దేశంలో జరిగే ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ కోసం బీసీసీఐ బుధవారం (ఆగస్ట్ 14) జట్లను ప్రకటించింది. రాబోయే ఎడిషన్ కోసం నాలుగు స్క్వాడ్ లను ఎంపిక చేసింది. టీమ్ ఏ, టీం బి, టీమ్ సి, టీం డి జట్లకు వరుసగా శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్లుగా జట్టును నడిపిస్తారు. టోర్నీ తొలి రౌండ్ సెప్టెంబర్ 5న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో భారత్.. బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. భారత టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకోవాలంటే ఈ ట్రోఫీలో కీలకంగా మారబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. "టెస్ట్ స్క్వాడ్ అంతా సిద్ధంగా ఉంది. రెండు లేదా మూడు స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ స్థానాల కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ దులీప్ ట్రోఫీని చూస్తారు. కోహ్లీ, రోహిత్ నేరుగా టెస్ట్ సిరీస్ ఆడతారు. బుమ్రా విషయానికొస్తే అతను న్యూజిలాండ్ సిరీస్‌లో భారత జట్టుతో కలుస్తాడు. రానున్న రోజుల్లో మాకు కీలకమైన టెస్టులు ఉన్నాయి. ఈ మ్యాచ్ లు మాకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడానికి చాలా కీలకం". అని అన్నారు.
దులీప్ ట్రోఫీ నుంచి రెస్ట్ తీసుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ నేరుగా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటారు. గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ తో పాటు ఓపెనర్ యశస్వి జైశ్వాల్, రవీంద్ర జడేజా స్థానం దాదాపు ఖాయం. ఇంగ్లాండ్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన గిల్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధాన పేసర్ గా సిరాజ్ ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. మిగిలిన స్థానాల కోసం పోటీ తప్పేలా లేదు. గైక్వాడ్, అక్షర్ పటేల్, రాహుల్, సర్ఫరాజ్, ఆకాష్ దీప్ లకు ఈ ట్రోఫీ చాలా కీలకంగా మారనుంది.