Australia vs India 1st Test: భళా బుమ్రా.. ఆస్ట్రేలియా 67/7.. ఇండియా 150 ఆలౌట్

Australia vs India 1st Test: భళా బుమ్రా.. ఆస్ట్రేలియా 67/7.. ఇండియా 150 ఆలౌట్
  • భళా బుమ్రా.. విజృంభించిన జస్‌‌ప్రీత్‌‌
  • తొలి ఇన్నింగ్స్‌‌లో ఆస్ట్రేలియా 67/7
  • ఇండియా 150 ఆలౌట్ 
  • రాణించిన నితీశ్‌‌ రెడ్డి, పంత్‌‌

పెర్త్‌‌ : టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌‌‌‌–గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టు రసవత్తరంగా మొదలైంది. బౌలర్ల హవా నడుస్తూ ఏకంగా 17 వికెట్లు పడ్డ తొలి రోజు పోరులో స్టాండిన్ కెప్టెన్‌‌, పేస్ లీడర్ జస్‌‌ప్రీత్ బుమ్రా (4/17) అద్భుత బౌలింగ్‌‌తో విజృంభించడంతో టీమిండియాదే పైచేయి అయింది. ఐదు టెస్టుల సిరీస్‌‌లో భాగంగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌కు వచ్చిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 150 రన్స్‌‌కే ఆలౌటైంది. 

అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (41), రిషబ్ పంత్‌‌ (37), కేఎల్‌‌ రాహుల్ (26) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్‌‌ హేజిల్‌‌వుడ్ నాలుగు, మిచెల్ స్టార్క్‌‌, ప్యాట్ కమిన్స్‌‌, మిచెల్‌‌ మార్ష్‌‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌‌కు వచ్చిన ఆస్ట్రేలియా తొలి రోజు చివరకు 67/7 స్కోరుతో నిలిచింది. బుమ్రాకు తోడు సిరాజ్ రెండు వికెట్లు.. 

కొత్త కుర్రాడు హర్షిత్ రాణా ఓ వికెట్‌‌ తీసి ఆసీస్‌‌ను దెబ్బకొట్టారు. ప్రస్తుతం అలెక్స్‌‌ క్యారీ (19 బ్యాటింగ్‌‌), స్టార్క్ (3 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉండగా.. ఇండియా స్కోరుకు ఆసీస్‌‌ ఇంకా 83 రన్స్‌‌ వెనుకంజలోనే ఉంది. రెండో రోజు మిగతా మూడు వికెట్లు త్వరగా పడగొట్టి 50–60 రన్స్ ఆధిక్యం దక్కించుకున్నా మ్యాచ్‌‌లో ఇండియా పైచేయి సాధించగలదు. 

టాప్‌‌ ఢమాల్‌‌..ఆదుకున్న నితీశ్‌‌, పంత్‌‌

రోహిత్‌‌ గైర్హాజరీలో కెప్టెన్సీ చేస్తున్న జస్‌‌ప్రీత్ బుమ్రా పచ్చికతో కూడిన బౌన్సీ వికెట్‌‌పై టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌ ఎంచుకొని ఆశ్చర్యపరిచాడు. ఈ నిర్ణయంపై విమర్శలు మొదలయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. ఓపెనింగ్‌‌ స్పెల్‌‌లో స్టార్క్‌‌‌‌, హేజిల్‌‌వుల్‌‌ కొత్త బంతితో విసిరిన సవాల్‌‌ ముందు ఇండియా టాపార్డర్ తేలిపోయింది. ఓపెనర్‌‌‌‌ యశస్వి జైస్వాల్ (0)  మూడో ఓవర్లో స్టార్క్‌‌ వేసిన ఊరించే లెంగ్త్‌‌ బాల్‌‌కు డకౌటయ్యాడు. ఓ ఎండ్‌‌లో కేఎల్‌‌ రాహుల్ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేయగా.. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన  దేవదత్ పడిక్కల్‌‌ (0) 23 బాల్స్‌‌ ఆడి ఖాతా కూడా తెరవలేదు. 

