కవర్ స్టోరీ: ఫుడ్ హ్యాబిట్స్లో ఇండియా ఎందుకు నెంబర్​ వన్ ​?

కవర్ స్టోరీ: ఫుడ్ హ్యాబిట్స్లో ఇండియా ఎందుకు నెంబర్​ వన్ ​?

ఇండియా ఫుడ్​ హ్యాబిట్స్​ చాలా బెస్ట్​!భారతదేశ ఆహారపు అలవాట్లు ఫాలో అయితే కనుక భూమిని కాపాడుకోవచ్చు. క్లైమేట్​ డ్యామేజ్​ కాకుండా జాగ్రత్తపడొచ్చు – ఈ స్టేట్​మెంట్​ చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ... ప్రపంచదేశాలతో పోలిస్తే ఇండియన్స్ తినే ఫుడ్​ బెటర్​ అని తేల్చి చెప్తున్నాయి కొన్ని రీసెర్చ్​ రిపోర్ట్స్​.

‘సగం అనారోగ్య సమస్యలకు తిండే కారణం’ అంటుంటే ఇదేంటి కొత్తగా? అనిపించడం సహజం. అయితే పైన చెప్పిన స్టేట్​మెంట్​ మాత్రం ‘పర్యావరణ ఆరోగ్యం’ గురించి అన్నమాట. మొత్తానికి ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ హ్యాబిట్స్​ సస్టెయినబిలిటీలో ఇండియా నెంబర్​ వన్ అని ‘వరల్డ్​ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ అనే సంస్థ చెప్పింది. ఈ సంస్థ ఇచ్చిన నివేదికలో ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ హ్యాబిట్స్​ సస్టెయినబిలిటీలో ఇండియా ఎందుకు నెంబర్​ వన్​? ఆ అలవాట్ల వల్ల పర్యావరణానికి కలుగుతున్న లాభాలేంటి? అనే ఇంట్రెస్టింగ్​ విషయాలెన్నో చెప్పింది. ఆ విషయాలే ఈ వారం కవర్​ స్టోరీ.

‘‘ప్రపంచ దేశాలతో పోలిస్తే  ఇండియన్స్ తినే ఫుడ్​ చాలా బెటర్​” అని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్​వైడ్​​ ఫండ్) ఫర్​ నేచర్​ లివింగ్​ ప్లానెట్ రిపోర్ట్ 2024లో తెలిపింది. ఇండియన్లు తినే ఫుడ్​ను మిగతా దేశ ప్రజలు కూడా తింటే 2050 నాటికి భూమికి, వాతావరణానికి చాలా మేలు జరుగుతుందని కూడా ఆ నివేదిక​లో ఉంది. అయితే ఈ రిపోర్ట్​ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించింది కాదు. జీ20 సభ్యత్వం కలిగిన దేశాలను మాత్రమే ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. ఈ రిపోర్ట్​లో ర్యాంకింగ్​ని బట్టి చూస్తే ఇండియా అగ్రస్థానంలో ఉంటే... అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు మాత్రం చివరి మూడు ర్యాంకులకు పరిమితమయ్యాయి. అందుకు కారణం ఆయా దేశాల ప్రజలు కొవ్వు, చక్కెర పదార్థాలతో తయారయ్యే ఫుడ్​ ఎక్కువగా తినడమే.

ఇండియన్​ ఫుడ్​ గొప్పతనం ఏంటి?

‘‘ఇండియాలో వెజ్, నాన్​ వెజ్ రెండు రకాల ఫుడ్​ తింటారు. ఉత్తరాదిలో గోధుమ రొట్టెలు, పప్పులతో పాటు మాంసం కూడా తింటారు. అదే దక్షిణాదిలో చూస్తే అన్నం, ఇడ్లీ, దోశ, సాంబార్ వంటివి ఆహారంలో ఎక్కువగా ఉంటాయి. అదే తూర్పు, పశ్చిమ​, ఈశాన్య ప్రాంతాల్లోని ప్రజలు అన్నంతోపాటు సీజనల్​గా దొరికే ఫుడ్​తో పాటు రాగులు, జొన్నలు, బార్లీ వంటి చిరుధాన్యాలు ఎక్కువగా తింటారు. ఇలా క్లైమెట్ ఫ్రెండ్లీ ఫుడ్​ సిస్టమ్​ని ఫాలో అవుతుంది ఇండియా. వాతావరణానికి అనుకూలంగా ఉండే ఫుడ్​ తినడానికి ఆసక్తి చూపుతారు భారతీయులు.

ఈ కారణాలన్నింటితో పాటు  ‘నేషనల్ మిల్లెట్ క్యాంపెయిన్’​ పేరుతో క్లైమెట్​కి అనుకూలంగా పండే ధాన్యాలను ప్రమోట్ చేయడం కూడా మంచి విషయం. ఇవి పోషకాహారాన్ని అందించడమే కాకుండా వాతావరణానికి కూడా మేలు చేస్తాయి. అందుకే ఈ ఫుడ్​ చాలా మంచిది’’ అని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రిపోర్ట్​ చెప్పింది. ఇండియా తర్వాత ఇండోనేసియా, చైనా దేశాలు ఈ జాబితా​లో ఉన్నాయి. అయినప్పటికీ ఈ విషయంలో మాత్రం ఇండియానే బెస్ట్ అంటూ అందుకు కారణాలు కూడా వివరించింది. 

