పసికూనకు చుక్కలు చూపెట్టారు.. ఐర్లాండ్‌పై రికార్డుల మోత

  • మంధాన ఫాస్టెస్ట్‌‌ సెంచరీ... ప్రతీక తొలి వంద
  • 304 రన్స్‌‌ తేడాతో ఐర్లాండ్‌‌పై అతి పెద్ద విజయం
  • 3–0తో సిరీస్ క్లీన్‌‌స్వీప్‌‌

రాజ్‌‌కోట్‌‌: ఫాస్టెస్ట్ సెంచరీ.. హయ్యెస్ట్ స్కోరు.. అతి పెద్ద విక్టరీ..  సిరీస్ క్లీన్‌‌స్వీప్‌‌. చిన్న జట్టు ఐర్లాండ్‌‌పై  రికార్డుల మోత మోగిస్తూ.. పరుగుల ప్రవాహం సృష్టిస్తూ టీమిండియా అమ్మాయిలు చెలరేగిపోయారు. కెప్టెన్ స్మృతి మంధాన (80 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 135) ఫాస్టెస్ట్ సెంచరీ (70 బాల్స్‌‌లో), యంగ్ ఓపెనర్‌‌‌‌ ప్రతీక రావల్ (129 బాల్స్‌‌లో 20 ఫోర్లు, 1 సిక్స్‌‌తో  154) కెరీర్‌‌‌‌లో తొలి వందతో విజృంభించిన వేళ వన్డేల్లో తమ అత్యధిక స్కోరుతో రికార్డు సృష్టించిన టీమిండియా  304 రన్స్ తేడాతో అతి పెద్ద విజయం సొంతం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌‌ను 3–0తో క్లీన్‌‌స్వీప్‌‌ చేసింది.

తొలి రెండు వన్డేల విజయ జోరును కొనసాగించిన మంధానసేన మరింత జోరు చూపెట్టడంతో బుధవారం జరిగిన  మూడో, చివరి మ్యాచ్‌‌లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్‌‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 435/5 స్కోరు చేసింది. వన్డేల్లో ఇండియా విమెన్స్‌‌, మెన్స్ టీమ్‌‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అనంతరం ఛేజింగ్‌‌లో ఐర్లాండ్‌‌ 31.4 ఓవర్లలో 131 రన్స్‌‌కే కుప్పకూలింది. ఓపెనర్‌‌‌‌ సారా ఫోర్బ్స్ (41), ఓర్లా ప్రెండర్‌‌‌‌గాస్ట్‌‌ (36) టాప్ స్కోరర్లుగా నిలిచారు.  కెప్టెన్ గాబీ లూయిస్ (1), క్రిస్టినా కౌల్టర్ (0) తో పాటు మిగతా ప్లేయర్లు నిరాశ పరిచారు. 33 రన్స్ తేడాతో చివరి ఏడు వికెట్లు కోల్పోయిన ఐరిష్ టీమ్ భారీ ఓటమిని ఖాతాలో వేసుకుంది. స్పిన్నర్లు  దీప్తి శర్మ మూడు, తనూజ కన్వార్ రెండు వికెట్లు తీశారు. ప్రతీకకు ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్‌‌, సిరీస్‌‌ అవార్డులు లభించాయి.

స్టన్నింగ్ స్మృతి.. పవర్‌‌‌‌ఫుల్ ప్రతీక 

కొత్త ఓపెనింగ్ కాంబినేషన్‌‌గా వచ్చి గత ఐదు వన్డేల్లో మూడు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసి హిట్టు కొట్టిన  స్మృతి మంధాన, ప్రతీక రావల్ ఈసారి  డబుల్ సెంచరీ పార్ట్​నర్​షిప్​తో సూపర్‌‌‌‌ హిట్‌‌ అయ్యారు. తన ఫామ్‌‌ను కొనసాగించిన మంధాన ఈ పోరులో టీ20 స్టయిల్ ఆటతో విజృంభించింది. ఆరంభం నుంచే నిర్భయంగా తనదైన శైలిలో భారీ షాట్లతో  అలరించింది. ఏ ఒక్క బౌలర్‌‌‌‌నూ వదలకుండా ఫోర్లు, సిక్సర్ల మోత మోగించింది.  మరో ఎండ్‌‌లో ప్రతీక క్రమశిక్షణతో ఆడుతూ కెప్టెన్‌కు అద్భుత సహకారం అందించింది. మంచి టైమింగ్‌‌, టెక్నిక్‌‌తో పాటు పక్కా ప్లేస్‌‌మెంట్‌‌తో షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లింది. పవర్‌‌‌‌ ప్లేలో 90 రన్స్ రాబట్టిన ఓపెనర్లు.. తర్వాతి పది ఓవర్లో 67 రన్స్ సాధించారు. 

