చెన్నై వేదికగా బంగ్లాదేశ్ పై జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల భారీ తేడాతో విజయన్ని అందుకుంది. బంగ్లాదేశ్ పై విజయం ఊహించిందే అయినా ఈ గెలుపుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ విజయంతో భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డ్ తమ ఖాతాలో వేసుకుంది. 1932 లో టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన భారత్ ఇప్పటివరకు 580 టెస్ట్ లు ఆడింది. వీటిలో 179 మ్యాచ్ ల్లో విజయాలను సాధించి మరో 178 టెస్టుల్లో ఓడిపోయింది.
బంగ్లాపై టెస్ట్ మ్యాచ్ గెలవడంతో భారత్ ఓటముల సంఖ్య కంటే విజయాల సంఖ్య పెరిగింది. 222 టెస్ట్ మ్యాచ్ లు డ్రా కాగా.. ఒక మ్యాచ్ టై అయింది. ఇప్పటివరకు నాలుగు జట్లు మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఈ లిస్ట్ లో ఆస్ట్రేలియా టాప్ లో ఉంది. కంగారూల జట్టు 414 విజయాలు సాధించగా.. మరో 232 మ్యాచ్ లు ఓడిపోయింది. ఇంగ్లాండ్ (397-325)..దక్షిణాఫ్రికా (179-161).. పాకిస్థాన్ (148-144) జట్లకు ఓటముల కంటే విజయాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో భారత్ చేరింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. నాలుగో రోజు తొలి సెషన్ లో ముగిసిన టెస్టులో 280 పరుగుల భారీ తేడాతో ఈ సిరీస్ లో బోణీ కొట్టింది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 234 పరుగులకు ఆలౌటైంది.