భారత ప్రముఖ పారిశ్రామివేత్త, దివంగత ఓపీ జిందాల్ సతీమణి సావిత్రి జిందాల్ స్వతంత్ర అభ్యర్థికి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హిస్సార్ నియోజకవర్గం నుంచి ఆమె బరిలో నిల్చున్నారు. దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా పేరొందిన ఈమె.. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కమల్ గుప్తాపై పోటీకి దిగారు.
టికెట్ ఇవ్వని బీజేపీ
గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సావిత్రి జిందాల్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని ముందుగా ఆశించారు. అయితే కాషాయ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో తన పేరు లేకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. హిస్సార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె గురువారం(సెప్టెంబర్ 12) నామినేషన్ దాఖలు చేశారు.
భర్త మరణాంతరం రాజకీయాల్లోకి..
సావిత్రి భర్త, జిందాల్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఓం ప్రకాష్ జిందాల్ 1991, 2000, 2005 మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. దురదృష్టవశాత్తూ ఆయన 2005లో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా.. అప్పటికీ భూపీందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
ఆయన మరణం తర్వాత సావిత్రి జిందాల్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె 2005లో హిస్సార్ నుంచి ఉప ఎన్నికలో గెలిచి హుడా ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అనంతరం మరోసారి 2009 ఎన్నికల్లో హిస్సార్ సీటు గెలుచుకున్నారు. 2013లో హుడా ప్రభుత్వంలో మళ్లీ మంత్రి పదవిని పొందారు. అయితే, 2014లో ఆమె ఓడిపోగా, 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు.
ప్రజలు నా కుటుంబ సభ్యులు
నామినేషన్ సంధర్భంగా మాట్లాడిన సావిత్రి జిందాల్ నియోజక వర్గ ప్రజలంతా తన కుటుంబసభ్యులని వ్యాఖ్యానించారు. ప్రజలకు తాను చేయగలిగినంత చేస్తానని మాటిచ్చారు. "నా భర్త కు ఈ నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హిస్సార్ ప్రజలు ఎప్పుడూ నా కుటుంబ సభ్యులే. జిందాల్ కుటుంబం మొత్తం హిస్సార్ ప్రజలకు రుణపడి ఉంటుంది. ఎప్పటికీ ప్రజలలోనే ఉంటూ..వారితో మమేకమవుతూ వారి సేవలలోనే నిరంతరం ఉంటాను.." అని ఆమె అన్నారు.
కాగా ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది సావిత్రి జిందాల్ నికర సంపద 29.1 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.2.4 లక్షల కోట్లు. దేశంలోనే అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ అని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది.
90 మంది సభ్యులు గల హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.