ఈ పెట్రోల్ దిశగా ఇండియా

వాతావరణ మార్పులు ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలు. వాతావరణ మార్పుల వల్లే అధిక ఉష్ణోగ్రతలు, కరువు కాటకాలు, అకాల వర్షాలు, తీవ్రమైన తుఫానులు వస్తున్నాయి. వాతావరణ మార్పులకు ప్రధాన కారణం పెట్రోలు వంటి శిలాజ ఇంధనాలను మండించడమే. దానివల్ల కార్బన్ డయాక్సైడ్  వంటి హరితవాయువులు వాతావరణంలోకి విడుదలై, అది గ్లోబల్ వార్మింగ్ కు దారితీస్తున్నది. 2021లో స్కాట్లాండ్ లోని గ్లాస్గో నగరంలో నిర్వహించిన కాప్26 సదస్సులో భారతదేశం 2030 నాటికి 50 % కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని, 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. 

ఇందులో భాగంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలైన పర్యావరణ అనుకూల ఇంధనాలను ప్రోత్సహిస్తోంది. జీవ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం “జీవ ఇంధనాలపై జాతీయ విధానం–2018” ని 2018 జూన్​లో ప్రకటించింది.  ఇందులో భాగంగానే పర్యావరణ అనుకూల ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్(ఈబీపీ) కార్యక్రమానికి భారతప్రభుత్వం రూపకల్పన చేసింది. దీని ముఖ్య ఉద్దేశం కొద్ది శాతం ఇథనాల్ ను పెట్రోల్ కు కలపటం.  దీన్నే ‘‘ఈ –పెట్రోల్’ అని పిలుస్తారు. ఇథనాల్ కు మరొక పేరు ఇథైల్ ఆల్కహాల్. పెట్రోల్ లో కలిపే ఇథనాల్ పరిమాణ శాతం ప్రకారం ‘ఈ10’ పెట్రోల్ అని, ‘ఈ 20’ పెట్రోల్ అని పిలుస్తారు. ఈ10 పెట్రోల్ లో 10% ఇథనాల్  90% పెట్రోల్ ఉంటుంది,  ఈ 20 పెట్రోల్ లో 20% ఇథనాల్ 80% పెట్రోల్ ఉంటుంది.

దేశ ఆర్థిక ప్రయోజనాలు

గత ఎనిమిదేండ్లలో, పెట్రోల్ కు10 శాతం ఇథనాల్ కలపడం(ఈ10) వల్ల భారతదేశానికి రూ.53,894 కోట్ల వరకు విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతున్నది. అలాగే  రూ.49,078 కోట్ల రూపాయల ఆదాయం రైతులకు సమకూరుతున్నది. ఇది 318 లక్షల టన్నుల  కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించింది. 2020–-25 సంవత్సర కాలంలో భారత దేశంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగంపై  ఒక ప్రణాళికను నీతి అయోగ్ రూపొందించింది. ఈ ప్రణాళికలో నీతి అయోగ్ ప్రచురించిన సమాచారం ప్రకారం.. భారత దేశంలో రవాణా రంగంలో 98% శిలాజ ఇంధనాలు వాడుతుండగా కేవలం 2%  మాత్రమే జీవ ఇంధనాలు వాడుతున్నారు. ఇండియా తన ఇంధన డిమాండ్‌‌ను తీర్చుకోవడానికి ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నది. రవాణా రంగంలో మొత్తం చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. ఈ20 పెట్రోల్ ఏడాదికి 30 వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేస్తుంది. 

పర్యావరణ అనుకూల ఇంధనం

సాధారణ పెట్రోల్ కంటే తక్కువ ధరకు లభించే పర్యావరణ అనుకూల ఇంధనం ఈ పెట్రోల్. ఒక ఇంధనం నాణ్యతను నిర్ధారించే  యాక్టెన్ సంఖ్య పెట్రోల్ కంటే ఇథనాల్ కు ఎక్కువగా ఉండటం వల్ల ఈ 20 పెట్రోల్ నాణ్యత సాధారణ పెట్రోల్ కన్నా ఎక్కువ. ఇథనాల్ లో ఆక్సిజన్ ఉండటం వల్ల ఇథనాల్ కు అధిక జ్వాల వేగం  ఉంటుంది. దాంతో ఈ 20 ఇంధనం పూర్తిగా మండి తక్కువ పరిమాణంలో కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్ ఇతర వ్యర్థాలను వాతావరణంలోకి విడుదల  చేస్తుంది. ఈ10 , ఈ 20 ఇంధనాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద, చల్లని ఉష్ణోగ్రతల వద్ద కూడా ఎలాంటి సమస్యలు లేకుండా సమర్థవంతంగా పనిచేయగలవు. పూర్తి పెట్రోల్ తో నడిచే వాహనాలతో పోలిస్తే, ఈ10 ఇంధన బైకులు, ఫోర్​వీలర్స్​20% తక్కువ కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో  కార్బన్లను విడుదల చేస్తాయి. ఈ20 ఇంధన బైకులు 50% తక్కువగా కార్బన్ మోనాక్సైడ్ ను, 20%  తక్కువగా హైడ్రో కార్బన్లను విడుదల చేస్తాయి. అదే ఫోర్​వీలర్స్ 30% తక్కువ గా కార్బన్ మోనాక్సైడ్ ను, 20% శాతం తక్కువగా హైడ్రో కార్బనాలను విడుదల చేస్తాయి. నైట్రోజన్ ఆక్సైడ్ ల విడుదల అనేది ఇంజన్ నిర్మాణం, ఇంజన్ పని తీరుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ10, ఈ20 ఇంధన వాహనాలు పూర్తి పెట్రోల్ తో నడిచే వాహనాల మాదిరిగా అదే పరిమాణంలో నైట్రోజన్ ఆక్సైడ్ లను విడుదల చేస్తాయి.

