- స్టార్టప్ ఇండియా వార్షికోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: స్టార్టప్ ఇండియా కార్యక్రమం దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన వ్యవస్థల్లో ఒకటిగా మార్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురువారం స్టార్టప్ ఇండియా 9వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. యువత సాధికారతను పెంచే శక్తివంతమైన మార్గంగా స్టార్టప్ లు ఉద్భవించాయన్నారు. ‘‘గత తొమ్మిదేండ్లుగా స్టార్టప్ ఇండియా ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రోగ్రామ్.. లెక్కలేనంత మంది యువకులకు సాధికారత కల్పించింది. వారి వినూత్న ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా మార్చింది”అని అన్నారు. ఈ స్టార్టప్ కార్యక్రమం టెక్ ఆధారిత పరిష్కారాల నుంచి గ్రామీణ ఆవిష్కరణల వరకు, ఆరోగ్య సంరక్షణ పురోగతి నుంచి బయోటెక్ పురోగతి వరకు, ఫిన్‌టెక్ నుంచి ఎడ్‌టెక్ వరకు, క్లీన్ ఎనర్జీ నుంచి సుస్థిరమైన సాంకేతికత వరకు ఇండియన్ స్టార్టప్‌లు ప్రపంచ సవాళ్లను పరిష్కరిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.