హేజిల్‌‌వుడ్ సీమ్‌‌ బాల్‌‌ను డిఫెండ్ చేసే ప్రయత్నంలో కీపర్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు. స్టార్‌‌‌‌ ప్లేయర్ విరాట్ కోహ్లీ (5) హేజిల్‌‌వుడ్‌‌ షార్ట్‌‌ బాల్‌‌ను వదిలేయబోయి స్లిప్‌‌లో క్యాచ్‌‌ ఇచ్చి నిరాశపరిచాడు.  మరోవైపు క్రీజులో కుదురుకున్న కేఎల్‌‌ రాహుల్‌‌.. స్టార్క్‌‌ బౌలింగ్‌‌లో  థర్డ్‌‌ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో ఔటయ్యాడు. 51/4తో లంచ్‌‌ బ్రేక్‌‌ నుంచి వచ్చిన వెంటనే ధ్రువ్ జురెల్ (11) తో పాటు స్పిన్ ఆల్‌‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (4) ను మిచెల్ మార్ష్ ఔట్‌‌ చేయడంతో  73/6తో నిలిచిన ఇండియా వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. ఈ దశలో పంత్‌‌, తెలుగు కుర్రాడు నితీశ్‌‌ ఆసీస్‌‌ బౌలర్లకు ఎదురునిలిచారు. 

పంత్‌‌ తన మార్కు వెరైటీ షాట్లతో ఆకట్టుకోగా.. నితీశ్‌‌  కూడా అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఇద్దరూ క్రీజులో కుదురుకోని స్కోరు 120 దాటించడంతో ఇండియా కోలుకున్నట్టే కనిపించింది. కానీ, కమిన్స్‌‌ ఫుల్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌ను పంత్‌‌ షాట్ ఆడే ప్రయత్నంలో  స్లిప్‌‌లో స్మిత్‌‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో ఏడో వికెట్‌‌కు కీలకమైన 48 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ ముగిసింది. టెయిలెండర్లు హర్షిత్ (7), బుమ్రా (8) సాయంతో స్కోరు 150 దాటించిన తర్వాత కమిన్స్‌‌ బౌలింగ్‌‌లో నితీశ్‌‌ ఆఖరి వికెట్‌‌గా ఔటయ్యాడు. 

కంగారు పెట్టిన బుమ్రా

ఇండియాను తక్కువ స్కోరుకే ఆ లౌట్‌‌ చేసిన ఆనందం ఆసీస్‌‌కు ఎంతోసేపు నిలువలేదు. మూడో సెషన్‌‌లో కంగారూ టీమ్‌‌ను బుమ్రా బుల్లెట్లలాంటి బంతులతో వణికించాడు. సిరాజ్‌‌, హర్షిత్ అతనికి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ ముగ్గురూ పిచ్‌‌పై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకున్నారు. ఆఫ్‌‌ స్టంప్‌‌ చానెల్‌‌లో పడి వికెట్ల మీదకు దూసుకొస్తున్న బాల్స్‌‌ను ఆడలేక ఆసీస్ కంగారెత్తింది. తొలి స్పెల్‌‌లో బుమ్రా దెబ్బకు టాపార్డర్‌‌‌‌ కుదేలైంది.  అరంగేట్రం కుర్రాడు నేథన్ మెక్‌‌స్వీని (10)ని ఎల్బీ చేసిన బుమ్రా తొలి దెబ్బ కొట్టాడు. 