సంప్రదాయ ఆహారానికి పెద్దపీట

కొన్ని దేశాలు సంప్రదాయ ఆహారాన్ని (ట్రెడిషనల్ ఫుడ్)​ డైట్​లో చేర్చుకునేందుకు ఇంపార్టెన్స్​ ఇస్తున్నాయి. అందుకు బెస్ట్​ ఎగ్జాంపుల్​ ఇండియాలో 2023లో జరిగిన ‘నేషనల్ మిల్లెట్ క్యాంపెయిన్’. చిరుధాన్యాలు(మిల్లెట్స్​) వాడడం వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా మేలే. మరి అలాంటప్పుడు ఈ విషయం గురించి అవేర్​నెస్​ పెంచేలా క్యాంపెయిన్​ చేయడం మంచి విషయం కదా. 

నిజానికి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. అలా తినాలంటే ఆయా కల్చర్స్​లో భాగమైన సంప్రదాయాలు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. వాటితో పాటు అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు, వ్యక్తుల ఇష్టాలను బట్టి ఉన్న ఆహారంలో నచ్చినవాటిని సెలక్ట్​ చేసుకుంటారు. దీనివల్ల ఫుడ్​ ప్రొడక్షన్​ కోసం వాడే భూమి అవసరం కూడా తక్కువగా ఉంటుంది. అలాగే పశువుల మేతకు వాడే భూమి మరో విధంగా... అంటే కార్బన్​ని తగ్గించి, ప్రకృతికి జీవం పోసేందుకు ఉపయోగపడుతుంది. 

ఆ రెండు దేశాలు

ఇండియా తర్వాతి స్థానంలో ఉన్న ఇండోనేసియా, చైనా ఆహార ఉత్పత్తి కోసం తక్కువ భూభాగాన్ని వాడుతున్నాయి. ఎక్కువమొత్తంలో ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి. ఇండోనేసియాలో ఎక్కువగా చైనా వంటకాల నుంచి ఇన్​స్పైర్ అయినవే ఉంటాయి. ఏదెలా ఉన్నా పర్యావరణానికి హాని చేయకుండా ఇవి కొంత మేలు చేస్తున్నాయి. ఆహార ఉత్పత్తి వల్ల భూభాగం తగ్గిపోతుంది. ఆహారపు అలవాట్ల వల్ల కర్బన ఉద్గారాలు (కార్బన్ ఎమిషన్స్) వాతావరణంలో ఎక్కువగా విడుదలవుతాయి. ఈ రెండు కారణాల వల్ల పర్యావరణం దెబ్బతింటోంది.

గ్లోబల్ టెంపరేచర్ తగ్గించాలి

సాధారణంగా గ్లోబల్ టెంపరేచర్​ ఇండస్ట్రియల్ లెవల్​లో సగటున1.5డిగ్రీల సెల్సియస్​ మించకూడదు. కానీ, ఈ ఏడాదంతా అంటే 2024లో ఆ లిమిట్​ దాటిపోయింది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే 2050 నాటికి గ్లోబల్ వార్మింగ్​ ఎఫెక్ట్ 263 శాతానికి చేరుకుంటుంది. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవాలని వేరే  ప్రాంతాలకు వెళ్లడం సమస్యకు పరిష్కారం కాదు. జీవనశైలి, పర్యావరణం, భూమిని వాడుకునే పద్ధతుల ద్వారా మాత్రమే మార్పు వస్తుంది. అందుకని ఆ దిశగా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్​. 

లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2024 ప్రకారం ఇండియా ఫుడ్​ని వాడే పద్ధతి భూమికి, వాతావరణానికి హాని కలిగించనిది (సస్టెయినబుల్). అన్ని దేశాలు డైట్, ఫుడ్​ ప్రొడక్షన్​లో ఇండియాకు మల్లే ఉంటే పరిస్థితులు మెరుగుపడతాయి​. అదే అర్జెంటీనా పాటించే పద్ధతులు అన్ని దేశాలు పాటిస్తే మనకున్న ఈ ఒక్క భూగ్రహం సరిపోదు. ఇలాంటివి 7.4 కావాలి. ఇండియాను ఫాలో అయితే 0.84 సరిపోతుంది. అందుకే అన్నిదేశాలు భారతదేశం లాంటి ఆహార పద్ధతులను అలవాటు చేసుకుంటే 2050 నాటికి వాతావరణం ఆరోగ్యం బాగవుతుంది. జీవవైవిధ్యం, సహజ వనరులు, ఆహార భద్రతకు ప్రమాదం ఉండదని చెప్తోంది ఆ  నివేదిక. 

