఇంటర్నేషనల్స్‌లో బెస్ట్ పెర్ఫామెన్స్ చేసిన ఇండియా రెండో బౌలర్‌గా రాజ్ రికార్డులకెక్కాడు.
2004 అండర్–19 ఆసియా కప్‌లో ఇర్ఫాన్ పఠాన్ (9/16) సంచలన బౌలింగ్ టాప్‌లో ఉంది. ఛేజింగ్‌లో ఇండియా 7.1 ఓవర్లలో 57/0 స్కోరు చేసి నెగ్గింది. అర్షిన్ కులకర్ణి (40 నాటౌట్) సత్తా చాటాడు. రాజ్ లింబానికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. గ్రూప్–ఎలో జరిగిన మరో మ్యాచ్‌లో పాకిస్తాన్ 83 రన్స్ తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.