భారతదేశం ప్రపంచంలో ఐదో బలమైన ఆర్థికవ్యవస్థగా రూపాంతరం చెందిన నేపథ్యంలో భవిష్యత్తులో అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలను తలదన్ని అగ్రగామిగా నిలబడడానికి ఇప్పటి నుంచే పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. అన్ని రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి యువతను సమాయత్తం చేయాలి. ప్రజల తలసరి ఆదాయం పెరగాలి. అప్పుడే కొనుగోలు శక్తి పెరుగుతుంది. నాణ్యమైన జీవితాలకు మార్గం ఏర్పడుతుంది. పేదరికం సమసి పోవాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. అయితే ఇది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదు. ఇందుకోసం నిర్ధిష్ట కాలపరిమితితో కూడిన యాక్షన్ ప్లాన్ అవసరం. రెండు సంవత్సరాల పాటు కరోనా సృష్టించిన విలయతాండవం ప్రపంచంలోని అనేక వ్యవస్థలను ఆర్థికంగా చిన్నాభిన్నం చేసింది.‘సప్లై చెయిన్స్’లో ఆటంకాల వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనికి తోడు కొద్ది రోజుల్లోనే ముగుస్తుందనుకున్న రష్యా – ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఏడాది దాటినా పరిసమాప్తికాకపోవడం వల్ల యావత్ ప్రపంచం ఆర్థికంగా కకావికలమైపోతున్నది. భారతదేశం ఈ యుద్ధ ప్రభావ ఫలితాలను తట్టుకుని చాలా వరకు సురక్షితంగానే ఉంది. అయితే అధిక జనాభా గల భారతదేశానికి భవిష్యత్తులో ఎలాంటి సంక్షోభాలు ఎదురైనా తట్టుకుని నిలబడగలిగే శక్తి ఏర్పడాలి.
పాక్, శ్రీలంక నేర్పుతున్న పాఠాలు
భారత దేశ స్థూల జాతీయోత్పత్తి భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది. ఇండియా తలసరి ఆదాయం లక్షా 72 వేలకు చేరిందనే అంచనా సంతోషమే. అయితే ఇతర అభివృద్ధి చెందిన దేశాల ప్రజల తలసరి ఆదాయంతో సమానంగా మనం కూడా ముందుకు పోవాలి. 2024 నాటికి భారతదేశం కూడా 6.7 శాతం వృద్ధి సాధించి ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశాలున్నాయి. గతంలో మాదిరిగా ఏ ఒక్క దేశం గిరిగీసుకుని మన గలిగే పరిస్థితులు లేవు. ప్రపంచీకరణ దేశాల నడుమ సంబంధాలను పటిష్టం చేసింది. ప్రతీ దేశం తమ ప్రజల అవసరాల కోసం మరొక దేశంతో సత్సంబంధాలు కొనసాగించక తప్పదు. అగ్రరాజ్యాలు సైతం పైకి ఎన్ని కబుర్లు చెబుతున్నా వాణిజ్య పరమైన అంశాల విషయంలో ప్రపంచ దేశాలతో సాన్నిహిత్యం తప్పదు. యుద్ధాల పేరుతోనో, సామ్రాజ్యవాదం పేరుతోనో ఒక దేశంపై మరొక దేశం ఆంక్షలు విధించడం, దానికి కొన్ని దేశాలు వంత పాడటం పరిపాటిగా మారింది. ఆయుధ పోరాటం ద్వారా అభివృద్ధి జరగదు. ఇబ్బడి ముబ్బడిగా ఆయుధాలను పోగు చేసి, ప్రజలను నిర్లక్ష్యం చేసిన పాకిస్తాన్ నేడు అన్నమో రామచంద్రా అంటూ విలపిస్తున్నది. భారత్‌పై ఒంటి కాలుపై విరుచుకుపడే పాక్ నేడు తమ ప్రజల కనీస అవసరాలు తీర్చలేక, ఆర్థిక, ఆహార సాయం కోసం ఇతర దేశాలకు పాదాక్రాంతం కావడం చూస్తున్నాం. నమ్మకమైన దేశాలను దూరం చేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో శ్రీలంక ఉదంతం చాటి చెప్పింది. చైనాకు దాసోహమై, తాహతుకు మించి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి, ఆర్ధికంగా దివాళా తీసిన శ్రీలంక నేర్పిన పాఠం ఇతర దేశాలకు గుణపాఠం కావాలి. ఉగ్రవాదానికి ఊతమిచ్చి,సైనికుల కనుసన్నల్లో పనిచేసిన పాక్ పాలకులు దశాబ్దాల తరబడి భారత దేశానికి తీవ్ర నష్టం కలుగచేశారు. చివరికి పాక్ కు మిగిలిందేమిటి?
ఆర్థిక సంక్షోభం
ప్రపంచమంటే వివిధ దేశాల సమాహారం. ఇప్పుడది గ్లోబల్ విలేజ్ గా మారి పోయింది. ఒక దేశం అవసరం మరో దేశానికి ఉంది. ఒక దేశం మీద మరో దేశం యుద్ధం ప్రకటిస్తే దాని ప్రతికూల ప్రభావం ప్రపంచమంతా ఉంటుందనడానికి వర్తమాన ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక మాంద్య ప్రభావం ఒక ఉదాహరణ. అమెరికా ప్రోద్భలం లేకపోతే ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆగిపోయేది. ప్రపంచ దేశాలు ఇలా ఆర్థిక మాంద్యంతో అలమటించేవి కావు. సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాలేదు. ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభంలో ముంచెత్తింది. చమురు మీద ఆధారపడిన దేశాలను తీవ్రమైన ప్రభావానికి గురిచేశాయి. అమెరికాకు వత్తాసు పలుకుతూ అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఉక్రెయిన్ కు ఆయుధ సహకారం చేస్తున్న నాటో దేశాలు తమ వైఖరిని మార్చుకోవాలి. యుద్ధ సమయాల్లో భారత్ లా తటస్థ వైఖరి అవలంబించాలి. యుద్ధ విరమణకు ఐక్యరాజ్య సమితి ముందుకు వచ్చి, రష్యా, ఉక్రెయిన్ల మధ్య సంధి కుదర్చాలి. చమురుకు ప్రత్యామ్నాయ మార్గాలెన్నో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకంపై దృష్టి సారించాలి. మనకు అవసరమైన వస్తువులను మనమే తయారు చేసుకోవాలి. అన్ని రంగాల్లో భారత్ స్వయం స్వావలంబన సాధించాలి. మనతో కలిసి వచ్చే నిజమైన మిత్ర దేశాలతో సమన్వయం చేసుకుని, అంతర్జాతీయంగా అగ్రరాజ్యాలతో సమానంగా ఎదగాలి.
- సుంకవల్లి సత్తిరాజు, సోషల్ ఎనలిస్ట్