సస్టెయినబుల్ డైట్స్, ప్రొటీన్ల స్థానంలో పప్పులు, ప్లాంట్ బేస్డ్ మీట్స్, న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటే ఆల్గే (శైవలం) వంటివి తింటే ఫుడ్​ ప్రొడక్షన్ వల్ల క్లైమెట్​ మీద పడే ఎఫెక్ట్​ తగ్గుతుంది. అలా జరగాలంటే లోకల్, సీజనల్​ ఫుడ్​ తినాలి. అందుకని దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ప్రాసెస్డ్​ ఫుడ్​కి ఎంత దూరంగా ఉంటే పర్యావరణానికి అంత మేలు చేసిన వాళ్లవుతారు. అలాగే ఫుడ్ వేస్టేజ్​ 
తగ్గించాలి కూడా.

మిల్లెట్స్ పండిస్తే..

మనదేశంలో వరికి బదులు సజ్జలు, జొన్నలు వంటి మిల్లెట్స్​ని 2019వ సంవత్సరంలో కొంత విస్తీర్ణంలో సాగుచేశారు. వరితో పోలిస్తే  ఈ పంటలు తక్కువ గ్రీన్​హౌజ్ గ్యాస్​ విడుదల చేస్తున్నాయని, వాతావరణంలో మార్పులు రాకుండా కాపాడేందుకు ఉపయోగపడుతున్నాయనే విషయం కనుగొన్నారు సైంటిస్ట్​లు. ఇదేకాకుండా వరితో పోలిస్తే నీళ్లు, శ్రామిక శక్తి కూడా తక్కువ అవసరం అవుతాయని తెలిసింది. ఈ పంటలు పండడానికి సింథటిక్ ఎరువులు, పురుగు మందుల అవసరం లేదు. అంటే కెమికల్ ఫ్రీ పంటలన్నమాట. అంతేకాదు కరువు, తెగుళ్లు, వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి. 

అందుకు కారణం దాదాపు అన్ని రకాల మిల్లెట్స్​కి పై పొర గట్టిగా ఉండడమే. మిల్లెట్స్ సాగును పెంచాల్సిన అవసరం ప్రపంచానికి ఉంది. కారణం.. కొన్నేండ్ల నుంచి ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న నీటి కొరత, సాగు భూమి తక్కువ​ అయిపోవడం, జనాభా పెరగడం లాంటి పరిస్థితుల్లో ఇండియాకి మిల్లెట్స్ సాగు తప్పనిసరి అని గట్టిగా చెప్పారు సైంటిస్ట్​లు. అయితే భారతీయులకు ఇది కొత్తేమీ కాదు. హరిత విప్లవానికి ముందు ఈ చిరుధాన్యాలే ఆహారం. 

ఎక్కడైనా పండించొచ్చు

వరి, గోధుమలతో పోలిస్తే మిల్లెట్స్​ పంట చాలా తక్కువ టైంలో చేతికి అందుతుంది. చాలా రకాల మిల్లెట్స్ పంట70 నుంచి 100 రోజుల్లో చేతికొస్తుంది. అదే వరి, గోధుమలు అయితే 120 నుంచి 150 రోజులు పడుతుంది. వాటితో పోలిస్తే మిల్లెట్స్​ పండించేందుకు నీళ్లు కూడా తక్కువగా పడతాయి. మిల్లెట్స్​కి 350 నుంచి 500 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం. వరి, గోధుమలకు దాదాపు1, 200 మిల్లీమీటర్లు కావాలి. 

అంటే వర్షపాతం తక్కువ ఉన్నా మిల్లెట్స్ పండుతాయి. ఇంకా బాగా అర్థం కావాలంటే వీటిని కొండ ప్రాంతాల్లో కూడా పండించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో  అనేక రకాల మిల్లెట్స్​ పండుతాయి. మన దగ్గర మాత్రం జొన్నలు, సజ్జలు, రాగులు, లిటిల్ మిల్లెట్ (సామలు), ఫాక్స్ టైల్ మిల్లెట్ (కొర్రలు), ప్రోసో మిల్లెట్ (వరిగెలు), బార్న్యార్డ్ మిల్లెట్ (ఊదలు), కోడో మిల్లెట్ (అరికెలు) ఎక్కువగా పండుతాయి. ప్రస్తుతానికి మార్కెట్లో వీటి రేట్​ కూడా ఎక్కువే!

పోషకాలు అధికం

బియ్యంతో పోలిస్తే మిల్లెట్స్​ ఆరోగ్యానికి మంచివి. వీటిలో గ్లూటెన్ ఉండదు. ప్రొటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్​, విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దాదాపు అన్ని రకాల మిల్లెట్స్​లో10 శాతం ప్రొటీన్, 3.5 శాతం లిపిడ్లు ఉంటాయి. రాగుల్లో ప్రొటీన్​ ఉంటుంది. తక్కువ కార్బోహైడ్రేట్స్​ ఉంటాయి.  జొన్నల్లో ఫైబర్, విటమిన్లు, క్యాల్షియం, జింక్, ఐరన్​, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్, మాంగనీస్‌ లాంటివన్నీ ఉంటాయి. వీటిపై చేసిన పరిశోధనల్లో చిరుధాన్యాలు ఆరోగ్యం మీద మంచి ప్రభావం చూపిస్తాయని తేలింది. ఇవి తింటే ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఆయుష్షు పెరుగుతుందని హెల్త్​ ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. అందుకే ఈ మధ్య సెలబ్రిటీలు, డాక్టర్లు, న్యూట్రిషన్​ ఎక్స్​పర్ట్స్​ మిల్లెట్స్​ లాభాల గురించి ప్రజలకు అవగాహన ​ కల్పిస్తున్నారు. అందుకు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారు కూడా.

