హైదరాబాద్ రెండో రాజధాని దిశగా అడుగులు పడుతున్నయా?

హైదరాబాద్  రెండో రాజధాని దిశగా అడుగులు పడుతున్నయా?

ఈమధ్య  స్వయంగా  సుప్రీంకోర్టు  ఢిల్లీ  నగరాన్ని ఏం చేయబోతున్నారని  కేంద్ర  ప్రభుత్వాన్ని  ప్రశ్నించింది. కేంద్ర మంత్రి  నితిన్ గడ్కరీ కూడా ఢిల్లీలో  పొల్యూషన్  తీవ్రంగా ఉంది.  తాను  ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా అనారోగ్యం పాలవుతున్నానని ఈ మధ్య ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు.  పొల్యూషన్​ విషయాన్ని మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా  ప్రస్తావించారు.  

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ వేడుక సభలో మాట్లాడుతూ.. ఢిల్లీ  నగరం ఖాళీ కాబోతోంది.  అక్కడ మనుషులు ఉండలేని పరిస్థితి. ముంబై  కిక్కిరిసిపోయింది. సెక్యూరిటీ సమస్యలు  చూశాం, ఇక చెన్నై నగరం గురించి ఆలోచిస్తే  వర్షాలు కురిస్తే చాలు మునిగిపోవడమే,  ఇక బెంగళూరు పరిస్థితి  ట్రాఫిక్ తో సతమతం కావడమే. ఇక కోల్ కతా గురించి మాట్లాడలేం. ఈ దేశంలో ఉన్న ఆరు మహానగరాలలో మిగిలింది ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే.  

మిగిలిన ఏకైక  నగరమైనా హైదరాబాద్​ను భవిష్యత్​ తరాల కోసం కాపాడుకోవాలనే  సదుద్దేశంతోనే  అన్ని చర్యలు తీసుకుంటున్నాం.  పొల్యూషన్ ఫ్రీ  నగరంగా చేయటం కోసం  అన్నిడీజిల్/ పెట్రోల్ వాహనాలను తరలించి పొల్యూషన్ రహిత వాహనాలను ప్రవేశపెడతామని సీఎం మాట్లాడారు. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీనిదేశ రాజధానిగా ఇంకా కొనసాగించాలా? అని  సాక్షాత్తు సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరలై  దేశ రాజధానిపై  మరోసారి దేశవ్యాప్త చర్చకు దారితీసింది.

దక్షిణాదిన రెండో రాజధాని ఉండాలన్న  ప్రస్తావన చాలా దశాబ్దాలుగా వస్తున్నదే.  దేశానికి  రెండో  రాజధానిగా  హైదరాబాద్ ఉండాలన్న చర్చ స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలోనే  వచ్చింది.  ఈ ప్రతిపాదనను  రాజ్యాంగ నిర్మాత  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన ‘థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్’ అనే పుస్తకం 11వ అధ్యాయంలో హైదరాబాద్‌‌‌‌ను  రెండో  రాజధానిగా చేయాలని స్వయంగా  ప్రతిపాదించారు. 

దీనికి అనుకూలంగా కొన్ని బలమైన కారణాలను కూడా చూపారు. మన శత్రు దేశాలైన పాకిస్తాన్,  చైనా దేశ సరిహద్దుకు ఢిల్లీ కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉందని. కానీ, హైదరాబాద్ సుదూరంగా ఉండటం దేశ భద్రతాపరంగా, అన్ని వాతావరణ పరిస్థితులకు అనువైన ప్రాంతమని గట్టిగా వాదించారు.  ప్రస్తుతం  ప్రపంచంలోనే  అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది.   

