ప్రపంచ దేశాలకు అండగా భారత్

భారతదేశంలో ఏ చిన్న విపత్తు సంభవించినా, సరైన సదుపాయాలు లేని కారణంగా సహాయం కోసం ఐక్యరాజ్య సమితిని, ఇతర దేశాలను సహాయం కోసం వేడుకునేది. అది ఒకప్పటి మాట. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే గొప్ప శక్తిగా అవతరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయా సందర్బాల్లో సంభవించిన విపత్కర సమయాల్లో ప్రపంచ దేశాలకు అండగా నిలుస్తున్నది.

తుర్కియేకి ఆపన్నహస్తం.

ఫిబ్రవరి 6న తుర్కియేలో సంభవించిన భారీ భూకంపంతో వేలాది మంది ప్రజలు మరణించారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. గాయపడ్డ వారితో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. దౌత్యపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ తుర్కియేకి దాంతో పాటుగా సిరియాకి కూడా భారత్​ మొట్టమొదటగా స్పందించి సహాయం అందించింది. ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట తుర్కియేకి భారత ప్రభుత్వం, భారత ఆర్మీ వారి సహకారంతో వివిధ రకాల వైద్యపరికరాలు, అత్యవసర మందులు, వైద్య సిబ్బంది, నిత్యావసర సరుకులు, డాగ్ స్క్వాడ్ సహా ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడటం కోసం 151మందితో కూడిన మూడు బృందాల ఎన్​డీఆర్ఎఫ్​ సిబ్బందిని భారత వాయుసేనకు చెందిన సీ17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ లో తరలించింది. 30 పడకల ఆసుపత్రి నిర్మించడంతో పాటు దాదాపు 4000 మంది క్షతగాత్రులకు చికిత్స అందించింది. ఈ సాయం తమకు ఎంతగానో ఉపశమనం కలిగించిందని తుర్కియే ప్రభుత్వం కృతజ్ఞత వ్యక్తం చేసింది. వివిధ సందర్బాల్లో పలు అంతర్జాతీయ వేదికలపై తుర్కియే కాశ్మీర్ అంశంపై, భారత అంతరంగిక విషయాలపై పాక్​కు మద్దతు ఇస్తూ భారత్ పై విషం చిమ్మినప్పటికీ పురాణ ఇతిహాసాల్లో పేర్కొన్నట్టు ఆపదలో శత్రువుకైనా అండగా ఉండాలన్న విషయం రుజువుచేసి భారత్​ ప్రపంచ దేశాల మన్ననలు అందుకుంది. కేవలం తుర్కియేకే కాకుండా 2015లో నేపాల్ లో భూకంపం సంభవించినప్పుడు కూడా ఎన్ డీఆర్ఎఫ్​ సిబ్బందిని సహాయం కోసం పంపింది.

ప్రపంచ దేశాలకు తోడ్పాటు..

యావత్తు ప్రపంచం కరోనాతో విలవిలలాడుతున్న వేళ భారత్ ప్రపంచ దేశాలకు ఆపన్నహస్తం అందించి గొప్ప మనసును చాటుకున్నది. ప్రపంచ దేశాలకు భారీ సంఖ్యలో వాక్సిన్ డోసులతో పాటు, మందులు, వైద్య పరికరాలను అందించింది. భారత ప్రభుత్వం ఆపరేషన్ ‘వ్యాక్సిన్ మైత్రి’ పేరుతో 2021 జనవరి 20 న ప్రపంచ దేశాలకు ఉచితంగా వాక్సిన్ల పంపిణీని ప్రారంభించింది. ఇందులో భాగంగానే తొలుత భూటాన్, మాల్దీవ్​లకు కొవిడ్ టీకాల్ని పంపింది. ఆ తర్వాత నేపాల్ కు ఒక మిలియన్ డోసులను, బంగ్లాదేశ్ కు 20 లక్షల డోసులు, గ్వాటిమాలకు రెండు లక్షల డోసులు సహా మయన్మార్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, మారిషస్, ఫిజి, జమైకా, పరాగ్వే, కువైట్ దేశాలకు టీకాలు పంపింది. భారత్ దాదాపు 98 దేశాలకు సుమారు 800 లక్షల డోసుల కొవిడ్ టీకాల్ని అందించి ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు, ప్రపంచ దేశాల మన్ననలు పొందింది. పలు సందర్బాల్లో అండగా ఉంటూ వస్తున్న భారతదేశం.. ప్రపంచదేశాల్లో తన ప్రతిష్టను పెంపొందించుకుంటూ వసుదైక కుటుంబం అనే భావనతో విశ్వగురువు నామధేయాన్ని సార్థకం చేసుకుంటున్నది.

అఫ్గాన్​కు చేయూత

ప్రస్తుతం తాలిబన్ల ఆధ్వర్యంలో నడుస్తున్న అఫ్గాన్​కు​ కష్టకాలం వచ్చిన సందర్భంలో పెద్ద మొత్తంలో సాయం చేస్తూ భారత్​అండగా నిలుస్తున్నది. 2022 సంవత్సరంలో భారత్ ఆ దేశానికి దాదాపు నలభై వేల టన్నుల గోధుమలు, మందులు, వివిధ రకాల వైద్య పరికరాలు పలు దశల్లో అందజేసింది. మూడు బిలియన్ డాలర్ల విలువైన ఆసుపత్రులు, రోడ్లు, డ్యామ్​లు, పాఠశాలలు తదితర మౌలిక వసతుల కల్పనలో సాయం చేసింది. అంతేగాక కరోనా కష్ట సమయంలో వాక్సిన్లను కూడా అందించి మానవీయత చాటుకున్నది.
- నేరడిగొండ సచిన్,
ఉస్మానియా యూనివర్సిటీ