చిరుధాన్యాల సంవత్సరం

మిల్లెట్స్ తినేవాళ్ల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఇండియా 2023ని ‘ఇంటర్నేషనల్​ ఇయర్​ ఆఫ్​ మిల్లెట్స్’​గా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని కోరింది. ఆ ప్రతిపాదనను72 దేశాలు సపోర్ట్​ చేశాయి. అందుకే 2023ని ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా పేర్కొంది. ప్రస్తుతం ఎన్నో రకాల చిరుధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఒక మనిషికి అవసరమయ్యే క్యాలరీల్లో 50 శాతం కంటే ఎక్కువ బియ్యం, గోధుమలు, మొక్కజొన్నలు మాత్రమే ఇస్తున్నాయి. 

చరిత్రలో మిల్లెట్స్

మిల్లెట్​చరిత్ర ఈనాటిది కాదు. కొన్ని వేల ఏండ్ల కిందటి నుంచే మిల్లెట్స్​ సాగు, ఆహారంగా తీసుకోవడం భారతీయుల సంస్కృతిలో భాగం. ఏడు వేల ఏండ్ల క్రితం మొదటిసారి ప్రోసో (వరిగెలు) అనే చిరుధాన్యాలను ఉత్తర చైనాలో పండించారు. తర్వాత మద్యధరా సముద్రం చుట్టూ ఉన్న రైతులు ఆ ప్రాంతంలో దొరికే చిరు ధాన్యాలను సేకరించి విత్తడం మొదలుపెట్టారు. అలా మిల్లెట్స్​ సాగు ప్రపంచమంతా మొదలైంది. కొన్ని దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మిల్లెట్స్​ ప్రధాన ఆహారం. కానీ.. అమెరికా, యూరప్​ల్లోని కొన్ని ప్రాంతాల్లో మిల్లెట్స్​ని ‘పెట్స్​ ఫుడ్’​గా చూస్తారు.

అదే ఇండియాలో అయితే దాదాపు అన్ని నాగరికతల్లో మిల్లెట్స్​ ఆనవాళ్లు కనిపిస్తాయి. మన దగ్గర మొదట్లో ముఖ్యంగా సాన్వా(బొంత సామలు), బ్రౌన్‌టాప్(అండు కొర్రలు), కోడో(అరికెలు) లాంటి మిల్లెట్స్​ ఎక్కువగా పండించేవాళ్లు. తర్వాత దాదాపు అన్ని రకాల మిల్లెట్స్​ ఇండియాలో సాగుచేశారు. క్రీస్తుపూర్వం100వ సంవత్సరం నాటికి మన దగ్గర దొరికే రకాలను పండించడంతోపాటు చైనా, ఆఫ్రికాల్లో పండే రకరకాల మిల్లెట్స్​ని దిగుమతి చేసుకుని సాగు చేయడం మొదలుపెట్టారు. రెండు వేల ఏండ్ల నాటి 20 రకాల మిల్లెట్స్​ మన దగ్గర తవ్వకాల్లో బయటపడ్డాయి. 

కరువు నేర్పిన పాఠం

2007– 2008 ఏడాదిలో వరి, గోధుమలే ప్రధాన ఆహారం. ఆ టైంలో ఆసియాలోని చాలా దేశాల్లో కరువు తలెత్తింది. పంటలు సరిగా పండక, తెగుళ్ల బారిన పడి దిగుబడులు బాగా తగ్గిపోయాయి. ధాన్యపు నిల్వలు తక్కువగా ఉండడంతో ఆహారవ్యవస్థ చాలావరకు దెబ్బతిన్నది. దాంతో కొన్ని దేశాలు బియ్యం ఎగుమతులు ఆపేశాయి. మిగతా సరుకుల ధరలు పెరిగిపోయాయి. ధాన్యం ధరలు నాలుగు నెలల్లోనే దాదాపు 50 శాతం పెరిగాయి. అప్పుడే అన్ని దేశాలు చిరుధాన్యాల ఇంపార్టెన్స్​ని గుర్తించాయి. బియ్యం, గోధుమలతోపాటు మిల్లెట్స్​ సాగు కూడా పెరిగితే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదనిపించింది. అందుకే అప్పటి నుంచి చాలా దేశాలు మిల్లెట్స్​ సాగు విస్తీర్ణం పెంచే పనిలోపడ్డాయి.
 
