చీటా అంటే సూపర్ ఫాస్ట్. మన బుల్లెట్ ట్రైన్ లాంటిది. చెంగుచెంగున గెంతుతూ మహా స్పీడుగా ఉరుకుతుంది. కానీ మనదేశంలో ఒకటంటే ఒక చీటా కూడా లేదు. సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఇచ్చిన తీర్పు పుణ్యమా అని 70 ఏళ్ల తరువాత మళ్లీ దేశంలోకి చీటాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘చిరుత’ లని మనం పిలుచుకునే ‘చీటా’ మన దేశంలో కనిపించి చాలా కాలమైంది. 1947లో చివరిసారిగా చీటా కనిపించినట్లు రిపోర్టులున్నాయి. 1952 నుంచి అంతరించిపోతున్న జాబితాలో చేరిపోయాయి. ఇప్పుడు మళ్లీ మనదేశంలోకి రాబోతున్నాయి. ఆఫ్రికాలోని నమీబియా దేశం నుంచి ఇక్కడకు చీటాలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో 70 ఏళ్ల తరువాత చీటాలు మళ్లీ మనదేశంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఎక్కడో నమీబియా నుంచి తెప్పించడమేమిటి ? మన దేశంలో చీటాలన్నీ ఎట్లా మాయయైపోయినాయ్ ? అనే ప్రశ్న రావడం సహజం. ఇది తెలుసుకోవాలంటే చీటాల చరిత్ర తిరగేయాల్సిందే.
ప్రత్యేక వాతావరణం
చీటాలు ఎక్కడపడితే అక్కడ బతకలేవు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే అవి బతకగలుగుతాయి. పొదలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. వేట కోసం పొదల మాటున నక్కి ఉంటాయి. చీటాలు ఉండటానికి వీలైన భూములు మనదేశంలో ఎక్కడ ఉన్నాయనే విషయమై 2000ల్లో డెహ్రాడూన్ లోని ‘ వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ’ ( డబ్ల్యు ఐఐ) ఒక సర్వే జరిపింది. మధ్యప్రదేశ్ లోని కువో– పాల్పూర్, నౌరదేహీ అలాగే రాజస్థాన్ లోని షాగర్ లను చీటాలకు అనువైన ప్రదేశాలుగా ‘ వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ’ గుర్తించింది. ఈ పరిస్థితుల్లో 2010 లో నమీబియా నుంచి మనదేశానికి చీటాలను తరలించడానికి రంగ సిద్దమైంది. పది చీటాలను మనదేశానికి ఇవ్వడానికి నమీబియాలోని ‘ చీటా కన్సర్వేషన్ ఫండ్ ’ (ఎన్ సి ఎఫ్ ) ఒప్పుకుంది. ఈ ప్రతిపాదనకు చీటాల సంరక్షణకు సంబంధించిన అంతర్జాతీయ సంస్థ ‘ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచుర్ ’ ( ఐయుసిఎన్ ) కూడా ఓకే చెప్పింది.
ఆఫ్రికన్ చీటాలను నమీబియా నుంచి తెప్పించి, మధ్య ప్రదేశ్ కునో పాల్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీలో పెట్టాలని, వాటికి ఆవాసం ఏర్పాటు చేయాలని అనుకున్నారు. దీనికోసం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే కునో పార్కును సింహాల సంతానోత్పత్తి ని పెంచడానికి తయారు చేయాలనుకున్నారు, దాని కోసం మధ్య ప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాయి.ఇంతా చేస్తే ఆ పార్కులో విదేశీ చీటాలను తీసుకురావాలన్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో 2012లో కేసు వేశారు.
కోర్టు తీర్పు ఏమంది ?
