- నేడు న్యూజిలాండ్‌తో తొలి పోరు..రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
దుబాయ్ : ఎనిమిది ఎడిషన్లు.. మూడుసార్లు తొలి రౌండ్‌లోనే ఓటమి.. నాలుగుసార్లు సెమీస్ చేరిక.. ఒక్కసారి ఫైనల్‌కు వెళ్లినా టైటిల్ మాత్రం గెలవలేదు. విమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా టీమ్ చరిత్ర ఇది. ఈ నేపథ్యంలో మరోసారి టీ20 మెగా సమరానికి టీమిండియా సిద్ధమైంది. గ్రూప్–ఎలో భాగంగా శుక్రవారం జరిగే తొలి పోరులో బలమైన న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
క్లిష్టమైన గ్రూప్‌లో ఉన్న హర్మన్‌సేన టైటిల్ దిశగా సాగాలంటే ప్రతి మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. కాబట్టి గత పరాజయాలను దృష్టిలో పెట్టుకుని తొలి మ్యాచ్ నుంచే పక్కా ప్లాన్స్‌తో ఆడాలి. ఇది జరగాలంటే టీమ్‌లో ఉన్న ప్రతి సీనియర్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న యంగ్‌స్టర్స్ కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఇండియా పయనం సాఫీగా సాగుతుంది.
స్మృతి, హర్మన్‌పైనే భారం..
గతంలో మాదిరిగానే ఈసారి కూడా మెగా టోర్నీ కోసం టీమిండియా బలమైన జట్టునే ఎంపిక చేసింది. అవకాశం వచ్చినప్పుడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పే నాణ్యమైన బ్యాటర్లు, బౌలర్లు అందుబాటులో ఉన్నారు. అయితే వాళ్లను ఎలా ఎప్పుడు ఉపయోగించుకోవాలన్న దానిపైనే అసలు కథ ఆధారపడి ఉంది. లీగ్ దశ వరకు సజావుగా సాగుతున్న ఇండియా పెర్ఫామెన్స్ నాకౌట్ వచ్చేసరికి ఒత్తిడికి లోనవుతుంది. ఈసారి దీన్ని అధిగమించాలి. దానికోసం కొన్ని కౌన్సెలింగ్ సెషన్స్ కూడా తీసుకున్నారు. కాబట్టి అది ఎంతవరకు ఫలితం ఇస్తుందో చూడాలి.
ఇక ఇండియా బ్యాటింగ్ లైనప్ మొత్తం స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, జెమీమాపై ఎక్కువగా ఆధారపడి ఉంది. టోర్నీలో ముందుకెళ్లాలంటే వీళ్లు సత్తా చాటడం చాలా అవసరం. యూఏఈ పిచ్‌లపై భారీ స్కోర్లు చేసే చాన్స్ లేదు కాబట్టి ఈ నలుగురిలో ఏ ఇద్దరు కుదురుకున్నా ఈజీగా మ్యాచ్‌ను గెలిపించొచ్చు. బౌలింగ్‌లోనూ ఇండియాకు తిరుగులేదు. పేసర్లు రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి బాగా మెరుగయ్యారు.
వీళ్లతో పాటు స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రాధా యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. పిచ్‌ను బట్టి వీళ్ల కాంబినేషన్ మారనుంది. యూఏఈ పిచ్‌లు పేస్‌కు ఎక్కువగా అనుకూలించవు కాబట్టి ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్‌ను ఎంచుకోవచ్చు.
ఆల్‌రౌండర్ల బలం..
న్యూజిలాండ్ జట్టులో ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశం. అనుభవం, యువ ప్లేయర్లతో మంచి కాంబినేషన్స్‌ను రెడీ చేశారు. కెప్టెన్ సోఫీ డివైన్, ఆల్‌రౌండర్ సుజీ బేట్స్‌తో పాటు వెటరన్ పేసర్లు లీ తహుహు, లీ కాస్పెర్ ఈ టోర్నీలో అత్యంత కీలకం కానున్నారు. యువ ఆల్‌రౌండర్ అమేలియా కెర్‌తో జట్టులో మంచి సమతుల్యం రానుంది.
బ్యాటింగ్, బౌలింగ్ సమతూకంతో పాటు ఫీల్డింగ్‌లోనూ కివీస్‌కు తిరుగులేదు. మొత్తానికి టోర్నీ ఫేవరెట్‌గా దిగుతున్న ఇండియాకు ఆరంభంలోనే చెక్ పెడితే రాబోయే మ్యాచ్‌ల్లో మరింత మెరుగ్గా రాణించొచ్చని కివీస్ భావిస్తోంది.
తుది జట్లు (అంచనా)
ఇండియా : హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, యాస్తికా భాటియా, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రొడ్రిగ్స్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంకా పాటిల్, సజన.
న్యూజిలాండ్ : సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇసబెల్లా గాజె, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హల్లీడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పరెక్, జెస్ కెర్, అమెలియా కెర్, రోస్‌మెరీ మేయర్, మోలీ పెన్‌ఫోల్డ్, జార్జియా ప్లిమెర్, హన్నా రోవ్, లీ తహుహు.