డిమాండ్​ పెరిగింది

ఇదివరకు పల్లె ప్రజలే ఎక్కువగా చిరుధాన్యాలని తినేవాళ్లు. ఇప్పుడు సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల బియ్యం కంటే మిల్లెట్స్​ ఎక్కువ రేటు ఉన్నాయి. దాంతో అధికాదాయ వర్గాల వాళ్లే వీటిని ఎక్కువగా తినగలుగుతున్నారు. కరోనా తర్వాత మిల్లెట్స్​ డిమాండ్​ మరింత పెరిగింది. కానీ అన్ని వర్గాలకు అందుబాటులో ఉండట్లేదు. మిల్లెట్​ సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మన దేశానికి19 శాతం గ్లోబల్​ షేర్ ​ఉన్నప్పటికీ, దేశంలోని మొత్తం ఆహార ఉత్పత్తిలో అది చాలా తక్కువ. ప్రపంచంలో ఎక్కువగా ఆఫ్రికన్​ దేశాల్లో, ఆసియా అంతటా ఉన్న చిన్నపాటి రైతులే వీటిని పండిస్తున్నారు. 

సాగు విస్తీర్ణం పెరిగి, ఉత్పత్తి​ పెరిగితే.. బియ్యం కంటే తక్కువ ధరకే ఇవి దొరికే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే వీటికి మార్కెట్ కూడా ఎక్కువే. కొన్ని కంపెనీలు ఇప్పుడు ట్రెండ్​ ఫాలో అవుతూ రకరకాలుగా మార్కెట్​ చేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశం ఏటా దాదాపు 170 లక్షల టన్నుల మిల్లెట్స్​ని ఉత్పత్తి చేస్తోంది. 2017–-18 నుండి 2020–-21 సంవత్సరాల్లో సగటున11 శాతం విస్తీర్ణంలోనే మిల్లెట్స్​ పండించారు. ఇది మొత్తం ఆహార ఉత్పత్తుల్లో 6 శాతం మాత్రమే. అయినప్పటికీ.. ఆసియా మొత్తంగా మిల్లెట్స్ ప్రొడక్షన్​లో​ 80 శాతం ఇండియాదే. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. 

విదేశాలకు ఎగుమతులు

మన దేశం మిల్లెట్స్​ని విదేశాలకు ఎగుమతి చేసింది. 2020–-21లో 26.97 మిలియన్ డాలర్ల విలువైన మిల్లెట్స్​ ఎగుమతి అయ్యాయి. యూఏఈ, నేపాల్, సౌదీ అరేబియా, లిబియా, ఒమన్, ఈజిప్ట్, ట్యునీసియా, యెమెన్, యూకే, అమెరికాలు ఇండియా నుంచి ఎక్కువగా మిల్లెట్స్​ దిగుమతి చేసుకుంటున్నాయి. కాగా ఇండోనేసియా, బెల్జియం, జపాన్, జర్మనీ, మెక్సికో, ఇటలీ, యూఎస్​, ఇంగ్లాండ్​, బ్రెజిల్, నెదర్లాండ్స్​ దేశాలు ఇతర దేశాల నుంచి మిల్లెట్స్​ని దిగుమతి చేసుకుంటున్నాయి. 

ప్రపంచానికి తిండి పెట్టాలంటే..

ప్రపంచ జనాభా 2050 నాటికి దాదాపు వెయ్యి కోట్లకు చేరుకుంటుందనేది ఒక అంచనా. మరి ఇలాంటి టైంలో పంటల్లో మార్పులు చాలా అవసరం. అప్పుడే జనాభాకు సరిపడా తిండి పండించొచ్చు. పౌష్టికాహారం అందించొచ్చు. ఇలా చేయడం ప్రభుత్వాల పనే. అధిక దిగుబడినిచ్చే ఆధునిక పంటలతోపాటు చీడపీడలను తట్టుకుని, తక్కువ నీళ్లతో చిరుధాన్యాలను పండిస్తేనే కరువుకాటకాలు వచ్చినా తట్టుకోవచ్చు. కాబట్టి ప్రపంచదేశాలన్నీ మిల్లెట్​ సాగు, వినియోగంలో ఇండియాను ఫాలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమిని కాపాడుకోవాలంటే ఇండియా ఫాలో అయ్యే ఆహార, వ్యవసాయ అలవాట్లని ప్రపంచమంతా చేసుకోవాలి అనేది రిపోర్ట్​ సారాంశం కూడా.

ఆసియా ఫుడ్​.. వరల్డ్​ నెంబర్​ వన్

రోజురోజుకీ కొత్త ఫుడ్​ ట్రెండ్స్ తెరపైకి వస్తుండడంతో వాటిని ఇష్టపడేవాళ్లు పెరుగుతున్నారు. అన్ని రకాల ఫుడ్​ టేస్ట్ చేయాలనే ఆలోచన పెరగడానికి గ్లోబల్ టూరిజం కారణంగా ఉంది. ఏసియా – పసిఫిక్ (apac) ప్రాంతానికి చెందిన మ్యారియట్ ఇంటర్నేషనల్ పోర్ట్ ​ఫోలియో అత్యంత రిచ్ హోటల్స్ గురించి ‘ఫ్యూచర్ ఫుడ్‌ రిపోర్ట్​ 2025’ని విడుదల చేసింది. ఈ రిపోర్ట్​లో 30 మంది చెఫ్​ల ఇంటర్వ్యూలు, మిక్సాలజిస్ట్​లు (మిశ్రమ శాస్త్రవేత్తలు), ఏసియా పసిఫిక్ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఇండస్ట్రీ వ్యక్తుల ద్వారా సేకరించిన సమాచారం ఉంది.