విదేశాల నుంచి చీటాలను మనదేశానికి తరలిస్తే అవి ఇక్కడి వాతావరణంలో ఉండగలవా? మన ఎకో సిస్టం ను అవి అడాప్ట్ చేసుకోగలవా ? అనే ఇష్యూపై పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సమగ్ర అధ్యయనం జరపలేదన్నది పిటిషన్ దారుల వాదన. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవడంతో చీటాల తరలింపు ప్రాజెక్టు అటకెక్కింది. అయితే తాజాగా సుప్రీం కోర్టు తీర్పు మారింది. సింహాల కోసం వేరే జాగా చూడాలని, కునో నేషనల్ పార్కును ఆఫ్రికన్ చీటాలకు కేటాయించాలని సుప్రీంకోర్టు తాజా తీర్పులో పేర్కొంది.
లేటెస్ట్ గా సుప్రీంకోర్టు అనుమతితో చేపట్టబోతున్న నమీబియా చీటాల తరలింపు ప్రాజెక్టు వల్ల మనదేశానికి లాభమే జరుగుతుందంటున్నారు వన్యప్రాణుల సంరక్షణలో ప్రముఖుడైన డాక్టర్ ఎంకే రంజిత్ సిన్హ్. ఎకో సిస్టమ్‌కు మేలు జరుగుతుందన్నారు.
ప్రాజెక్టు సక్సెస్ పై డౌట్స్
ఓ ప్రయోగంలా చేపడుతున్న చీటా ప్రాజెక్టు పై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతరించిపోయిన జాబితాలో ఎన్నో జంతువులున్నా వాటన్నిటినీ విడిచిపెట్టి ఒక్క చీటాలనే వేరే దేశం నుంచి ఎంతో ఆర్భాటంగా తరలించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో నమీబియాలో ఉండే చీటాలు ఇక్కడ మన వాతావరణానికి అలవాటు పడతాయా ? అనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా తెరమీదకు వచ్చింది. గతంలో కొన్ని అంతరించిపోతున్న జంతువుల విషయంలో ఇలాంటి ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయని వీరంటున్నారు.
ఒకప్పుడు వేల సంఖ్యలో...
చీటాలు ఇతర జంతువుల కంటే డిఫరెంట్ గా కనిపిస్తాయి. వందేళ్ల కిందట మనదేశం సహా ఆఫ్రికా, ఆసియాలో వేల సంఖ్యలో ఉండేవని చెబుతారు. అయితే వీటి చర్మానికి మార్కెట్లో డిమాండ్ ఉండటంతో వేటగాళ్లు వీటిని ఎక్కువగా వేటాడటం మొదలెట్టారు. అలాగే అడవులను ఇష్టమొచ్చినట్లు నరికివేయడం వల్ల చిన్న జంతువులు బాగా తగ్గిపోయాయి. వేటాడటానికి చిన్న జంతువులు లేకపోవడం వల్ల కూడా చీటాల సంఖ్య తగ్గిపోయిందంటారు జువాలజిస్టులు. 1951 తరువాత మనదేశంలో చీటా కనిపించకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో 1970ల్లో ఇరాన్ నుంచి చీటాలను తీసుకురావడానికి, వాటికి బదులుగా మనదేశం సింహాలు ఇవ్వడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అయితే అదే సమయంలో ఇరాన్ లో ‘ఇస్లామిక్ రివల్యూషన్ ’ రావడం, కింగ్ షా పదవి నుంచి దిగిపోవడం జరిగాయి. దీంతో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు.
లడఖ్ లో మంచు చిరుతలు
లడఖ్ ప్రాంతం మంచు చిరుతలకు ఫేమస్. చీటాలకు ఈ మంచు చిరుతలకు బోలెడన్ని తేడాలున్నా, కొన్ని పోలికలూ ఉంటాయి. ఇక్కడి చిరుతలు హిమాలయాల్లో ఉండే మంచు వాతావరణానికి అలవాటు పడి ఉంటాయి. గడ్డకట్టించే చలిలో కూడా ఇవి బతకగలుగుతాయి. లడఖ్ లోని హేమిస్ నేషనల్ పార్కు లో ఈ మంచు చిరుతలు కనిపిస్తాయి.
