Mpox Clade 1: డేంజర్ వైరస్ వచ్చేసింది.. మంకీపాక్స్ క్లేడ్ 1 స్ట్రెయిన్ తొలి కేసు నమోదు

Mpox Clade 1: డేంజర్ వైరస్ వచ్చేసింది.. మంకీపాక్స్ క్లేడ్ 1 స్ట్రెయిన్ తొలి కేసు నమోదు

ఢిల్లీ: భారత్లో మంకీపాక్స్(Mpox) క్లేడ్ 1 స్ట్రెయిన్ తొలి కేసు నమోదైంది. కేరళకు చెందిన ఒక వ్యక్తికి క్లేడ్ 1 స్ట్రెయిన్ మంకీపాక్స్ వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం (సెప్టెంబర్ 23, 2024) నాడు వెల్లడించింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించిన ఆందోళనకరమైన క్లేడ్ 1 రకానికి చెందిన కేసు నమోదు కావడంతో ఈ విషయం తెలిసిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 38 సంవత్సరాల వయసున్న వ్యక్తికి క్లేడ్ 1బీ స్ట్రెయిన్ సోకింది. సదరు వ్యక్తి ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి కేరళకు తిరిగొచ్చినట్లు తెలిసింది. 

సెప్టెంబర్ రెండో వారంలో విదేశాల నుంచి భారత్కు తిరిగొచ్చిన ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మంకీపాక్స్ బారిన పడినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ నిర్ధారించిన సంగతి తెలిసిందే. ల్యాబ్ పరీక్షల్లో అతనికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్రం పేర్కొంది. వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్ 2 రకం వైరస్ అతనికి సోకినట్లు కేంద్రం నిర్ధారించింది. భారత్లో నమోదైన తొలి మంకీపాక్స్ కేసు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడానికి కారణమైన క్లేడ్ 1 మంకీపాక్స్ రకం కాదని కేంద్రం అప్పట్లో స్పష్టం చేసింది. కానీ.. తాజాగా నమోదైన మంకీపాక్స్ కేసు మాత్రం క్లేడ్ 1 స్ట్రెయిన్ కావడం గమనార్హం.

ALSO READ | ఆమె డెడ్‌బాడీ 30 ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో.. కేసులో కీలక విషయాలు వెలుగులోకి

మంకీపాక్స్ అనేది తేలికపాటి వైరస్. మశూచి లాంటిదే మంకీపాక్స్ కూడా. ఇది తొలిసారి 1958లో పరిశోధనల్లో భాగంగా కోతుల నుంచి ఈ వ్యాధిని కొనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970లో మొదటిసారి మనుషుల్లో ఈ వ్యాధి కనిపించింది. 2003లో అమెరికాలో ఈ వ్యాధి రోగులను గుర్తించారు. 2018లో ఈ వ్యాధి ఇజ్రాయెల్, బ్రిటన్ లకు చేరుకుంది. మంకీపాక్స్ వ్యాధి సోకితే జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కన్పిస్తాయి. ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా ఇవి వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ లక్షణాలు 2-4  వారాలపాటు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో చాలామంది వారాల్లోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్వో తెలిపింది.