ప్రత్యేక వాహనాల తయారీ

సాధారణ పూర్తి పెట్రోల్ తో నడిచే వాహనాలు ఈ10 లేక ఈ 20 ఇంధనాలతో పని చేయవు. కాబట్టి వీటి కోసం ప్రత్యేక వాహనాలను రూపకల్పన చేయాల్సి ఉంటుంది. ఈ10 లేక ఈ20 ఇంధనంతో నడిచే వాహనాలు ఏప్రిల్ 2025 నుంచి మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వీటి ధర పూర్తి పెట్రోల్ తో నడిచే వాహనాల కన్నా స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది. ఫోర్​వీలర్స్​ధర రూ.3,000 నుంచి రూ. 5,000 వరకు, బైకుల ధర రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఎక్కువగా ఉండొచ్చు. 

పర్యావరణ అనుకూల ఇంధనాల ఆవశ్యకత

భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(ఎస్ఐఏఎం) అంచనాల ప్రకారం, ప్రస్తుతం దేశంలో సుమారు 22 కోట్ల బైకులు, త్రిచక్ర  వాహనాలు, 3.6 కోట్ల ఫోర్​వీలర్స్​ఉన్నాయి. ఏటా వీటి సంఖ్య దాదాపు 8- నుంచి10% పెరిగే అవకాశం ఉంది. మొత్తం వాహనాలు వెలువరించే కాలుష్యంలో బైకులు 74%, కార్లు12 శాతం విడుదల చేస్తున్నాయి. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు మూడింట రెండొంతుల పెట్రోలు వినియోగించుకుంటే, నాలుగు చక్రాల వాహనాలు మూడింట ఒక వంతు పెట్రోలు వినియోగించుకుంటున్నాయి. అందుబాటులో ఉన్న ఈ సమాచారం ప్రకారం రాబోయే కాలంలో విడుదలయ్యే కాలుష్యాన్ని, వాతావరణ సంక్షోభాన్ని ఊహించుకోవచ్చును. వీటిని నివారించాలంటే ఈ పెట్రోల్ వంటి పర్యావరణ అనుకూల ఇంధనాలను ఉపయోగించడమే సరైన పరిష్కారం. 

ఈ 20 పెట్రోల్ కు కేంద్రప్రభుత్వ అనుమతి

10 శాతం ఇథనాల్‌‌ కలిపిన ఈ10 పెట్రోల్‌‌ను సరఫరా చేయాలనే లక్ష్యాన్ని కేంద్రప్రభుత్వం అనుకున్న దానికంటే ఐదు నెలలు ముందుగానే అంటే జూన్ 2022లోనే చేరుకుంది. ఈ విజయంతో 2025 ఏడాది కల్లా 20 శాతం ఇథనాల్ కలిపిన ఈ 20 పెట్రోల్ భారతదేశం అంతటా సరఫరా చేయాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటి విడతలో 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 15 పట్టణాల్లో గల 84 పెట్రోల్ స్టేషన్లకు ఈ 20 పెట్రోల్ సరఫరాకు అనుమతి ఇచ్చారు. దీని ధర లీటర్ రూ.60 మాత్రమే. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రాష్ట్రాల జాబితాలో లేవు.

ఈ పెట్రోల్ కు కావాల్సిన ఇథనాల్ తయారీ

ఇథనాల్ ఒక పునరుత్పాదక జీవ ఇంధనం. దీన్ని సహజ సిద్ధంగా చెరుకు నుంచి గానీ, మొక్కజొన్న  నుంచి గానీ, లేక ఇతర ఆహార ధాన్యాలను పులియ పెట్టడం ద్వారా గానీ తయారు చేస్తారు. దీనినే మద్యం తయారీలో వాడుతారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ పర్యావరణానికి అను కూలమైనది. పైగా చెరుకు రైతులకు ఎక్కువ మొత్తంలో ఆదాయం చేకూర్చు తుంది. ఇథ నాల్ ను సాధారణంగా చెరుకు నుంచి తయారు చేస్తారు. చెరుకు సాగు అధిక మొత్తంలో నీటిని వినియో గించుకోవడం వల్ల భూగర్భ జలాలు క్షీణిస్తాయి, కాబట్టి ఇథ నాల్ ను ఇతర పదార్థాల నుంచి తయారు చేస్తున్నారు.  ఫుడ్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా  వద్ద అధికంగా నిల్వ ఉన్న బియ్యం నుంచి లేక దెబ్బతిన్న ఆహార ధాన్యా ల నుంచి కూడా ఇథనాల్ ను తయారు చేయవచ్చు. కానీ వీటి నుంచి ఇథనాల్ తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి లాభసాటిగా ఉండదు. మొక్కజొన్న తక్కువ నీటితో పండుతుంది, విరివిగా లభిస్తుంది, ఎక్కువ 
మొ త్తంలో ఇథనాల్ ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మొక్కజొన్న నుంచి ఇథనాల్ ను ఎక్కువ మొత్తంలో లాభసాటిగా తయారు చేయవచ్చు. 

డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ, కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్