 దీని​ ప్రకారం ఆసియా వంటకాల పేర్లు ఫేమస్​ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ‘ఏసియన్ రెస్టారెంట్ వరల్డ్​లో నెంబర్​ వన్​’ కావడం ఖాయం. సెంట్రల్ లండన్​లోని వెస్టర్న్​ రెస్టారెంట్స్​తో పోలిస్తే ‘గ్లోబల్ సౌత్’ వంటకాలు, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోని వంటలు ఎక్కువ మిచెలిన్ స్టార్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ స్టార్స్ గౌరవానికి గుర్తుగా ఇస్తారు. 

కలినరీ టూరిజం

ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో కలినరీ టూరిజం పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంతాలు ప్రీమియర్ డైనింగ్ డెస్టినేషన్స్​ అయ్యాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ట్రావెలర్స్​ను ఆకర్షిస్తున్నాయి. అలా  ఫుడ్​ కోసమే వచ్చే ప్రదేశంగా ముంబయి కలినరీ క్యాపిటల్​గా మారనుంది. ముంబయిలోని టాప్​ రెస్టారెంట్స్​ అయిన ‘మాస్క్, ఎకా, నూన్​’లలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఏసియా పసిఫిక్​లోని కలినరీ క్యాపిటల్స్​గా మారబోయే పది దేశాల లిస్ట్​ తీసుకుంటే..

 ఇండోనేసియాలో బాలీ, దక్షిణ​ కొరియాలో బుసాన్, జెజు, వియత్నాంలో హో చి మిన్ సిటీ, మలేసియాలో మనీలా, ఇండియాలో ముంబయి, జపాన్​లో నిసెకో, చైనాలో షాంఘై, ఆస్ట్రేలియాలో టాస్మానియాలు ఉన్నాయి. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో కలినరీ టూరిజం ఏడాదికి15 శాతం పెరుగుతోంది. ఈ పెరుగుదల పర్యాటకరంగానికి లాభం చేకూరుస్తోంది.

ఇండియన్ ఫుడ్ కల్చర్​ ఇన్​స్పిరేషన్​

ఆసియా ఫుడ్ విషయానికొస్తే.. జపనీయుల వంటలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇన్​ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అలాగే టర్కీ, కోపెన్ హగన్, స్పెయిన్ వంటి దేశాలు దక్షిణ​ చైనా (కాంటోనీస్) వంటకాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇదిలాఉంటే ఇండియన్ ఫుడ్ కల్చర్​ మాత్రం చాలాదేశాలకు స్ఫూర్తినిస్తోంది. అందుకు కారణం ‘‘భారతీయ వంటకాల్లో జీలకర్ర, పసుపు, యాలకుల వంటి సుగంధద్రవ్యాలు వాడడం. తందూర్ వంటకాల తయారీ ప్రపంచవ్యాప్తంగా ఫుడ్​ లవర్స్​ని ఇన్​ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. కొత్త రుచులు అందించడం, క్రియేటివిటీతో కొత్త వంటకాలు వండడం వంటివి కూడా ఇందులో భాగమే” అని నార్​ రెస్టారెంట్ ఓనర్ ప్రతీక్ సాధు చెప్పారు. ఈ రెస్టారెంట్​ హిమాలయాల దగ్గర ఉంది.

ఒక్కమాటలో చెప్పాలంటే ఇండియన్ ఫుడ్​కి ప్రపంచం ఫిదా అవుతోంది. వెరైటీలు, రుచులు, వండే విధానం వంటివన్నీ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. మింటెల్ రీసెర్చ్ చేసిన ఒక స్టడీ ప్రకారం ఇండియన్స్ వెజిటేరియన్, వీగన్ ఫుడ్ తింటున్నారు. వాటిని ఎంచుకునేవాళ్ల సంఖ్య గత పదేండ్లలో 30 శాతం పెరిగింది. ఇండియన్ రెస్టారెంట్లలో కూడా ఇవే ట్రెండింగ్​గా మారాయి. రకరకాల ఫ్లేవర్లలో, ఇన్నొవేటివ్​గా వెజిటేరియన్​ డిష్​లు అందిస్తున్నాయి రెస్టారెంట్లు. అందువల్ల వాటిని ఇష్టపడేవాళ్ల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. 

స్పెషాలిటీ

ఇండియన్ ఫుడ్​ ప్రత్యేకత ఏంటంటే.. మన ఫుడ్​లో ఫ్లేవర్స్ కోసం రకరకాల సుగంధ ద్రవ్యాలను వాడడం. ఇవి వంట రుచిని పెంచుతాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ డాటా ప్రకారం గ్లోబల్ స్పైస్ మార్కెట్​లో మసాలా దినుసుల​కి పెద్ద పీట వేస్తున్నట్టు తెలుస్తోంది. వాటి డిమాండ్ ఎంతగా ఉందంటే ఇంటర్నేషనల్ వంటకాల్లో ఇండియన్ వంటకాలను చేర్చేస్థాయికి చేరింది.

