న్యూఢిల్లీ: శత్రుదేశాలు ప్రయోగించే అణ్వస్త్రాలను అడ్డుకోవడంలో భారత్ సత్తా మరింతగా పెరిగింది. న్యూక్లియర్ మిసైళ్లను అడ్డుకుని ధ్వంసం చేయగల అధునాతన కే4 బాలిస్టిక్ మిసైల్‌ను అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి ఇండియన్ నేవీ విజయవంతంగా ప్రయోగించింది. గురువారం బంగాళాఖాతంలో జరిగిన ఈ పరీక్ష అన్ని రకాలుగా విజయవంతం అయిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
తాజా పరీక్షతో ఈ క్షిపణి పూర్తిస్థాయిలో వినియోగానికి సిద్ధమైందని, దీంతో భూ, గగన, సముద్రతలాలతోపాటు సముద్రం అడుగు నుంచీ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే సత్తా సమకూరిందని తెలిపాయి. అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న కే4 బాలిస్టిక్ మిసైల్ 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. డీఆర్డీవో తయారుచేసిన ఈ క్షిపణికి ఇప్పటివరకూ పలుమార్లు ట్రయల్స్ చేయగా, తాజాగా ఫుల్ రేంజ్ టెస్ట్ నిర్వహించారు. కాగా, కే15 బాలిస్టిక్ మిసైల్స్ ను ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి నేవీ గతంలోనే విజయవంతంగా పరీక్షించింది.