అమెరికా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది

  • మైనారిటీలపై దాడులు పెరిగాయన్న అమెరికా రిపోర్ట్​పై ఇండియా మండిపాటు

న్యూఢిల్లీ: మన దేశంలో మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని, చాలా చోట్ల హత్యలు, దాడులు చేస్తున్నారని పేర్కొంటూ అమెరికా విడుదల చేసిన నివేదికపై మన దేశ విదేశాంగ శాఖ మండిపడింది. అమెరికా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చీ ఆరోపించారు. శుక్రవారం ఆయన అమెరికా నివేదికపై ప్రకటన విడుదల చేశారు. ఉన్నత స్థానాల్లో ఉండి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఫైర్​ అయ్యారు. ‘‘అంతర్జాతీయ సంబంధాల్లో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుండడం విచారకరం. పక్షపాత ధోరణి, దురుద్దేశపూర్వక లక్ష్యాలతో ఇలాంటి అంచనాలకు రావడం మంచిది కాదు. మొదట్నుంచి ఇండియా భిన్నత్వంలో ఏకత్వం అన్న సిద్ధాంతాన్నే నమ్ముతోంది. అలాంటి మా దేశంలో మత స్వేచ్ఛ, మానవ హక్కులకు ఎప్పటికీ విలువనిస్తాం’’ అని ఆయన చెప్పారు. అమెరికాతో భేటీ అయిన అన్ని సందర్భాల్లోనూ ఆ దేశంలో పెచ్చుమీరుతున్న జాతి వివక్ష, కొందరే టార్గెట్​గా దాడులు, విద్వేష నేరాలు, తుపాకీ కాల్పుల ఘటనల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నామని పరోక్షంగా చురకలంటించారు. కాగా, నిరుడు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ అమెరికా విదేశాంగ శాఖ  ‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ’ పేరిట ఓ రిపోర్టు విడుదల చేసింది. నిరుడు ఇండియాలో మైనారిటీలపై దాడు లు, హత్యలు పెరిగాయని అందులో పేర్కొంది.