- మరోసారి మన దేశం సాయం
- నిత్యావసరాలు పంపిన తమిళనాడు
కొలంబో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు మన దేశం మరోసారి సాయం చేసింది. అక్కడ ఆయిల్ కొరత ఎక్కువగా ఉండడంతో క్రెడిట్ లైన్ ఫెసిలిటీ కింద మరో 40 వేల టన్నుల డీజిల్ పంపించింది. అది కొలంబోకు చేరిందని అక్కడి ఇండియన్ హైకమిషన్ శనివారం ట్వీట్ చేసింది. శ్రీలంకకు సాయం చేసేందుకు క్రెడిట్ లైన్ ను మరో 500 మిలియన్ డాలర్లకు పొడిగిస్తున్నట్లు పోయిన నెలలోనే మన దేశం ప్రకటించింది. కాగా, ఆకలితో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలను ఆదుకునేందుకు మన దేశం, జపాన్ ముందుకొచ్చాయి. కేంద్ర అనుమతితో తమిళనాడు ప్రభుత్వం అక్కడికి రూ.45 కోట్ల విలువైన సరుకులను పంపింది. 9 వేల టన్నుల బియ్యం, 200 టన్నుల పాల పొడి, 24 టన్నుల మందులతో బుధవారం చెన్నై నుంచి షిప్ బయలుదేరింది. ఈ షిప్ ఆదివారం కొలంబోకు చేరుకుంటుందని ఇండియన్ హైకమిషన్ ట్వీట్ చేసింది. లంకకు 1.5 మిలియన్ డాలర్ల సాయం చేస్తామని జపాన్ ప్రకటించింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్ పీ) కింద నిత్యావసరాలు అందజేస్తామని తెలిపింది.
దేశంలో ఎమర్జెన్సీ ఎత్తివేత
శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేశారు. లా అండ్ ఆర్డర్ మెరుగుపడడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీ ఎత్తివేస్తున్నట్లు ప్రెసిడెంట్ ఆఫీస్ ప్రకటించింది. ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వమే కారణమంటూ ప్రజలు ఆందోళనలు చేయడంతో ఈ నెల 6న ప్రెసిడెంట్ గొటబయ రాజపక్స దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు.