నేడే వరల్డ్ కప్ కి భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు దక్కుతుందా..?

నేడే వరల్డ్ కప్ కి భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు దక్కుతుందా..?

ఈ ఏడాది స్వదేశంలో వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5 న గ్రాండ్ గా ఈ మెగా టోర్నీ స్టార్ట్ కానుంది. వరల్డ్ కప్ కి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా భారత్ జట్టు నేడు వరల్డ్ కప్ కి సంబంధించిన స్క్వాడ్ ని ప్రకటించనుంది. మధ్యాహ్నం 1:30 నిమిషాలకు అజిత్ అగార్కర్ నేతృత్వంలో టీమిండియాను ఎంపిక చేయనున్నారు. ఆసియా కప్ కి సెలక్ట్ చేసిన జట్టునే దాదాపుగా వరల్డ్ కప్ కి ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ప్రపంచ కప్ స్క్వాడ్ లో స్థానం దక్కుతుందా..? లేదా అనే ఆసక్తి సగటు తెలుగు అభిమానుల్లో ఏర్పడింది.
 
శాంసన్ కి మరోసారి నిరాశ తప్పదా..?
 

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆసియా కప్ కి ఎంపికైనా వారినే దాదాపుగా కొనసాగించినా.. వికెట్ కీపర్ బ్యాటర్ గా ఎవరిని సెలక్ట్ చేస్తారనే విషయంలో గందరగోళం తప్పేలా కనిపించడం లేదు. సీనియర్ ప్లేయర్ రాహుల్ ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతుండగా.. ఇషాన్ కిషాన్ బ్యాట్ తో రాణించినా కీపింగ్ లో ఆకట్టుకోలేకపోతున్నాడు. మరోవైపు ఆసియా కప్ లో స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న సంజు శాంసన్ ప్రధాన జట్టులో చోటు దక్కుతుందా అనే విషయం కూడా ఆసక్తి కరంగా మారింది. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ బ్యాటర్ గా, మూడో ఓపెనర్ గా ప్లేస్ దాదాపు కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇకపోతే సీనియర్ ప్లేయర్ గా రాహుల్ పై సెలక్టర్లు నమ్మకముంచవచ్చు.అదే జరిగితే సంజు శాంసన్ కి మరోసారి జట్టులో స్థానం దక్కకపోవచ్చు.   

మిడిల్ ఆర్డర్ లో ఎవరు..?
 

నెంబర్ 4 లో శ్రేయాస్ అయ్యర్ ఆడటం దాదాపు ఖరారైనప్పటికీ.. అతనికి బ్యాకప్ గా సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ లలో ఒక్కరికే అవకాశం దక్కేలా కనిపిస్తుంది. వన్డేల్లో తరచూ ఫెయిల్ అవుతున్న సూర్యకి ఛాన్స్ ఇస్తారా..? లేకపోతే వెస్టిండీస్ మీద టీ 20 సిరీస్ లో సత్తా చాటిన తిలక్ వర్మ మీద మొగ్గు చూపిస్తారో చూడాలి. తనదైన  రోజున మ్యాచ్ ని మలుపు తిప్పగలిగే సూర్యకే ఛాన్స్ దక్కొచ్చు.      
 
ప్రసిద్ ప్లేస్ లో స్పిన్నర్ ని తీసుకుంటారా..?
 

సొంతగడ్డపై ఆడుతుండడంతో స్పిన్నర్లను తీసుకోవాలనుకుంటే ప్రసిద్ కృష్ణపై వేటు తప్పదు. ఆసియా కప్ కి ఎంపిక చేసిన జట్టులో స్పెషలిస్ట్  స్పిన్నర్ ని కాదని ప్రసిద్ ని ఎంపిక చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ ఫాస్ట్ బౌలర్ అవసరం లేదనుకుంటే ఆ ప్లేస్ లో చాహల్ లేదా వాషింగ్ టన్ సుందర్ కి అవకాశమివ్వొచ్చు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ అవకాశాలు కూడా కొట్టి పారేయలేము. మరి సెలక్టర్లు ఎవరి మీద నమ్మకముంచుతారో మరి కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.