 అది మాత్రమే కాదు.. భారతీయ వంటకాలు ప్రపంచంపై ప్రభావం చూపడానికి మరో కారణం చరిత్ర, విభిన్న రుచులు, వినూత్న పద్ధతులు. భారతీయ రెస్టారెంట్లకు పెరుగుతున్న ప్రజాదరణ, ప్రపంచ వేదికపై భారతీయ చెఫ్‌ల ప్రభావం, ఫ్యూజన్ వంటకాల పెరుగుదల, శాఖాహార విప్లవం, సుగంధ ద్రవ్యాల మార్కెట్ డెవలప్​మెంట్, కలినరీ టూరిజంలో విస్తరించడం.. ఇవన్నీ గ్లోబల్ ఫుడ్​ ముఖచిత్రాన్నే మార్చేస్తున్నాయని చెప్పొచ్చు.

డబ్ల్యూడబ్ల్యూఎఫ్

డబ్ల్యూడబ్ల్యూఎఫ్​ ​ అంటే...  వరల్డ్​ వైడ్ ఫండ్​. ఇది స్విట్జర్లాండ్​కు చెందిన ఇంటర్నేషనల్ నాన్​ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. 1961లో స్థాపించిన ఈ సంస్థ లక్ష్యం ప్రకృతిని సంరక్షించడం, జీవవైవిధ్యాన్ని ప్రమాదాల నుంచి కాపాడడం. దానికోసం లోకల్ కమ్యూనిటీల​తో కలసి ప్రకృతి వనరులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వైల్డ్​ లైఫ్​ని కాపాడడం, తిరిగి పునరుద్ధరించడం వంటివి చేస్తుంటుంది. దాదాపు వంద దేశాలతో కలిసి ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థనే ఇంతకుముందు ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, వరల్డ్ వైల్డ్ లైఫ్​ ఫౌండేషన్’​ అని పిలిచేవాళ్లు.  

మిల్లెట్స్ ట్రెండ్​ మంచిదే

‘‘పూర్వకాలంలో భారతదేశంలో మిల్లెట్స్ ఎక్కువగా తినేవాళ్లు. అందుకే సస్టెయినబిలిటీ స్థిరంగా ఉంది. కాకపోతే మధ్యలో ఆ ట్రెండ్​కి బ్రేక్​ పడింది. మళ్లీ ఈ మధ్య కాలంలో వాటికి ఆదరణ పెరుగుతోంది. అందుకు ప్రధానంగా ఊళ్లల్లో బియ్యం, గోధుమలు కొనలేని వాళ్లు చిరుధాన్యాలను తినడం, పండించడం ఒక కారణం. మరో కారణం అర్బన్​ ప్రజలకు చిరు ధాన్యాల ఇంపార్టెన్స్ తెలియడం,​ ట్రెడిషన్​లో భాగం కావడం వల్ల వాటి వాడకం పెరిగింది. అలాగని ఒక ప్రాంతం లేదా ఒక సిటీలో ఎక్కువగా వాడడం వల్ల మార్పు రాదు. దేశమంతటా ఆ మార్పు రావాలంటే వాటి గురించి ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్యంతో మొదలుపెట్టిన మిల్లెట్ మిషన్ అందరి దృష్టినీ ఆకర్షించింది’’ అని చెఫ్​ అనుమిత్ర చెప్పింది. 

ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్

సస్టెయినబిలిటీ అనేది ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పదం. వ్యవసాయానికి సంబంధించి సస్టెయినబిలిటీ అంటే.. మొక్కలు, జంతువుల ఉత్పత్తులతో పాటు ఫుడ్ కూడా ఉంది. తద్వారా పర్యావరణం, ప్రజల ఆరోగ్యం, జంతుజాతుల​కి రక్షణ లభిస్తుంది. ఇలా జరిగితే ముందు తరాల వాళ్ల​కి మేలు జరుగుతుంది. అందుకోసం ఫుడ్ ప్రొడక్షన్, నేచురల్ ఎకోసిస్టమ్​ని కాపాడుకోవడం అవసరం. సస్టెయినబుల్ ఫార్మింగ్ అంటే ఎకో ఫ్రెండ్లీ అగ్రికల్చర్ మాత్రమే కాదు. ప్రకృతి వనరులను కాపాడుకోవడానికి చేసే సాయం కూడా. దీనివల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడకం తగ్గించొచ్చు.

అర్బన్ అగ్రికల్చర్

లోకల్​ ఫుడ్​ సిస్టమ్​ అనేది మార్కెట్ల నుంచి ఇప్పుడు ఇళ్లలోకి వచ్చేసింది. ప్రపంచ జనాభా పెరిగేకొద్దీ సిటీలకు వచ్చేవాళ్లు పెరిగిపోతున్నారు. దాంతో ఇక్కడ అర్బన్ అగ్రికల్చర్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచమంతా కూడా ఆహార ఉత్పత్తి ఎలా చేయాలనే ఆలోచిస్తోంది. రైతులు ఇప్పటికే కొత్త ఆలోచనలు చేస్తున్నారు. రకరకాల పద్ధతులతో పర్యావరణానికి హాని కలిగించకుండా పంటలు పండించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పెరటి తోటలు, కమ్యూనిటీ గార్డెన్స్, మిద్దె తోటల వంటివి ఈ కోవలోకే వస్తాయి. నేలతో అవసరం లేకుండా పండించే హైడ్రోపోనిక్స్ కూడా ఈ జాబితాలో  చేరుతున్నాయి. ఈ పంటల వల్ల అర్బన్ గ్రీన్ హౌజ్​ ఎఫెక్ట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి.

