ముంబై: సెప్టెంబర్ క్వార్టర్లో భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతానికి తగ్గే అవకాశం ఉందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం తెలిపింది. భారీ వర్షాలు, బలహీనమైన కార్పొరేట్ పనితీరు ఇందుకు కారణాలని పేర్కొంది. అయితే, ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయన్న అంచనాలతో ఏజెన్సీ తన 2024–2025 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాను ఏడు శాతం వద్ద కొనసాగించింది. ఆర్బీఐ ఆర్థిక సంవత్సరానికి 7.2 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. అయితే చాలా మంది ఇది ఏడు శాతం కంటే తక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. రెండో క్వార్టర్ జీడీపీ డేటా నవంబర్ 30న ప్రచురించే అవకాశం ఉంది. ఒకటో క్వార్టర్లో జీడీపీ విస్తరణ 6.7 శాతంగా ఉంది. ప్రభుత్వ వ్యయం, ఖరీఫ్ సాగు సానుకూల ధోరణులను కనబరిచినప్పటికీ, పారిశ్రామిక రంగం, ముఖ్యంగా మైనింగ్, విద్యుత్ రంగాలు మందగించే అవకాశం ఉందని ఇక్రా పేర్కొంది.