ఆ వెంటనే లబుషేన్ (2) ఇచ్చిన సింపుల్‌‌ క్యాచ్‌‌ను కోహ్లీ డ్రాప్‌‌ చేశాడు. కానీ, బుమ్రా వేసిన ఏడో ఓవర్లోనే ఖవాజా (8) ఇచ్చిన క్యాచ్‌‌ను ఒడిసిపట్టుకున్నాడు. ఆపై బుమ్రా మరో డెలివరీకి స్టీవ్ స్మిత్ (0)  వికెట్ల ముందు దొరికి గోల్డెన్‌‌ డకౌటయ్యాడు.  వరుస బాల్స్‌‌లో రెండు వికెట్లు పడటంతో ఆసీస్‌‌ 19/3తో డీలా పడింది. కొద్దిసేపటికే హెడ్‌‌ (11)ను క్లీన్‌‌బౌల్డ్‌‌ చేసిన అరంగేట్రం బౌలర్‌‌‌‌ హర్షిత్ తొలి వికెట్‌‌ ఖాతాలో వేసుకున్నాడు. 

ఈ దశలో సిరాజ్‌‌ జోరు పెంచాడు. రాహుల్ పట్టిన చురుకైన క్యాచ్‌‌తో ఆల్‌‌రౌండర్ మిచెల్ మార్ష్‌‌ (6)తో పాటు క్రీజులో పాతుకుపోయిన లబుషేన్‌‌ను ఇన్‌‌ కట్టర్‌‌‌‌తో పెవిలియన్‌‌ చేర్చి ఆసీస్‌కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. తన చివరి స్పెల్‌‌లో బౌలింగ్‌‌కు వచ్చిన బుమ్రా.. ఆసీస్ కెప్టెన్‌‌ కమిన్స్ (3) పని పట్టి ఇండియా పైచేయి సాధించేలా చేశాడు.

తెలుగు కుర్రాడు..నమ్మకం నిలబెట్టాడు

ఈ మ్యాచ్‌‌తో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా టెస్టు అరంగేట్రం చేశారు. తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి నితీశ్ టెస్టు క్యాప్ అందుకోగా..  రాణాకు అశ్విన్‌‌ ఇచ్చాడు. పేస్‌ ఆల్‌రౌండర్‌‌ కోటాలో తుది జట్టులోకి వచ్చిన నితీశ్​ తొలి ఇన్నింగ్స్‌‌లో ఎనిమిదో నంబర్‌‌‌‌లో బ్యాటింగ్‌కు దిగి టీమ్‌‌లో టాప్ స్కోరర్‌‌‌‌గా నిలిచాడు. జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. సీనియర్లు తడబడినా.. ఆసీస్ పేసర్లు విజృంభిస్తున్నా నితీశ్‌‌  బెదరలేదు. 

చాలా  కాన్ఫిడెంట్‌‌గా బ్యాటింగ్‌‌ చేశాడు. కమిన్స్‌‌ షార్ట్‌‌పిచ్‌‌ బాల్‌‌ను అప్పర్ కట్‌‌ షాట్‌‌తో సిక్స్‌‌గా మలిచి ఔరా అనిపించాడు. స్పిన్నర్‌‌‌‌ లైయన్ బౌలింగ్‌‌లో రివర్స్‌‌ స్వీప్ షాట్లతో  బౌండ్రీలు కొట్టి పైచేయి సాధించాడు. అతని డ్రైవ్స్‌‌ కూడా బాగున్నాయి. మొత్తంగా  మొదటి ఇన్నింగ్స్‌‌లోనే టెస్టు ఫార్మాట్‌‌కు సరిపోయే నైపుణ్యాలు తనలో ఉన్నాయని నిరూపించుకున్నాడు. బౌలింగ్‌‌లోనూ రాణిస్తే జట్టులో అతని ప్లేస్‌‌కు తిరుగుండదు. 