ఆర్గానిక్ ఫార్మింగ్

కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడం కూడా ప్రకృతికి మేలు చేస్తుంది. నేచురల్ పెస్ట్ కంట్రోల్, బయోలాజికల్ ఫెర్టిలైజర్స్ వంటివి వాడడం వల్ల పర్యావరణానికి హాని కలగదు. ఫెర్టిలైజేషన్ వల్ల నేలలో ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది. అది కార్బన్ –డై– ఆక్సైడ్​ను వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఆర్గానిక్ ఫార్మింగ్‌ ద్వారా రైతులు నేలలోని నైట్రస్ ఆక్సైడ్, మీథేన్ వాయువుల విడుదలను తగ్గించొచ్చు. 

మేలు చేసే పాలీ కల్చర్

క్రాప్ రొటేషన్ పద్ధతి వల్ల సాగు దిగుబడి పెరుగుతుంది. కొత్త పంటలను వేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక పంట మరో పంట మెరుగవ్వడానికి సాయపడుతుంది. తక్కువ ప్లేస్​లో,  అందుబాటులో ఉన్న వనరులతోనే ఎక్కువ రకాలు పండించొచ్చు. 

పెర్మాకల్చర్ టెక్నిక్స్

ఫుడ్​ ప్రొడక్షన్​లో నేచురల్​ ఎన్విరాన్​మెంట్​లో పెరిగే వాటిలో ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువ. కాబట్టి వాటిని స్మార్ట్​గా సాగు చేస్తే వృథా తగ్గుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది. అందుకోసం పెర్మాకల్చర్ డిజైన్ టెక్నిక్స్ వాడాలి. అవేంటంటే... ధాన్యాలు, కూరగాయలు పండించడం. వాటిలో చిన్న మొక్కలు, తీగ జాతులు, బెడ్స్ మీద పండించేవి, నీళ్లలో పండించేవి ఎంచుకోవచ్చు.

ఆగ్రో ఫారెస్ట్రీ

ఒకే నేలలో ఎక్కువకాలం ఉండే పెద్ద చెట్లు వేయాలి. దీనివల్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల నేలకే కాదు ఆర్థికంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు కలుగుతుంది.

అననుకూల వాతావరణంలో..

‘ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్​ అగ్రికల్చర్ రీసెర్చ్’​ (ICAR) 109 కొత్త రకాల పంటలను పరిచయం చేసింది. అవి అస్థిర వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, నేల క్షీణత ఉండే ప్రాంతాలకు మేలు చేస్తాయి. ఇందులో 69 పంటలు పప్పులు, ధాన్యాలు, 40 పంటలు పండ్లు, ఔషధ మొక్కలు​. కొత్తగా తెచ్చిన పంటల్లో ఆయిల్ సీడ్స్, ఫోరేజ్, షుగర్, ఫైబర్ క్రాప్స్ ఉన్నాయి. వాటితోపాటు హార్టికల్చర్​కి సంబంధించిన వెజిటబుల్స్, దుంపలు, సుగంధద్రవ్యాలు, ఆకుకూరలు, పూలు వంటివి ఉన్నాయి. వాటిలో కొన్ని... బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, బార్లీ, జొన్న, రాగులు, బటానీ, సజ్జలు, ఓట్స్, మొక్కజొన్న, జొన్న, చెరకు, బక్వీట్, బీన్స్ రకాలతో సహా అనేక రకాల పంటలు ఉన్నాయి. 

కుసుమ, సోయాబీన్, వేరుశెనగ, నువ్వులు, పత్తి, జనపనార, ఉసిరికాయ వంటి నూనె గింజలు.. పండ్లలో మామిడి, దానిమ్మ, జామ, బేల్, పుచ్చకాయ ఉన్నాయి. కూరగాయల్లో బంగాళాదుంప, టొమాటో, పొట్లకాయ, బెండకాయ ఉన్నాయి. పువ్వులు (క్రోసాండ్రా, బంతి పువ్వు ), తోటల పంటలు (కొబ్బరి, కోకా, జీడి), సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు (అశ్వగంధ, మండూకపర్ణి, వెల్వెట్​ బీన్) వంటివెన్నో ఉన్నాయి. అయితే, వాతావరణ మార్పులు, నేల క్షీణతతో సంబంధం లేకుండా ఈ పంటలు వేసుకోవచ్చు. దానివల్ల ఆహారోత్పత్తికి ఇబ్బంది ఉండదు. దేశంలో ఆహార కొరత వచ్చే అవకాశం ఉండదు అని చెప్తోంది ఐకార్.

మనీష పరిమి