
న్యూఢిల్లీ: మన దేశ సైనిక వ్యయం పాకిస్తాన్‌తో పోలిస్తే తొమ్మిది రెట్లు ఎక్కువని స్వీడిష్ థింక్ ట్యాంక్ సోమవారం ఒక రిపోర్టు విడుదల చేసింది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా డిఫెన్స్ రంగానికి ఎక్కువగా ఖర్చు చేస్తున్న ఐదవ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. ఇండియా, పాక్ నడుమ ప్రస్తుతమున్న ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్‌హోమ్ ఈ నివేదికను రిలీజ్ చేసింది.
2024లో భారత్ సైనిక వ్యయం 1.6 శాతం పెరిగి 7.19 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని తెలిపింది. అదే సమయంలో పాకిస్తాన్ 87 వేల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఖర్చులో మనకంటే ముందున్న దేశాల్లో తొలిస్థానంలో అమెరికా, ఆపై చైనా, రష్యా, జర్మనీ ఉన్నాయి. ప్రపంచం మొత్తం దేశాల సైనిక ఖర్చులో ఈ ఐదు దేశాల వాటానే 60 శాతంగా ఉందని పేర్కొంది.