గంభీర్‌‌‌‌ నింపిన స్ఫూర్తితో

పెర్త్‌‌ పిచ్‌‌ గురించి తెలుసుకొని మ్యాచ్‌‌కు ముందు ఆందోళనతో ఉన్న తనలో కోచ్‌‌ గంభీర్ మాటలు స్ఫూర్తి నింపాయని నితీశ్ చెప్పాడు. ‘పెర్త్ వికెట్ గురించి చాలా విన్నాను. ఈ వికెట్‌‌పై బౌన్స్ గురించి అందరూ మాట్లాడుకోవడం నా మైండ్‌‌లో ఉండిపోయింది. దాంతో  ఆటకు ముందు కాస్త ఆందోళనగా అనిపించింది. అప్పుడే  మా టీమ్ చివరి ప్రాక్టీస్ సెషన్ తర్వాత గంభీర్ సర్‌‌ నాతో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. 

బౌన్సర్‌‌‌‌ ఎదుర్కొనేప్పుడు అది భుజానికి తగిలినా ఫర్వాలేదు.. దాన్ని  నీ దేశం కోసం బుల్లెట్‌‌ను తీసుకుంటున్నట్టుగా భావించు అని చెప్పారు. ఆ మాటలు నన్ను ఉత్తేజపరిచాయి. నా దేశం కోసం నేను బుల్లెట్‌ను అయినా ఎదుర్కోవడానికి అయినా సిద్ధంగా ఉండాలని అనిపించింది’ అని  తొలి రోజు ఆట ముగిసిన తర్వాత నితీశ్ చెప్పాడు.

రాహుల్‌‌ ఔట్‌‌పై వివాదం

ఈ మ్యాచ్‌‌లో కేఎల్‌‌ రాహుల్ క్యాచ్‌‌ ఔట్‌‌ నిర్ణయం వివాదాస్పదమైంది. స్టార్క్  బౌలింగ్‌‌లో  కేఎల్‌‌ క్యాచ్‌‌ కోసం చేసిన అప్పీల్‌‌ను ఫీల్డ్ అంపైర్ తిరస్కరించడంతో ఆసీస్ రివ్యూ కోరింది. డీఆర్‌‌‌‌ఎస్‌‌లో బంతి కేఎల్‌‌ బ్యాట్‌‌కు దగ్గరిగా వెళ్తుండగా స్నికో మీటర్‌‌‌‌లో స్పైక్‌‌ కనిపించింది. అదే టైమ్‌‌లో కేఎల్ బ్యాట్‌‌ అతని ప్యాడ్స్‌‌కు తగిలింది. బంతి బ్యాట్‌‌కే తగిలినట్టు స్పష్టత లేకపోయినా.. ఇతర యాంగిల్స్‌‌ పరిశీలించకుండానే థర్డ్ అంపైర్ ఔట్‌‌ ఇచ్చాడు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

పంత్ షాట్‌కు ఫిదా

కమిన్స్ వేసిన 42వ ఓవర్లో పంత్ కొట్టిన సిక్సర్‌‌‌‌ తొలి రోజు ఆటకు హైలైట్‌‌గా నిలిచింది. కమిన్స్‌‌ ఆఫ్‌‌ స్టంప్‌‌కు కాస్త దూరంగా వేసిన ఫుల్‌‌ డెలివరీని పంత్‌‌  పూర్తిగా తన ఎడవవైపు పడిపోతూ స్కూప్‌‌ షాట్‌‌ కొట్టగా.. అది డీప్ బ్యాక్‌‌వర్డ్‌‌ స్క్వేర్‌‌‌‌ మీదుగా సిక్స్‌‌గా వెళ్లింది. బాడీని బ్యాలెన్స్ చేసే క్రమంలో పంత్ పూర్తిగా కిందపడిపోగా 
అతని షాట్‌‌ చూసి అంతా ఫిదా అయ్యారు. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌ : 49.4 ఓవర్లలో 150 ఆలౌట్ (నితీశ్ రెడ్డి 41, పంత్ 37, హేజిల్‌‌వుడ్ 4/29).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌ : 27 ఓవర్లలో 67/7 (క్యారీ 19 బ్యాటింగ్‌‌, హెడ్‌‌ 11, బుమ్రా 4/17).