
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో ఇటీవల రైలు హైజాక్ అయిన విషయం తెలిసిందే. ప్రయాణికులతో వెళ్తోన్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలూచ్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది. అయితే.. ఈ ఘటన వెనక భారత్ హస్తం ఉందని పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. ఈ క్రమంలో దాయాది పాకిస్థాన్ ఆరోపణలపై భారత్ ఘాటుగా స్పందించింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ వెనక భారత్ హస్తం ఉందని పాక్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేయడం పాక్ ఇకనైనా ఆపాలని చురకలంటించింది.
ఈ మేరకు శుక్రవారం (మార్చి 14) భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ ఎపిసోడ్లో భారత్ ప్రమేయం ఉందని పాకిస్తాన్ చేసిన నిరాధారమైన ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రపంచ ఉగ్రవాదానికి అసలైన కేంద్రం ఎక్కడ ఉందో ప్రపంచమంతా తెలుసని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఇకనైనా తన అంతర్గత సమస్యలు, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నిందను ఇతరులపైకి నెట్టడానికి బదులుగా అసలు సమస్య ఏంటనేది తెలుసుకోవాలని చురకలటించారు.
అంతకుముందు గురువారం (మార్చి 13) పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి వెనక భారత్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ‘‘పాకిస్తాన్‌లో ఉగ్రవాదం పెట్రేగిపోవడంలో భారతదేశం ప్రమేయం ఉంది. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన ప్రత్యేక దాడిలో ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌లోని వారి నిర్వాహకులు, భారత లీడర్లతో సంప్రదింపులు జరిపారు’’ అని షఫ్కత్ అలీ ఖాన్ ఆరోపించారు. పాక్ విదేశాంగ శాఖ ఆరోపణలపై భగ్గుమన్న భారత్.. పై విధంగా ఘాటుగా రిప్లై ఇచ్చింది.
Also Read : యువతను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు
అసలేం జరిగిందంటే..?
2025, మార్చి 14 మంగళవారం ఉదయం 9 గంటలకు పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌కు బయలుదేరిన జాఫర్ ఎక్స్ ప్రెస్‌ను మిలిటెంట్లు హైజాక్ చేశారు. ఆ సమయంలో ట్రెయిన్లో దాదాపు 450 మంది ప్యాసింజర్లు ఉన్నారని రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే, మహిళలు, వృద్ధులు, పిల్లలు, బలూచ్ తెగ ప్రజలందరినీ తాము సురక్షితంగా విడిచిపెట్టామని, ఆర్మీ, పోలీస్, ఇతర భద్రతా బలగాలకు చెందిన 214 మందిని మాత్రమే బందీలుగా పట్టుకున్నామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) మిలిటెంట్లు ప్రకటించారు.
Also Read :రిస్క్‌లో 85 లక్షల మంది స్టూడెంట్ల ఫ్యూచర్
ఎదురు తిరిగిన 30 మంది ఆర్మీ జవాన్లను చంపేశామని, తమపై భద్రతా బలగాలు కాల్పులకు దిగితే బందీలందరినీ చంపేస్తామని హెచ్చరించారు. రంగంలోకి దిగిన పాక్ ఆర్మీ.. స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్ల చెర నుంచి 346 మంది బందీలను పాకిస్తాన్ సైన్యం విముక్తులను చేసింది. ఈ ఆపరేషన్ ముగిసే సమయానికి దురదృష్టవశాత్తూ బందీలుగా చిక్కిన ప్రయాణికుల్లో 21 మంది మరణించినట్లు పాక్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. 33 మంది మిలిటెంట్లను పాక్ సైన్యం హతమార్చింది.