ప్రపంచంలో రెండవ అత్యంత కలుషిత నగరమైన ఢాకా కంటే ఢిల్లీలో పరిస్థితి మరి ఘోరం. గతంలో హైదరాబాద్‌‌‌‌లో ఎత్తైన అంబేద్కర్  విగ్రహ  ఆవిష్కరణకు హాజరైన అంబేద్కర్  మనవడు  ప్రకాశ్ అంబేద్కర్  హైదరాబాద్‌‌‌‌ను రెండో రాజధానిగా అంబేద్కర్  గుర్తు చేసినప్పుడు కూడా  ఈ చర్చ జరిగింది.   మహారాష్ట్ర  మాజీ గవర్నర్  సీహెచ్ విద్యాసాగర్‌‌‌‌రావు  ఎప్పటికైనా హైదరాబాద్ దేశానికి రెండో రాజధానిగా అవుతుందన్న నమ్మకం ఉందన్నారు.

ముందుచూపుతో  రేవంత్ అడుగులు? 

 గత సంవత్సరం రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి హోదాలో  తీసుకుంటున్న  చర్యలన్ని  భవిష్యత్తు దృష్ట్యా  హైదరాబాద్‌‌‌‌‌‌‌ను  మహా విశ్వనగరంగా  మార్చే ప్రయత్నంలో తీసుకుంటున్నవే.  ఢిల్లీ  తరహా పరిస్థితులు తలెత్తకుండా  హైదరాబాద్‌‌‌‌  రెండో  రాజధాని ఖచ్చితంగా కావొచ్చనే  ముందుచూపుతోనే  హైడ్రాలాంటి  కఠిన చర్యలు తీసుకుంటున్నారని  రాజకీయ విమర్శకులు  ప్రశంసిస్తున్నారు. అలాగే,  కాలుష్యరహిత  నగరంగా  మార్చేందుకు  డీజిల్/ పెట్రోల్   వాహనాలను తరలించి పొల్యూషన్ రహిత ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం వెనక కారణం కూడా ఇదేనని కొందరి వాదన.

అలాగే, ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లోని 258   ప్రపంచ నదులలో  అత్యంత కాలుష్యంగా మూసీ నది 22వ స్థానంలో  ఉన్నట్లు  ది  ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్  జర్నల్​లో ప్రచురితమైంది.  కనీసం 70 కిలోమీటర్ల మేర  48 రకాల క్యాన్సర్  కారకాలైన  రసాయన అవశేషాలు లభించాయి. ఈ  కలుషితమైన నీరు  ప్రజల  ఆరోగ్యానికి  భారీగా హాని చేస్తోందనీ  పరిశోధనలు తేల్చాయి.  

ప్రతిపక్షాల నుంచి  ప్రభుత్వం ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా మూసీ పునరుజ్జీవానికి  కట్టుబడి ఉంటామని ప్రకటించడం, అలాగే ఉన్న నగరంపై  మరింత  జనసాంద్రత  పెరగకుండా ఫోర్త్ సిటీ  ఆలోచన కూడా వెనుక కూడా రెండో రాజధాని వ్యూహమే ఉన్నట్లు అనుకోవచ్చేమో!  అలాగే, 2019  మల్కాజిగిరి  పార్లమెంటు  ఎన్నికల ప్రచారంలో  రెండో  రాజధాని ఆలోచనకు మద్దతు ఇచ్చారు. 

బీజేపీ  పవర్  పాలిటిక్స్

ఇక  రెండో రాజధాని ఆలోచన  బీజేపీకి  ఖచ్చితంగా ఉందని  ఆ నాయకుల వ్యవహార శైలి,  మాటలు  తదితర  పరిణామాలతో వెల్లడవుతూ వస్తోంది. రీజనల్ రింగ్ రోడ్డు  అనుమతి,  విస్తరణ  వెనుక  బీజేపీ  ఆలోచన లేకపోలేదనే అభిప్రాయం విశ్లేషకుల్లో  ఉంది.  తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న  బీజేపీ ఇక్కడ తన బలాన్ని పెంచుకునేందుకు అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించడానికి పావులు కదుపుతోంది. 

తెలంగాణకు దూరం చేస్తే సమస్యే..

