అశోకుడి కాలం నుంచి శ్రీలంకకు అండగా భారత్

శ్రీలంకతో మనకు క్రీస్తు పూర్వం నుంచీ మంచి సంబంధాలున్నాయి. అశోక చక్రవర్తి బౌద్ధమత వ్యాప్తి కోసం స్వయాన తన పెద్దకూతురు సంఘమిత్రను, కొడుకు మహిందను శ్రీలంకకు పంపినట్లు చరిత్ర చెబుతోంది. చోళుల కాలంలో శ్రీలంకతో వాణిజ్య సంబంధాలుండేవి. ఆధునిక కాలానికి వస్తే… ప్రత్యేక తమిళ రాజ్యం కోసం కొన్నిమిలిటెంట్‌‌‌‌ సంస్థలు విధ్వంసాలకు పాల్పడుతున్న రోజుల్లో చొరవగా ముందుకు వచ్చింది ఇండియానే. రాజీవ్‌ గాంధీ తన హయాంలో శ్రీలంక విషయంలోతీసుకున్న సాహసోపేత నిర్ణయాలు అన్నీ ఇన్నీ కావు. 1987లో ‘ఆపరేషన్‌‌‌‌ పూమాలై’ పేరుతో తమిళ ప్రాంతాల్లో నిత్యవసర సరుకులను విమానాల ద్వారా జారవిడిచారు.

మానవతావాదంతో చేసిన ఈపనికి శ్రీలంక ప్రభుత్వం అలిగినప్పటికీ ఇండియా చొరవను గుర్తించింది. అదే ఏడాది జూలైలో లిబరేషన్‌‌‌‌ టైగర్స్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ తమిళ్‌ ఈలం (ఎల్‌‌‌‌టీటీఈ) చీఫ్‌‌‌‌ వేలుపిళ్లై ప్రభాకరన్‌‌‌‌ని న్యూఢిల్లీకి రప్పించి లంక ప్రభుత్వంతో సయోధ్యకు ఒప్పించారు. నిజానికి,అది రాజీవ్‌ గాంధీ తనకు తాను మరణ శాసనం రాసుకోవడమేనని పొలిటికల్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్టులు హెచ్చరించినా ఆయన వినలేదు. 1987 జూలై 30న ఇండో–శ్రీలంక శాంతి ఒప్పందంపై సంతకాలకోసం వెళ్లినప్పుడు అక్కడ గార్డ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఆనర్‌‌‌‌ జరుగుతుండగా, ఒక లంక నావికుడు ఆయనపై తుపాకీతో దాడి చేశాడు.