అమెరికాలో చీటా షో లు
అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో చీటా షోలు ఉంటాయి. అరుదైన జంతువును చూడటానికి పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. ఎక్కువగా విదేశాల నుంచి వచ్చే టూరిస్టులుఈ షో చూడటానికి ఆసక్తి చూపుతారు.
మిగిలినవి కొన్నే…
ప్రపంచవ్యాప్తంగా కేవలం తక్కువ సంఖ్యలోనే చీటాలు ఉన్నాయి. ఆఫ్రికాలోని కొన్ని దేశాలు, అలాగే ఇరాన్ లోనూ చీటాలు మిగిలి ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి.
తెలివిలో దానికదే సాటి
చీటా చాలా తెలివైనది. దాన్ని వేటాడ్డంలో చూపిస్తుంది. చాలా దూరంగా ఉన్న జంతువులను కూడా శరీరవాసన ద్వారా పసిగడుతుంది. అంతా ఓకే అనుకున్నాక సడన్ గా వేటాడాల్సిన జంతువు పై దాడి చేసి చంపేస్తుంది. చీటా ఎక్కువగా తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లో వేటాడుతుంది. వేట పూర్తయితే మిగతా పగలంతా నిద్రలోనే గడిపేస్తుంది. రాత్రిళ్లు అసలు వేటకే వెళ్లదు.
పెంపుడు జంతువులుగా కూడా ….
చీటాలను పెంపుడు జంతువులుగా కూడా కొంత మంది రాజులు పెంచుకున్నారన్న రిపోర్టులు కూడా ఉన్నాయి. పర్షియా రాజులైతే చీటాల కళ్లకు గంతలు కట్టి వాటిని గుర్రపు రథాల వెనకవైపు నుంచి అడవిలో వేటకు తీసుకెళ్లేవారని చెబుతారు. వేటాడాలనుకున్న జంతువు దగ్గరగా వచ్చినప్పుడు, చీటాల కళ్లకున్న గంతలు తీసేస్తారట. అలాగే మొఘల్ పాలకుల దగ్గర చిరుతలు ఉండేవని అంటారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. చీటాలు చాలా భయంకరమైన జంతువులని, వాటిని పెంచుకోవడం అంటే మామూలు విషయం కాదన్న అభిప్రాయాలూ ఉన్నాయి.
నాలుగు రకాలు
చీటాలు ప్రధానంగా నాలుగు రకాలు. అవి.. టాంజానియన్ చీటా, సూడాన్ చీటా, సౌతాఫ్రికా చీటా, ఆసియాటిక్ చీటా. ఈ జంతువులు సహజంగా ఆఫ్రికా, ఆసియాల్లోనే ఎక్కువగా కనపడతాయి. ఆఫ్రికాలోని నమీబియా అయితే ‘ ల్యాండ్ ఆఫ్ ది చీటాస్’ గా పాపులర్. ఆఫ్రికా చీటాలు ఎక్కువగా దుప్పులను వేటాడతాయి. ‘ ఇంపాలా’ అనే ఒకరకం లేడిని ఇష్టపడి తింటాయి. ఆసియా చీటాలైతే అడవి దున్నలను వేటాడతాయి. గిన్నెకోళ్లు, కుందేళ్లను కూడా చీటాలు తింటాయి.
అరబ్ షేక్‌ల ఇళ్లల్లో చిరుతలు
పెంపుడు జంతువులనగానే సహజంగా కుక్కలు, పిల్లులు గుర్తుకువస్తాయి. అయితే అరబ్బు దేశాల్లోని కొంత మంది షేక్ లు సరదాగా చిరుతలను పెంచుకుంటారు. ఇక్కడ చిరుతలంటే చీటాలే కానక్కర్లేదు. లెపర్డ్, జాగ్వర్ లు కూడా కావచ్చు. ఇలా చిరుతలను పెంచుకోవడం అక్కడ ఒక స్టేటస్ సింబల్ గా మారింది. ఒక్కో చిరుత రేటు మన కరెన్సీలో చెప్పాలంటే నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు పలుకుతోందట. ఈ రేంజ్ లో డబ్బులు ఖర్చు పెట్టి ఆఫ్రికా నుంచి అక్రమంగా చిరుతలను కొంటున్నట్లు వార్తలందుతున్నాయి. అంతేకాదు చిరుతలతో ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పెట్టి గర్వంగా ఫీలవుతుంటారు. ఆఫ్రికా లోని అనేక దేశాల నుంచి గల్ఫ్ కు ఈ అక్రమ దందా జరుగుతున్నట్లు ‘ చీతా కన్సర్వేషన్ ఫండ్ ’ (సీసీఎఫ్ ) వెల్లడించింది.
మచ్చలే స్పెషాలిటీ
జంతు ప్రపంచంలో చీటాలది ఒక అరుదైన జాతి. చీటా సగటు జీవితకాలం పది నుంచి పన్నెండేళ్లు. బరువు మ్యాగ్జిమమ్ 55 కిలోలు. ఏడున్నర అడుగుల పొడవు ఉంటుంది. ఆడ చీటాల కంటే మగ చీటాలు సైజులో పెద్దవిగా ఉంటాయి. కళ్ల దగ్గరి నుంచి నోటివరకు ఉండే నల్లని మచ్చలు స్పెషల్ అట్రాక్షన్ లా ఉంటాయి. సూర్య
అన్నీ చిరుతలే కానీ…
మనం ‘ జూ’ కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే లెపర్డ్, జాగ్వర్ లను చూసి చీటాలనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. వీటన్నిటినీ కలిపి సింపుల్ గా ‘చిరుత’ అనేస్తాం కానీ చిరుతలన్నీ చీటాలు కావు. చీటాలకు, లెపర్డ్ లకు, జాగ్వర్ లకు కొన్ని పోలికలు ఉంటాయి. పైపైన చూసి వీటిని గుర్తించడం చాలా కష్టం. వాటి శరీరంపై ఉండే మచ్చల ఆధారంగా ఏది చీటానో, ఏది లెపర్డో, ఏది జాగ్వరో, ఏది పాంథరో తెలుసుకోవచ్చు. చీటాల బాడీపై గుండ్రటి నల్లటి మచ్చలుంటాయి. శరీరం సన్నదిగా, విల్లులా సాగి ఉంటుంది. నోరు చిన్నదిగా ఉంటుంది. వంచనకు మారుపేరుగా కనిపిస్తుంది ఆ మొహం చూస్తే.
పరుగులో మహా స్పీడ్
చీటాలు పరుగు వీరులు. స్పీడ్ గా పరుగెత్తడానికి ఒక ప్రతీకలా మారిపోయింది చీటా. ఎవరైనా స్పీడుగా పరుగెత్తితే వాళ్లను సహజంగా చిరుతలతో పోలుస్తారు. గంటకు 110 నుంచి 150 కిలోమీటర్ల స్పీడుతో పరుగెత్తగల సత్తా చీటాల సొంతం. రన్నింగ్ స్టార్ట్ చేసిన మూడు, నాలుగు సెకన్లలోనే ఈ స్పీడ్ అందుకోవడం చీటాల ప్రత్యేకత. అంతేకాదు ఎంత స్పీడుగా పరుగెత్తగలవో అంతే స్పీడుగా యూ టర్న్ కూడా తీసుకోగల టెక్నిక్ చీటాల సొంతం.స్పీడు గా పరుగెత్తడంలో అన్ని జంతువులను దాటిపోయినా చీటాలు చాలా త్వరగా అలసిపోతాయి. దీంతో ఎక్కువ దూరం పరుగెత్తలేవు. అయితే పరుగు ఆపేంతవరకు ఒకే స్పీడు మెయింటైన్ చేస్తాయి.