కాన్పూర్ టెస్టులో టీమిండియా బ్యాటర్ల విధ్వంసానికి బంగ్లాదేశ్ కొట్టుకుపోతుంది. ఆడుతుంది టెస్ట్ క్రికెట్ అనే సంగతి మనోళ్లు మర్చిపోయారా అనే అనుమానం కలగక మానదు. టెస్ట్ నాలుగో రోజుకు చేరడంతో భారత్ దూకుడుగా ఆడుతూ టీ20 క్రికెట్ ను గుర్తు చేస్తుంది. ఓపెనర్లు రోహిత్, జైశ్వాల్ చెలరేగడంతో భారత్ రెండు ప్రపంచ రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. తొలి మూడు ఓవర్లకే 51 పరుగులు చేసింది. దీంతో భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగుల మార్క్ అందుకున్న జట్టుగా ప్రపంచ రికార్డ్ ను నెలకొల్పింది.
రోహిత్ శర్మ 11 బంతుల్లో 3 సిక్సులు.. ఒక ఫోర్ తో 23 పరుగులు చేసి మెహదీ హసన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. వికెట్ పడినా భారత్ దూకుడు తగ్గలేదు. సిక్సులు, ఫోర్లతో గ్రౌండ్ ను హోరెత్తించారు. యువ ఆటగాడు జైశ్వాల్ తన విధ్వంసకర ఆట కొనసాగించడంతో తొలి 10.1 ఓవర్లలోనే భారత్ స్కోర్ 100 పరుగులకు చేరుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగుల మార్క్ అందుకున్న జట్టుగా ప్రపంచ రికార్డ్ ను సాధించింది.
జైశ్వాల్ తో పాటు గిల్ దూకుడుగా ఆడడంతో భారత్ నాలుగో రోజు టీ విరామానికి 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్ (37), పంత్ (4) ఉన్నారు. 51 బంతుల్లోనే 72 పరుగులు చేసి జైశ్వాల్ టీ విరామానికి ముందు ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి. బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకు ఆలౌట్ అయింది.
Fastest team 100s in Test cricket (overs faced) pic.twitter.com/TGR18pUZOH
— RVCJ Media (@RVCJ_FB) September 30, 2024