- 31 డ్రోన్ల కొనుగోలుకుఅమెరికాతో ఒప్పందం
- మొత్తం విలువ రూ.32 వేల కోట్లు
- నేవీకి 15, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌కు చెరో 8 డ్రోన్లు
న్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం మరో ముందడుగు వేసింది. అధునాతన డ్రోన్ల కొనుగోలుకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు రక్షణ వర్గాల సీనియర్ల సమక్షంలో మంగళవారం ఇరు దేశాల అధికారులు డీల్ పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద అమెరికా నుంచి 31 ఎంక్యూ9బీ ప్రిడేటర్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.32,000 కోట్లు అని భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఇది రూ.34,500 కోట్లకు కూడా పెరగవచ్చన్నారు. ఈ డ్రోన్లను అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ అనే తయారీ సంస్థ అందించనుంది. మొత్తం 31 డ్రోన్లలో 15 నేవీకి, 8 ఆర్మీకి, మరో 8 ఎయిర్ ఫోర్స్ కు కేటాయించనున్నారు. డ్రోన్ల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ కూడా భారత్‌లోనే నెలకొల్పనున్నారు. అమెరికాతో ఈ ఒప్పందం కోసం భారత్ చాలా కాలంగా ప్రయత్నించింది. కొన్నివారాల క్రితం అడ్డంకులన్నీ తొలగిపోవడం వల్ల
అమెరికాతో భారత్ ఈ అగ్రిమెంట్ చేసుకుంది.
ఎంక్యూ9 బీ డ్రోన్‌ల ప్రత్యేకతలు..
ఆపరేషన్ ను నిశ్శబ్దంగా పూర్తి చేయడం ఎంక్యూ9 బీ ప్రిడేటర్ డ్రోన్ల ముఖ్య లక్షణం. ఈ డ్రోన్ దాదాపు 50 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంది. ఇది వాణిజ్య విమానం ఎగిరే ఎత్తు కంటే ఎక్కువ.1,700 కిలోల సరుకును మోస్తూ 35 గంటలపాటు నాన్‌స్టాప్‌గా ఎగరగలవు. నిఘాతో పాటు క్షిపణులపై దాడిచేసే సామర్థ్యం దీని సొంతం. ఇది అధిక ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేధించడానికి వీలు కల్పిస్తుంది. ఎలాంటి వాతావరణంలోనైనా ప్రయాణించగల సామర్థ్యంతో పాటు సొంతంగా టేకాఫ్, ల్యాండింగ్సామర్థ్యం ఉంది. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ తో పాటు ఎయిర్ టు ల్యాండ్ మిసైల్స్ ను ఈ డ్రోన్‌కు అమర్చే వీలుంది. చెన్నై సమీపంలోని ఐఎన్ఎస్ రాజాలి, గుజరాత్‌లోని పోర్ బందర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని సర్సావా, గోరఖ్‌పుర్ సహా దేశవ్యాప్తంగా ఉన్న మరో 4 ప్రదేశాల్లో కేంద్రం ఈ డ్రోన్లను ఉపయోగించనుంది.