రెండో రాజధాని పేరిట హైదరాబాద్​ను  కేంద్ర పాలిత  ప్రాంతంగా మార్చితే  తెలంగాణ రాష్ట్రం మరోసారి భగ్గుమనే అవకాశాలే  అధికంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటి హైదరాబాద్‌‌‌‌ను  పూర్తిగా వేరు చేస్తే మాత్రం సమస్యే.  హైదరాబాద్​ నగర లా అండ్ ఆర్డర్ లాంటి ఒకటి అరా వ్యవస్థలు కేంద్రం చేతిలో ఉంచుకొని, మిగతా పరిపాలన అంతా  తెలంగాణ  రాష్ట్ర పరిధిలో ఉంచితే సానుకూలత రావచ్చు.  హైదరాబాద్​ నగరం తెలంగాణకు దూరం కాకుండా చేయగలిగితేనే.. రెండో రాజధానికి ప్రజల నుంచి, పార్టీల నుంచి  అభ్యంతరాలు రాకపోవచ్చు! 

తెలంగాణకు  లాభమా? 

దేశానికి హైదరాబాద్  రెండో  రాజధాని ప్రతిపాదన అంత ఆషామాషీ  విషయం కాదు. తెలంగాణ రాష్ట్ర  ఆదాయం 50శాతం పైగా కేవలం హైదరాబాద్​ నుంచే ఉంది కాబట్టి ఆ ఆదాయం నిస్సంకోచంగా తెలంగాణ కే చెందేలా ఏర్పడాలి.  ఇటు తెలంగాణకు రాజధానిగా ఉంటూనే,  అటు దేశానికి రెండో రాజధానిగా ఉంటే మంచిదే.  రెండో రాజధానితో   హైదరాబాద్ నగరమే కాకుండా నగరం చుట్టూ నలువైపులా ఉన్న అనేక ప్రాంతాలు భారీ ఎత్తున లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు, రెండో రాజధాని అందుబాటులో ఉండడం తెలంగాణ ప్రజల అభివృద్ధికి మంచి మార్గం కాగలుగుతుంది. ఒకవేళ రెండో రాజధానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటే  మాత్రం..   కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు   తెలంగాణ  ప్రజల  ఆకాంక్షలు,  ఆశయాలను  ఏ మాత్రం విస్మరించకూడదు. రెండో రాజధాని విషయంలో అదే కీలకాంశం అవుతోంది. 

కేసీఆర్  డబుల్  గేమ్? 

ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో హైదరాబాద్​ను  దేశానికి రెండో రాజధాని చేయాలనే ప్రతిపాదన శ్రీకృష్ణ కమిషన్ ముందుకు వచ్చింది. కానీ, అది పూర్తిగా తిరస్కరించినట్లు నాటి తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రొ. కోదండరాం చెప్పారు. హైదరాబాద్​ని దేశానికి రెండో రాజధానిగా చేయాలనే ప్రతిపాదనను తాము స్వాగతిస్తామని ఆనాడు ముఖ్యమంత్రి  హోదాలో  2018లో  ఇండియా టుడే సదస్సులో  కేసీఆర్​ స్పష్టంగా చెప్పారు. 

కానీ,  నేడు అదే పార్టీ హైదరాబాద్‌‌‌‌ను  కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని  బీజేపీ కుట్రలు చేస్తోందని. దాన్ని అడ్డుకునే ధైర్యం కాంగ్రెస్‌‌‌‌కు లేదని 2024 ఏప్రిల్ 29న కరీంనగర్‌‌‌‌లో జరిగిన  పార్లమెంటు ఎన్నికల సమావేశంలో  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్​  కేటీఆర్  ద్వంద్వ వైఖరితో  విరుచుకుపడిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఒక రీతిగా,  ప్రతిపక్ష స్థానంలో  మరొక రీతిగా  వ్యవహరించడం  రాజకీయ అవకాశవాదానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇలాంటి అవకాశవాద రాజకీయాలు క్షేమకరం కాదని పార్టీకి అనర్థమని ఆ పార్టీ అగ్ర నేతలు గుర్తుంచుకోవాలి.

- డాక్టర్. బి.కేశవులు, పొలిటికల్​ ఎనలిస్ట్​-