చరిత్రలో అది మరిచిపోలేని రోజు : ఎయిర్ ఇండియా ఫ్లైట్ బ్లాస్ట్

జూన్ 23, 1985 సంవత్సరంలో జరిగిన ఘోర విషాదం ఇండియా చరిత్రలో ఇప్పటికీ నిలిచిపోయింది. ఎయిర్ ఇండియాకు చెందిన కనిష్క 182 బోయింగ్ 747-237B విమానం బాంబ్ బ్లాస్ట్ కు గురైంది. అందులో ప్రయాణిస్తున్న 329 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ ప్రమాదానికి గుర్తుగా కెనడా వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేయబడింది. 

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆ ఉగ్రవాద చర్యను గుర్తుచేసుకుంటూ ఎక్స్ లో షేర్ చేసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన 329 మందికి జైశంకర్ నివాళులర్పించారు. ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించరాదని ఆయన పేర్కొన్నారు.
 

సరిగ్గా 39ఏళ్ల క్రితం కెనడాలోని మాంట్రియల్ నుంచి లండన్ వెళ్తుండగా ఉగ్రవాదులు బాంబుతో పేల్చేశారు. సూట్ కేసులో పెట్టిన బాంబ్ పేలి 24 మంది భారతీయులు, 27 మంది బ్రిటిషర్లు, 268 మంది కెనడియన్లు చనిపోయారు. ఈ  విమానం చివరిగా ఢిల్లీ, ముంబై గమ్యస్థానాలను చేరుకోవాల్సి ఉంది. ఈ ప్రమాదంలో విమానం కూలిపోయి సముద్రంలో పడింది.. కేవలం 131 మంది మృతదేహాలు మాత్రమే దొరికాయి. ఈమధ్యకాలంలో కెనడా, భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతింటున్నాయి.  ఈ బాంబు దాడిని కెనడాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాదులు జరిపిన పిరికిపంద ఉగ్రవాద చర్యగా ఒట్టావాలోని భారత హైకమిషన్‌ అభివర్ణించింది.