ఈ క్రమంలో అర్లీన్‌‌ కెల్లీ బౌలింగ్‌‌లో ఆఫ్​ డ్రైవ్‌తో మంధాన సెంచరీ పూర్తి చేసుకుంది. కెల్లీ ఓవర్లోనే వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన మంధాన.. ఐర్లాండ్ టాప్ బౌలర్ ప్రెండర్‌‌‌‌గాస్ట్‌‌ బౌలింగ్‌‌లో ఫోర్‌‌, లాంగాన్ మీదుగా టవరింగ్ సిక్స్‌‌తో ఆకట్టుకుంది. చివరకు ప్రెండర్‌‌‌‌గాస్ట్ వేసిన 27వ ఓవర్లో మంధాన ఔటైనా.. వన్‌‌డౌన్‌‌కు ప్రమోటైన రిచా ఘోశ్ (52)తో ప్రతీక అదే ఊపును కొనసాగించింది. ఈ క్రమంలో వంద బాల్స్‌‌లో సెంచరీ అందుకున్న ఆమె తర్వాత మరింత స్పీడు పెంచింది. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత రిచా, 150 రన్స్ మార్కు దాటిన వెంటనే  ప్రతీక వెనుదిరిగినా.. చివర్లో తేజల్ (28), హర్లీన్ (15), దీప్తి (11) వేగంగా ఆడి స్కోరు 400 దాటించారు.

సంక్షిప్త స్కోర్లు

  • ఇండియా: 50 ఓవర్లలో 435/5 (ప్రతీక 154, మంధాన 135, ప్రెండర్‌‌‌‌గాస్ట్ 2/71).
  • ఐర్లాండ్‌‌: 31.4 ఓవర్లలో 131 ఆలౌట్‌‌ (సారా ఫోర్బ్స్‌​ 41, దీప్తి శర్మ 3/27)

1  ఇండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌‌‌‌గా మంధాన (70 బాల్స్‌‌)లో నిలిచింది. హర్మన్‌‌ప్రీత్ గతేడాది సౌతాఫ్రికాపై 87 బాల్స్‌‌లో చేసిన సెంచరీ రికార్డును బ్రేక్‌‌ చేసింది. 

435/5  వన్డేల్లో ఇండియా విమెన్స్ టీమ్‌‌కు ఇదే అత్యధిక స్కోరు.  ఐర్లాండ్‌‌తో రెండో వన్డేలో చేసిన తమ అత్యధిక స్కోరు (370/5)ను అధిగమించిన అమ్మాయిలు  2011లో ఇండియా మెన్స్ టీమ్ ఇండోర్‌‌‌‌లో వెస్టిండీస్‌‌పై  చేసిన 418/5 స్కోరు రికార్డునూ బ్రేక్ చేశారు. విమెన్స్‌‌ వన్డేల్లో ఓవరాల్‌‌గా ఇది నాలుగో అత్యధిక స్కోరు.

304 ఈ ఫార్మాట్‌‌లో రన్స్‌‌ పరంగా ఇండియాకు అతి పెద్ద విజయం. 2017లో ఇదే ఐర్లాండ్‌‌పై 249 రన్స్‌‌ తేడాతో గెలిచిన విజయాన్ని అధిగమించింది. 

10 వన్డేల్లో  మంధానకు ఇది పదో సెంచరీ. విమెన్స్ వన్డేల్లో ఎక్కువ సెంచరీలు చేసిన మూడో ప్లేయర్‌‌‌‌గా టామీ బ్యూమోంట్‌‌ రికార్డు సమం చేసింది. మెగ్‌‌ లానింగ్ (15), సుజీ బేట్స్ (13) టాప్‌‌–2లో ఉన్నారు.
 
3  వన్డే మ్యాచ్‌‌లో 150 ప్లస్ స్కోరు చేసిన మూడో ఇండియన్‌‌ ప్రతీక. దీప్తి శర్మ (ఐర్లాండ్‌‌పై 188), హర్మన్‌‌ప్రీత్ (ఆస్ట్రేలియాపై 171*) ముందున్నారు.