IND vs NZ, 2nd Test: ముగిసిన తొలి సెషన్.. భారత్‌ను అడ్డుకున్న కాన్వే

IND vs NZ, 2nd Test: ముగిసిన తొలి సెషన్.. భారత్‌ను అడ్డుకున్న కాన్వే

పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతుంది. తొలి రోజు తొలి సెషన్ లో భారత బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకుంది. దీంతో తొలి రోజు లంచ్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజ్ లో కాన్వే (47), రచీన్ రవీంద్ర (5) ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ కు రెండు వికెట్లు దక్కాయి. 

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను ఓపెనర్లు జాగ్రత్తగా ఆరంభించారు. ఆచితూచి ఆడుతూ భారత పేసర్లు బుమ్రా, ఆకాష్ దీప్ లకు వికెట్ ఇవ్వలేదు. అయితే 8 ఓవర్ లో అశ్విన్ ఎంట్రీతో భారత్ కు తొలి వికెట్ లభించింది. తొలి వికెట్ కు 32 పరుగులు జోడించిన తర్వాత కివీస్ కెప్టెన్ టామ్ లేతమ్ 15 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. ఈ దశలో కాన్వేకు జత కలిసిన యంగ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. 

Also Read : క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఒకే రోజు నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లు

రెండో వికెట్ కు 44 పరుగులు జోడించిన తర్వాత యంగ్ 18 పరుగులు చేసి పంత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 76 పరుగుల వద్ద కివీస్ తమ రెండో వికెట్ కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో కాన్వే భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రచీన్ రవీంద్ర, కాన్వేతో కలిసి మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ను ముగించారు. ఈ టెస్టులో న్యూజిలాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫాస్ట్ బౌలర్ హెన్రీ స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నట్ చోటు దక్కించుకున్నాడు.